Saturday, January 31, 2026
E-PAPER
Homeజాతీయంరైతే గెలిచాడు

రైతే గెలిచాడు

- Advertisement -

దిగొచ్చిన మహారాష్ట్ర సర్కార్‌
అన్నదాతల డిమాండ్లు పరిష్కరిస్తామని సీఎం ఫడ్నవీస్‌ హామీ
ముగిసిన కిసాన్‌ లాంగ్‌మార్చ్‌

నాసిక్‌ : హక్కుల కోసం ఉద్యమించిన రైతన్న విజయం సాధించాడు. అన్నదాతల డిమాండ్లు పరిష్కరిస్తామని మహారాష్ట్ర సర్కార్‌ లిఖితపూర్వక హామీ ఇచ్చింది. దీంతో కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ ముగుస్తున్నట్టు అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ప్రకటించింది. సుమారు 40వేల మందికిపైగా రైతులు మహిళలు, వృద్ధులు అనే తేడాలేకుండా నాసిక్‌ నుంచి ముంబయికి కాలినడకన మహాపాదయాత్ర నిర్వహించారు. వంద కిలోమీటర్ల వరకూ కదం తొక్కారు. చలి, ఎండను సైతం లెక్క చేయకుండా ప్రదర్శన కొనసాగింది. ఈ లోపు చర్చలకు రమ్మని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఇతర మంత్రులు కబురు పంపారు. ఏఐకేఎస్‌ నాయకులతో జరిగిన చర్చల్లో.. రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులు తమ భూముల హక్కుల కోసం దరఖాస్తులను పున్ణపరిశీలన చేయించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని కూడా హామీ ఇచ్చింది. అటవీ హక్కుల చట్టంలో నిర్దేశించిన విధంగా గ్రామ కమిటీల నివేదికలు ,రెండు రకాల ఆధారాల ఆధారంగా సబ్‌-డివిజనల్‌ అధికారి నేతృత్వంలోని కమిటీ అటవీ హక్కులను మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. దీని తర్వాత, నాసిక్‌ జిల్లా నుంచి వేలాది దరఖాస్తులను నిరసన స్థలంలోనే సేకరించారు. నాసిక్‌ జిల్లా కలెక్టర్‌ ఈ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఈ ఉద్యమ సామూహిక నాయకత్వం తరపున మాజీ ఎమ్మెల్యే జె.పి. గావిట్‌ నాసిక్‌ లాంగ్‌ మార్చ్‌ విజయవంతంగా ముగిసిందని ప్రకటించారు. అయితే ఈ మహా పాదయాత్ర తాత్కాలిక విరామమేనని, తమ డిమాండ్లు పరిష్కారం కానట్లయితే పోరుబాట పడతామని ఏఐకేఎస్‌ నాయకులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -