Tuesday, April 29, 2025
Navatelangana
Homeప్రధాన వార్తలువడ్ల రైతు వర్రీ

వడ్ల రైతు వర్రీ

  • -లారీలు పంపరూ.. బస్తాలు ఇవ్వరూ..!
    – బాయిల్డ్‌ మిల్లులు లేక బాధలు
    – మిల్లర్ల ఇష్టారాజ్యం
    – క్వింటాకు 5 కేజీలు కోత
    ”ధాన్యం రైతులు ప్రా’ధాన్యం’ కోల్పోతున్నారు. రూ.500 బోనస్‌ కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్తే ‘…అమ్మబోతే అడవి’ చందంగా వారి పరిస్థితి మారుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రా మిల్లులు ఎక్కువగా, బాయిల్డ్‌ మిల్లులు తక్కువగా ఉండటం రబీ కొనుగోళ్లకు ప్రతిబంధకంగా మారింది. ఇదే అదనుగా మిల్లర్లు ఆడిందే ఆట అనేలా వ్యవహరిస్తూ.. క్వింటాకు 5 కేజీల చొప్పున తరుగు తీస్తూ.. రైతును దగా చేస్తుండటంపై ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనం…

    నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
    ధాన్యం కొనుగోళ్లలో కిలో తరుగు తీసినా చర్యలు తప్పవని మంత్రులు, ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. కలెక్టర్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు నిరంతరం మిల్లర్లతో మీటింగ్‌లు పెట్టి పర్యవేక్షిస్తున్నా.. బాయిల్డ్‌ మిల్లులు లేని జిల్లాల్లో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తేమ నిర్దేశిత 17శాతంలోపు ఉన్నా.. వడ్ల నాణ్యత బాగున్నా.. తూర్పర పట్టలేదనో.. మరేదైనా కారణం చూపి కొనుగోళ్లకు మిల్లర్లు విముఖత తెలుపుతున్నారు. క్వింటాకు 5 కేజీల కోతకు అంగీకరిస్తే మాత్రం వెంటనే కాటాలు పెడుతున్నా రు. ఖమ్మం జిల్లాలో మొత్తం 72 మిల్లులు ఉండగా దీనిలో ఐదు మాత్రమే బాయిల్డ్‌ మిల్లులున్నాయి. వీటిలోనూ రెండు వివిధ కారణాలతో బాయిల్డ్‌ బదులు రా మిల్లులుగానే నిర్వహిస్తున్నారు. ఇవి పోను 67 రా మిల్లులున్నాయి. రా మిల్లుల్లో రబీ ధాన్యం మరాడిస్తే బియ్యం పగిలిపోయి.. నూక ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని తెలుస్తోంది. అవి ఏ రకం మిల్లులైనా తరుగు లేకుండా ధాన్యం కొనాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ సైతం ఐదారు రోజుల క్రితం ముదిగొండ మండలంలోని మిల్లులను సందర్శించారు. రైతులు ఫిర్యాదు చేయటంతో కోత పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.15 రోజులైనా ఒక్క లారీ రావట్టే..ఖమ్మం జిల్లావ్యాప్తంగా రబీ సీజన్‌లో డీఆర్‌డీఏ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 351 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లక్ష్యం మేరకు 351 కేంద్రాలు నెలకొల్పారు. వీటిలో 204 కేంద్రాలు మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. దాదాపు ఉగాది (మార్చి 30) తర్వాత జిల్లాలోని కొనుగోలు కేంద్రాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభమయ్యాయి. కేంద్రాలు తెరుచుకొని దాదాపు 20 రోజులకు పైగా అవుతోంది. కానీ ఇప్పటి వరకు కొన్ని కొనుగోలు కేంద్రాలకు ఒక్క లారీ కూడా వెళ్లలేదు. కొన్ని కేంద్రాల్లో ఒకటి, రెండు లారీల లోడ్‌లను మిల్లులకు తరలించారు. కానీ అక్కడ రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు నెల అవుతున్నా ఇప్పటి వరకు 5,592 మంది రైతుల నుంచి 46,032.600 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.
    కొర్రీలతో వేగలేక..మిల్లర్ల కొర్రీలు, క్వింటాకు 5 కేజీల తరుగు, తూర్పర పట్టలేదనే సాకు, లారీలు పంపక పోవటం, గన్నీ బ్యాగుల కొరత, హమాలీలు అందుబాటులో లేకపోవటం, కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు.. అకాల వర్షాలు వెంటాడుతున్న నేపథ్యంలో ప్రయివేటుగా విక్రయిం చుకునే స్థితికి రైతులు నెట్టివేయ బడుతున్నారు. పచ్చి వడ్లనే క్వింటా రూ.1900 నుంచి రూ.1960 వరకు విక్రయిస్తున్నారు. మొదట్లో క్వింటా రూ.1960కి కొనుగోలు చేసిన వ్యాపారస్తులు ఇప్పుడు రూ.1910 మాత్రమే ధర పెడుతున్నారు. మిల్లర్ల కొర్రీలు.. మిల్లర్లు మిల్లుకు వచ్చిన లారీ లోడ్‌ను మూడు, నాలుగు రోజుల పాటు దిగుమతి చేసుకోకుండా ఉంచుతున్నారు. క్వింటాకు 5 కేజీల కోతకు అంగీకరిస్తేనే కాటాలు పెడుతున్నారు. లేదంటే హమాలీలు లేరనో.. వడ్లు తూర్పార పట్టలేదనో.. మరేదైనా కారణం చూపి.. నాలుగు రోజుల పాటు లారీని దిగుమతి చేసుకోకుండా ఉంచుతున్నారు. తరుగుకు ఒప్పుకున్న వెంటనే వేబ్రిడ్జిపై తూకం వేస్తున్నారు.
    ధాన్యం తరుగుపై రైతుల ఆందోళన
    ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల ఇష్టారాజ్యాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లాలోని వైరా మార్కెట్‌ యార్డు ఎదుట రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. క్వింటాకు 5 కేజీలు తరుగు తీస్తున్నారని ఆందోళన చేపట్టారు. మిల్లర్లను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. ఎగుమతులు లేక విలవిల..తిరుమలాయపాలెం మండలం బీరోలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈనెల 11వ తేదీన ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క లారీని మాత్రమే ముదిగొండ మండలంలోని మిల్లుకు పంపారు. రైతులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్‌ కార్యాలయాన్ని సోమవారం ఆశ్రయించడంతో సాయంత్రానికి ఓ లారీని పంపుతామని అధికారులు చెప్పారు. తల్లాడ మండల కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించి 20 రోజులైనా ఇంత వరకూ ఒక్క లారీ లోడ్‌ కూడా ఎగుమతి కాకపోవడం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు