పైరగాలిలో, పక్షుల గుంపులో, వాన చినుకులో, కొండవాగులో, మట్టి వాసనలో పుట్టిన సహజమైన కవిత్వం అందెశ్రీ సొంతం. ఆయన పాటలు జన బాహూళ్యాన్ని చైతన్యపరుస్తాయి, హృదయాలనూ ద్రవింపజేస్తాయి.
గొర్రెల కాపరిగా పని చేసినా, తాపీ పని చేసినా.. ప్రకృతినే బడిగా మల్చుకున్న అసాధారణ ప్రజ్ఞాశాలి. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంతో మమేకమైన అందెశ్రీ ఎన్నో భక్తి పాటలు, పద్యాలు పాడారు.
‘రామం భజే.. రామం భజే.. శ్రీరాముడు ఏమన్నాడు.. రామం భజే..’ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయిన అందెశ్రీని ‘దుక్కి దున్ని దుక్కి దున్ని బొక్కలిరిగెరా.. మా యన్న ఓ జీతగాడా పక్కా లిరిగెరా..’ సాగిన జనం పాట.. ఆయన్ని ప్రజాకవిగా అడుగులు వేసేలా చేసింది.
ఆ తరువాత విన్న ‘పల్లెటూరి పిల్లగాడా.. పశులుగాసే మొనగాడా.. పాలు మరచి ఎన్నాళ్లు అయ్యిందో..పాల బుగ్గల జీతగాడా..‘ పాట ఏకంగా ఉద్యమాలను ఆకళింపు చేసుకునేలా చేసింది.
దళిత ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం.. ఇలా అన్నింటిలోనూ పాల్గొన్న ఆయన ఎన్నో భిన్న పాటలతో ప్రజలను చైతన్య వంతులను చేశారు. ఆయన పాటలు ప్రజలను ఎంతగా ఊర్రూత లూగించాయో, అదే స్థాయిలో వారి హృదయాలను ద్రవింపజేశాయి. ప్రజా కవిగా ప్రజల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న అందెశ్రీ సినీ పాట ప్రయాణం కూడా యాదృచ్ఛికంగా జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల 1994వ సంవత్సరంలో ఆత్మహత్య చేసు కోవాలనే నిర్ణయానికి వచ్చిన అందెశ్రీకి ధైర్యం చెప్పి, సినిమా పాట వైపు అడుగులు చేసేలా యలిమంచిలి శేఖర్ ప్రేరణ ఇచ్చారు.
2004లో ఆర్.నారాయణమూర్తి నిర్మించిన ‘వేగుచుక్కలు’ చిత్రం కోసం అందె శ్రీ రాసిన ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా..ఆదికే ఇది పాదురా.. కాదంటే ఏది లేదురా.. జాతిగుండెలో జీవనదముల-జాలువారే జానపదముల.. గ్రామమును కాపాడ వెలిసిరి గ్రామదేవతలెందరో..‘ పాటను వాడుకున్నారు.
ఒక తల్లి తన పిల్లలను కాపాడుకున్నట్లే గ్రామాదేవతలు కూడా గ్రామాన్ని అలాగే కాపాడుకుంటారని, అలాగే అమ్మను, అమ్మతనాన్ని ఎంతో అద్భుతంగా అందెశ్రీ ఈ పాటలో వివరించారు.
2006లో విడుదలైన ‘గంగ’ చిత్రం కోసం రాసిన ‘వెళ్ళిపోతున్నావా తల్లి..‘ అంటూ సాగే పాట అందెశ్రీకి ఉత్తమ గీత రచయితగా ప్రతిష్టాత్మక నంది అవార్డుని తీసుకొచ్చింది.
‘మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ.. మనావత్వం ఉన్న వాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు.. ఏడ ఉన్నడో కానీ కంటికీ కానరాడు‘ అంటూ స్వార్థంతో మానవత్వాన్ని మరచిన మనుషుల వైనాన్ని ఎత్తి చూపుతూ రాసిన పాటను 2007లో ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన ‘ఎర్రసముద్రం’ చిత్రంలో వాడారు.
ఈ పాటతో అందెశ్రీ పేరు సర్వత్రా మారు మోగిపోయింది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రం కోసం ఆయన రాసిన జనజాతరలో మన గీతం మరో ఆణిముత్యంగా నిలిచింది. ‘జన జాతరలో మనగీతం-జే గంటలు మోగించాలి.. ఒకటే జననం ఓహో.. ఒకటే మరణం ఆహా.. జీవితమంతా ఓహో.. జనమే మననం ఆహా..‘ అంటూ ఉద్యమానికి ఊపునివ్వడంతోపాటు నిద్రాణమై ఉన్న తెలంగాణ రణ నినాదాన్ని రగిలించిన ఈ పాట అందెశ్రీ కలం నుంచి జాలు వారిందే. అందెశ్రీ సినీ పాట ప్రస్థానంలో ఆర్.నారాయణమూర్తి సినిమాలకే ఎక్కువ పాటలు రాశారు. అలాగే ‘బతుకమ్మ’ చిత్రానికి పాటలు రాయడంతోపాటు సంభాషణలు కూడా రాశారు. దాదాపు 30 సినిమాలకు పాటలు రాసిన ఆయన ప్రేక్షకుల మనసులపై తనదైన పాట సంతకం చేశారు. అందె శ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం..’ తెలంగాణ రాష్ట్ర గీతంగా వినతికెక్కింది. అనామకుడి నుండి అందెశ్రీగా ఎదిగిన ఆయన ఆసాధారణ ప్రయాణం స్ఫూర్తిదాయకం.
ప్రజాకవి అందెశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు ఆయన నా చిత్రాలు ‘ఊరు మనదిరా, ఎర్ర సముద్రం, వేగు చుక్కల’కు అమోఘమైన పాటలు ఇచ్చి, చిత్ర విజయాలకు ఎంతో దోహదం చేశారు. ‘ఎర్ర సముద్రం’లో మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్న వాడు.. అనే పాట తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది. అదీ ఆ పాట గొప్పతనం. ‘ఊరు మనదిరా’లోని ‘చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి’ అనే పాట తెలంగాణా ఉద్యమంలో అమోఘమైన రోల్ ప్లే చేయడమే కాదు నాటికి నేటికి ఏ నాటికి చిరస్థాయిగా ఉంటుంది. అలాగే ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా’ అనే పాట కూడా. అన్నింటినీ మించి ‘జయ జయహే తెలంగాణా’ పాటతో ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి, గౌరవించి తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి అమలు చేస్తున్నది. ఎంతో అనుబంధం ఉన్న అందెశ్రీ ఇక లేరనే వార్తని జీర్ణించుకోలేకపోతున్నాను.
–ఆర్.నారాయణ మూర్తి
లోకకవిగా పేరొందిన అందెశ్రీతో నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. నాకంటే చిన్నవాడే అయినప్పటికీ నా కళ్ళ ముందే గొప్పగా కవిగా రాణించి ఎంతగా ఆశ్చర్యపరిచాడో.. ఇప్పుడు మరణంతోనూ అంతకంటే ఎక్కువ ఆశ్చర్య పరిచాడు. నేను రాసిన స్మృతిగీతం అనే పుస్తకాన్ని అందెశ్రీ తన ప్రచురణ సంస్థ వాక్కులమ్మ ద్వారా ప్రచురించారు. ‘నది’ అనే కావ్యం కోసం ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నది మూలాలను సందర్శించారు. గొప్ప మానవతావాది. రాష్ట్ర గీతాన్ని రచించి, తెలంగాణ విశ్వకవిగా మన మనసుల్లో నిలిచిపోయిన ఆయనకు మా అమ్మనాన్నలు సుద్దాల హనుమంతు, జానకమ్మ జాతీయ అవార్డుని అందించాం. – సుద్దాల అశోక్‌తేజ



