అర్హులందరికీ ఓటు హక్కు కోసం పోరాడతాం
సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి
నితీశ్ మత రాజకీయాలకు చరమగీతం పాడతాం
అధికార పార్టీకి ఈసీ కొమ్ము కాస్తోంది
కేరళలో హ్యాట్రిక్ విజయం సాధిస్తాం : ‘దేశాభిమాని’ ఇంటర్వ్యూలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు లబ్ది చేకూర్చవద్దని ఆప్‌కు హితవు
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ పతనానికి బీహార్ ఎన్నికలే నాంది పలుకుతాయని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ చెప్పారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో మతతత్వ శక్తులతో జట్టు కట్టిన నితీష్ కుమార్ ఓటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియపై విమర్శలు సంధిస్తూ కొత్తగా ఓటర్లను చేర్చుకోవడంపై కంటే ఓటర్ల తొలగింపు పైనే ఈసీ దృష్టి పెట్టినట్లు కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో గతంలో కంటే మరిన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నావని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మహాగట్‌బంధన్‌లో కొన్ని పార్టీలు కొత్తగా చేరినందునే సీట్ల సర్దుబాటులో జాప్యం జరుగుతోందని తెలిపారు. ‘దేశాభిమాని’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బేబీ పలు అంశాలపై స్పందించారు.
బీహార్‌లో ఇండియా కూటమి ఎలాంటి విజయాలు సాధిస్తుందని మీరు ఆశిస్తున్నారు?
బీహార్‌లో ప్రజాతంత్ర, లౌకిక పార్టీలు విస్తృత కూటమిగా ఏర్పడ్డాయి. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాలన్న ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల భావజాలాన్ని తిప్పికొట్టడానికి రాష్ట్రం సిద్ధంగా ఉంది. నితీష్ కుమార్ మత రాజకీయాలకు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షం ఉంది. ఆయన మతతత్వ శక్తులతో జట్టు కట్టారు. అనేక మంది ప్రజలు ఈ పొత్తును విమర్శిస్తున్నారు. నేను బీహార్‌లో మూడు సార్లు పర్యటించాను. పార్టీ మహాసభల తర్వాత ఓ పార్టీ సమావేశం నిమిత్తం మొదటిసారి బీహార్ వెళ్లాను. అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాను. నితీష్ కుమార్ విధానాలతో 20 సంవత్సరాలు నష్టపోయామని ప్రజలు చెప్పారు.
జూలై రెండో తేదీన రెండోసారి రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్యతో కలిసి బీహార్‌లో పర్యటించాను. ‘సర్’కు వ్యతిరేకంగా పాట్నాలో జరిగిన ఓట్ అధికార యాత్రలో పాల్గొన్నాము. సుభాషిణి అలీ, అశోక్ ధావలే వంటి ప్రముఖ నేతలు కూడా దీనికి హాజరయ్యారు. సెప్టెంబర్ 1న జరిగిన మూడో పర్యటనకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనేక కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత నాకు ఒక విషయం స్పష్టమైంది. నితీష్ విద్వేష రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. బీహార్‌లో ప్రజాతంత్ర, లౌకిక, ప్రగతిశీల శక్తులు అధికారంలోకి రావాలని వారు కోరుకుంటున్నారు.
ఎన్నికల్లో జరిగే అవకతవకలను నివారించడానికి ‘సర్’ అత్యుత్తమ ప్రయత్నమని, దానిని పౌరులు స్వాగతించారని ఎన్నికల కమిషన్ చెబుతోంది. దీనిపై ఏమంటారు?
ఎన్నికల కమిషన్ ప్రకటన, సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వీటి మధ్య స్పష్టమైన వైరుధ్యం ఉంది. ఎన్నికల్లో 12వ గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డును అనుమతించాల్సి ఉంటుంది. దీనిని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పరిగణనలోకి తీసుకున్నారా? మోడీ ప్రభుత్వం గట్టిగా మద్దతు ఇస్తున్నందునే ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోంది. తాజాగా ఓ వార్త వచ్చింది. ఒక ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించాడు. భయభ్రాంతులకు గురి చేసే వాతావరణానికి, రాజకీయ ప్రభావానికి ఈ ఘటన అద్దం పడుతోంది.
శాంతి భద్రతలు, ఎన్నికల కమిషన్‌పై మోడీ ప్రభుత్వం తన పెత్తనాన్ని పెంచుకుంటోంది. వారి మద్దతుతోనే జ్ఞానేష్ కుమార్ పదవిలో కొనసాగుతున్నారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. కానీ దీనిని ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుత కమిషనర్లను మోడీయే ఎంపిక చేశారు.
బీహార్‌లో ఎన్నికల ప్రకటనకు ముందు బీహారీ మహిళలకు రూ.10,000 ఇస్తామని మోడీ ప్రభుత్వం, నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. ఇది లంచం ఇవ్వడం వంటిదే. అయినా దీనిపై ఎన్నికల కమిషన్ మౌనం వహించింది. బీహార్‌లో పరిస్థితి ఎలా ఉన్నదంటే ఫుట్‌బాల్ మ్యాచ్ అడుతున్న జట్లలో ఒక దానిలో రిఫరీ చేరినట్లు. ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉండాలి. కానీ అది అది ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఏదేమైనా మహాగట్‌బంధన్‌తో కలిసి ఈ అపవిత్రమైన పరిస్థితిని అధిగమించాలని బీహార్ ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇది బీజేపీకి లాభిస్తుందా? వారు ఇండియా కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయా?
ఆమ్ ఆద్మీ పార్టీ స్వతంత్రంగా పోటీ చేయకుండా మేము అడ్డుకోలేము. కానీ నా సలహా స్పష్టంగా ఉంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ప్రయోజనం కలిగించేలా ఉంటే వారు ఎన్నికల్లో పాల్గొనకూడదు.
మహాగట్‌బంధన్‌లో సీట్ల కేటాయింపుపై చర్చల్లో జాప్యం జరుగుతున్నట్లు కన్పిస్తోంది. ఎందుకని?
కూటమిలో కొన్ని కొత్త పార్టీలను చేర్చుకోవడం వల్ల జాప్యం జరుగుతోంది. సీట్ల పంపిణీలో ఆ పార్టీలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన పార్టీ చర్చలు మొదలు పెట్టింది. కలసికట్టుగానే ఒప్పందానికి వస్తారు. ఆర్జేడీ ఇప్పటికే మాతో సహా అన్ని పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించింది. కాబట్టి సీట్ల కేటాయింపు గతంతో పోలిస్తే ఇప్పుడు భిన్నంగా ఉంటుంది. నితీష్ పాలనకు ముగింపు పలకడమే మా లక్ష్యం.
ఎన్నికలకు కేరళ సిద్ధమవుతోంది. శబరిమల బంగారం ఉదంతం ఫలితాలపై ప్రభావం చూపుతుందా?
సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అంకితభావంతో పనిచేసే పర్యవేక్షక కమిటీ విచారణ జరుపుతోంది. ఈ విషయంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారు. దేశంలో అత్యుత్తమ పోలీస్ దర్యాప్తు వ్యవస్థలను కలిగిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. బంగారం అంశం ఎన్నికలపై ప్రభావం చూపదు. వరుసగా ఎల్డీఎఫ్ మూడోసారి హ్యాట్రిక్ సాధించి అధికారంలోకి వస్తుంది. ఎల్‌డీఎఫ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి గతంలో ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలు ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రభావం చూపలేకపోయాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన చర్యలకు విశేష మద్దతు లభిస్తోంది. అది మారబోదు.
‘సర్’ను అమలు చేసిన తర్వాత కొన్ని జిల్లాల్లో ఓటర్ల జాబితాల నుంచి 5-12 శాతం మందిని తొలగించారు. కొన్ని చోట్ల కొత్తగా ఓటర్లను చేర్చారు. దీనిపై సీపీఐ (ఎం) పరిశీలన జరుపుతుందా?
ఓటు వేయాలని అనుకునే ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం కల్పించాల్సిందే. ఆ బాధ్యత ఎన్నికల కమిషన్‌ది. కానీ ఓటర్ల జాబితాల నుంచి తొలగింపుల పైనే అది దృష్టి సారించినట్లు కన్పిస్తోంది. ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నేతృత్వంలో జరిగిన తొలి ఎన్నికల్లో పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజు మోడీ హయాంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కమిషన్ ఉల్లంఘిస్తున్నట్లు కన్పిస్తోంది. బ్యాలెట్ అవకాశాలను పరిమితం చేస్తోంది. ఈ ప్రాథమిక హక్కు కోసం బీహార్ పోరాడుతోంది. రాష్ట్రంలోని అర్హుడైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించేలా మా పోరాటాన్ని కొనసాగిస్తాం.
గత ఎన్నికల్లో సీపీఐ (ఎం) పనితీరు బాగుంది. బీహార్‌లో నాలుగు స్థానాలకు పోటీ చేసి రెండింటిని గెలుచుకుంది. ఈసారి మరిన్ని సీట్లు డిమాండ్ చేస్తారా?
రాష్ట్రంలో మరిన్ని స్థానాల్లో పోటీ చేసే విషయంపై చర్చలు మొదలు పెట్టాము. ప్రణాళిక రూపొందించుకున్నాము. దీనిపై తేజస్వి యాదవ్‌తో చర్చించాను. కానీ వివరాలు పంచుకోలేను. సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ ఈ విషయంలో క్రియాశీలకంగా పనిచేస్తోంది.