బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బోథ్ నియోజకవర్గంలో సర్పంచులకు ఆత్మీయ సన్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఏ ఒక్క హామీ నెరవేరలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయిందనీ, రాబంధు పాలన వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బోథ్ నియోజకవర్గ పరిధిలో నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికమంది పండించేది పత్తి పంట అని వివరించారు. దాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చాక పత్తి రైతు చిత్తయ్యారని అన్నారు. సోయా రైతులను పట్టించుకునే వాళ్లు లేరని చెప్పారు.
రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తున్నదని అన్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆదిలాబాద్, ఖానాపూర్, కాగజ్‌నగర్ వంటి సీట్లను కోల్పోయామని వివరించారు. రెండేండ్ల తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందనీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఎమ్మెల్యే అనిల్ యాదవ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరుస్తామని చెప్పి స్వయంగా అమిత్‌షా మాట ఇచ్చి తప్పిండని విమర్శించారు. బీజేపీకి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తున్నదని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో కలిసి పనిచేయాలని కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లోనూ మంచి విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.



