– శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలించిన అనంతరం నిపుణుడు కన్నయ్యనాయుడు
శ్రీశైలం : శ్రీశైలం ఆనకట్టకు కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ మెకానికల్ విభాగం నిపుణుడు, సలహాదారుడు, గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు తెలిపారు. శ్రీశైలం గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. మరో ఐదేళ్లకైనా రేడియల్ క్లస్టర్ గేట్లు కొత్తవి తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదివారం ఆయన శ్రీశైలం ఆనకట్టను, గేట్లను పరిశీలించారు. ముందుగా జలాశయానికి నీటిప్రవాహం, వార్షిక మరమ్మతుల పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో కన్నయ్యనాయుడు మాట్లాడుతూ ఆనకట్టపై ఉన్న పదో గేటు ద్వారా వచ్చే లీకేజీ పది శాతం కంటే తక్కువగా ఉన్నందున గేటుకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపారు. రేడియల్ క్రస్ట్ గేట్లను క్రమం తప్పకుండా వార్షిక మరమ్మతులతోపాటు పెయింటింగ్ చేయాలని అధికారులకు సూచించారు. జలాశయానికి వార్షిక మరమ్మతులో భాగంగా గత రెండు, మూడు నెలలుగా మరమ్మతులు చేసినప్పటికీ ఎక్కువగా నీరు లీకేజీ అవుతుండడంతో అధికారులు రబ్బర్ సీల్ వేశారని వివరించారు. మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.1.30 కోట్ల నిధులను కేటాయించిందని, గేట్ల నిర్వహణకు మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఆనకట్ట దిగువ భాగాన ఉన్న ప్లంజ్‌పూల్ సమస్యపైనా, ఆనకట్ట భద్రతపైనా పలు అధ్యయన బృందాలు పరిశీలించాయని తెలిపారు. ఆనకట్టకు 60 మీటర్ల దూరంలో ప్లంజ్‌పూల్ ఉండడం వల్ల ఆనకట్టకు ఎలాంటి ప్రమాదమూ ఉండదని వివరించారు. పదవ గేటు లీకేజీని జీరో స్థాయికి తీసుకురావడానికి అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. 2009లో భారీ వరదల వల్ల ఒక గేటుపై నుండి ఎఫ్‌ఆర్‌ఎల్ మించి తొమ్మిది అడుగుల మేర 1.30 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలైందని చెప్పారు. 2010 నుండి గేట్లకు పెయింటింగ్ పనులు సరిగా చేయకపోవడం వల్ల కొంత తుప్పు పట్టాయని తెలిపారు. ఆనకట్ట గేట్లు ఏర్పాటు చేసి 40 సంవత్సరాలు దాటిందని, పెయింటింగ్, రబ్బర్ సీల్ అన్ని సరిగా చేసుకుంటే మరో ఐదేళ్ల వరకు పరవాలేదని చెప్పారు. తుంగభద్ర మాదిరిగా 70 సంవత్సరాల వరకు ఉండకూడదని అధికారులకు సూచించారు. ప్లంజ్‌పూల్‌లో ఏర్పడిన గొయ్యి వల్ల డ్యాముకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఇక్కడి డ్రెయినేజీలో నీళ్లు కూడా లేవని, మిగిలిన డ్యాములలో డ్రెయినేజీ నీళ్లు నిలువ ఉంటున్నాయని వివరించారు. ఎక్కువ వరద నీటి ప్రభావం వల్ల కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లోని రక్షణ గోడలకు బీటలు పడితే విద్యుత్తు కేంద్రాలకు కొంతమేరకు ముప్పు ఉంటుందని తెలిపారు. ఆయన వెంట డ్యామ్ ఎస్‌ఇ-1 శ్రీరామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వేణుగోపాల్‌రెడ్డి, డిఇ మల్లి కార్జున, ఎఇ సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. కాగా, గతేడాది వరదలకు తుంగభద్ర గేటు కొట్టుకుపోయింది. దీనిస్థానంలో తాత్కాలిక గేటును ఏర్పాటు చేశారు.