Thursday, December 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్నికలను బహిష్కరించిన ఎర్రవెల్లి రైతులు

ఎన్నికలను బహిష్కరించిన ఎర్రవెల్లి రైతులు

- Advertisement -

ఎర్రవెల్లి, గోకారం భూనిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్‌
అండగా నిలిచిన సీపీఐ(ఎం)

నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
”మేం ఏం పాపం చేశాం.. గ్రామసభల తీర్మానం లేకుండానే నష్టపరిహారం నిర్ధారణ చేయకుండానే భూములను ఎలా సేకరిస్తారు.. న్యాయమైన ధర నిర్ణయించి రైతుల అంగీకారముంటేనే భూములు సేకరించాలని చట్టాలు చెబుతున్నాయి.. కానీ, మమ్మల్ని ఆదుకోవడం లేదు.. భూమికి భూమి ఇచ్చే వరకు ప్రభుత్వానికి సహకరించేది లేదు.. గ్రామపంచాయతీ ఎన్నికలే కాదు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏ ఎన్నికలైనా బహిష్కరిస్తాం” అంటూ ఎర్రవెల్లి, గోకారం భూనిర్వాసిత రైతులు హెచ్చరించారు. బుధవారం జరిగిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎర్రవెల్లి గ్రామస్తులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. చారగొండ మండలం ఎర్రవల్లి, గోకారం రిజర్వాయర్‌లో 550 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. ఎర్రవెల్లి, ఎర్రవెల్లి తండా, గోకారం, జెపల్లి గ్రామాలలో రైతులు 1600 ఎకరాల సాగు భూమి కోల్పోతున్నారు. ముంపు నివారణ చర్యలు చేపట్టే వరకు తాము ఓట్లు వేయబోమంటూ ఎర్రవల్లి గ్రామస్తులు 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ గ్రామంలో 659 మంది ఓటర్లున్నారు.

ఈ దీక్షలకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింత ఆంజనేయులు, వంగూరు, చారగొండ మండలాల కార్యదర్శి బి.బాలస్వామి సంఘీభావం తెలిపి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భూములు తీసుకునే విషయంలో ప్రభుత్వం రైతులకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. రైతులు ఎంత భూమిని కోల్పోతున్నారో అంత వేరే చోట చూపించి వారికి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. అందరం ఐక్యంగా ఉంటూ గ్రామాన్ని కాపాడుకుంటామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ దీక్షలు కొనసాగిస్తామని, దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో ఎర్రవెల్లి, గోకారం రిజర్వాయర్‌ నిర్వాసితుల పోరాట కమిటీ నాయకులు ఏకుల ప్రకాష్‌, పెద్దయ్య గౌడ్‌, నేనావత్‌ నాగయ్య, మునావత్‌ సంజీవ, అలవాల శేఖర్‌, ఏకుల పర్వతాలు, నేనావత్‌ రాంభూపాల్‌, బలరాం, మునావతి దేవేందర్‌, మునావత్‌ గోపి, సూగురి శ్రీరాములు, ప్రేమయ్య, మోత్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -