చికెన్ సెంటర్ల యాజమానుల సమ్మె..
మార్జిన్లను పెంచాలని ఆందోళనలు
నవ తెలంగాణ – బిజినెస్ బ్యూరో
తక్కువ లాభాల మార్జిన్లపై తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన చేపట్టింది. పౌల్ట్రీ కంపెనీల విధానాలను నిరసిస్తూ బుధవారం రాష్ట్రంలోని అన్ని చికెన్ దుకాణాలను మూసివేశారు. పౌల్ట్రీ కంపెనీలు ధరలు తగ్గించకుండా.. తమకు మార్జిన్లు ఇవ్వకుండా అడ్డగోలు దోపిడి చేస్తోన్నాయని.. దీనివల్ల తాము వ్యాపారాన్ని కొనసాగించడం కష్టమవుతోందని చికెన్ సెంటర్ నిర్వాహకులు వాపోతున్నారు. లాభాల మార్జిన్లను పునరుద్ధరించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తూ అనేక చోట్ల ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు హైదరాబాద్‌లోని దాదాపు 50 వేల చికెన్ దుకాణాలు మూసివేసి ఉంటాయని చికెన్ సెంటర్ల ప్రతినిధులు స్పష్టం చేశారు. గతంలో కిలోకు రూ.25-30 వరకు ఉండే వ్యాపారుల లాభం, ఇప్పుడు రూ.10కి పడిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు అద్దె, రవాణా, కార్మికుల వేతనాలతో కూడిన తమ నిర్వహణ ఖర్చులు కాలక్రమేణా పెరిగాయని వారు తెలిపారు. ఇది వరకు కిలో చికెన్‌పై తమకు రూ.26 లాభం ఉండేదని.. ఇటీవల పౌల్ట్రీ కంపెనీలు రూ.16కు తగ్గించాయని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డమీది రాజు తెలిపారు. ఇది ఎటూ సరిపోవడం లేదని.. కనీసం రూ.36కు మార్జిన్లను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 28 పౌల్ట్రీ కంపెనీలు గుత్తాదిపత్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. అవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగా సబ్సీడీలను పొందుతున్నప్పటికీ ఆ ఫలాలను వినియోగదారులకు చేర్చడం లేదన్నారు. తాము ఆందోళన చేపట్టిన తర్వాత పౌల్ట్రీ కంపెనీలు కిలో చికెన్ ధరను రూ.350 నుంచి రూ.250కి తగ్గించాయని.. ఇప్పుడేలా సాధ్యపడిందని ఆయన ప్రశ్నించారు. ఇది ఆ కంపెనీల వసూళ్లకు నిదర్శనమన్నారు.
కోడిగుడ్ల ధరల పతనం
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఎగుమతులకు ఆటంకం ఏర్పడటంతో నగరంలోని రిటైల్ షాపుల్లో కోడిగుడ్డు ధర గత కొన్ని రోజులుగా రూ.7 నుంచి రూ. 5కి పడిపోయింది. పశ్చిమాసియాకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడమే ఈ ధరల పతనానికి ప్రధాన కారణం. యుద్ధం నేపథ్యంలో పెరిగిన ఆందోళనలు, షిప్పింగ్ మార్గాల్లో అంతరాయాల కారణంగా ఆ ప్రాంతంలోని పలు కీలక ఓడరేవులు, విమానాశ్రయాలు ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుండి జరిగే కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి.



