స్త్రీ మనసు చదవడం అంత సులభం కాదు. ఆమె మౌనం వెనుక అర్థం, ఆమె నవ్వు వెనుక బాధ, ఆమె అర్ధరాత్రి నిశ్శబ్దం వెనుక తపన.. ఇవన్నీ మనం చూడం.
ప్రపంచం మారింది, కానీ స్త్రీ మనసు మాత్రం ఇప్పటికీ అదే.. ప్రేమను కోరుకుంటుంది, ఆప్యాయతను కోరుకుంటుంది, అర్థం చేసుకోవడాన్ని కోరుకుంటుంది.
స్త్రీ నిజంగా బలహీనురాలా?
చాలామంది ‘స్త్రీ మానసికంగా బలమైనది’ అంటారు. కానీ నిజం ఏమిటంటే బలహీనత కూడా ఒక మానవత. స్త్రీకి మానసికంగా ఆధారం కావాలి, తన మాటలు వినిపించే, తన మనసు అర్థం చేసుకునే ఒక మనిషి కావాలి. ఆ భావనలోనే ఆమె తనను అర్పిస్తుంది. తన భావాలు, తన కలలు, తన మనసు మొత్తం ఆ వ్యక్తిలో కలిసిపోతాయి.
కానీ ఆ ఆధారం విచ్చిన్నమైతే?
ఆమె తడబడుతుంది… కానీ పడిపోదు. అప్పుడు ఆ స్త్రీ పునరుద్ధరించబడుతుంది. ఒక కొత్త రూపంలో.
కేస్ స్టడీ: ‘మాధవి కథ’ – బలహీనత నుంచి బలమైన దిశ.
మాధవి ఒక మధ్యతరగతి స్త్రీ. తన భర్తను ఎంతో ప్రేమించింది. ఆమెకు అతడు మాత్రమే ప్రపంచం. అతడు చెప్పేది నిజం, అతని భావాలు తన నిర్ణయాలు. కానీ కాలక్రమంలో ఆ ప్రేమ ఆధారంగా మారింది, ఆధారం బానిసత్వంగా మారింది. భర్త తను చెప్పిన మాటలు వినకపోతే కోపంతో అవమానించేవాడు.
తన కలల గురించి మాట్లాడితే ”నీకు అవసరమా అవన్నీ?” అని తణీకరించేవాడు. మాధవి నిశ్శబ్దంగా భరించింది. భరించటం ఆమె బలహీనత కాదు. అది ఆమె ప్రేమ. కానీ ఒక రోజు తన కుమార్తె ”అమ్మా, నువ్వు ఎందుకు ఎప్పుడూ మౌనంగా ఏడుస్తావు?” అని అడిగినప్పుడు..
ఆ ప్రశ్న ఆమెకు మేల్కొలుపు అయింది. అప్పుడు ఆమె నిర్ణయం తీసుకుంది. తన జీవితాన్ని తిరిగి సష్టించుకోవాలని. తనకు తానే బలం కావాలని. మాధవి తిరిగి చదువుకుంది. చిన్న హోమ్ ట్యూషన్ సెంటర్ ప్రారంభించింది. నెలలు గడిచే సరికి ఆమె ఆర్థికంగా స్థిరపడింది. కానీ అంతకంటే పెద్ద మార్పు ఆమె మనసులో జరిగింది.
ఇప్పుడు ఆమె ఎవరి ప్రేమ కోసం కాదు, తన గౌరవం కోసం బతుకుతుంది. తన భర్త ఒకరోజు ఆమెను చూసి ఇలా అన్నాడు… ”నువ్వు మారిపోయావు… చాలా అహంకారంగా ఉన్నావు” అని.
ఆమె నవ్వింది.. ”లేదు, నేను అహంకారిణి కాదు… నేను నా విలువ తెలిసుకున్న స్త్రీని” అని.
స్త్రీకి కావలసింది ప్రేమ కాదు.. మానసిక స్వాంతనం. స్త్రీకి ఎప్పుడూ భుజం కావాలి కానీ బంధనం కాదు. ఆమెకు కావలసింది అర్థం చేసుకోవడం, ఆదరించడం.
మీరు ఒక స్త్రీకి మానసిక స్వంతన ఇస్తే.. ఆమె మీ జీవితంలో ఎప్పటికీ ఉంటుంది. కానీ మీరు ఆమె మనసును విస్మరించినప్పుడు.. ఆమె తనలోనే ఒక కొత్త ప్రపంచం సష్టిస్తుంది.
A Woman is the Most Powerful When She Heals Herself
తన బాధల నుండి నేర్చుకున్న స్త్రీని, తన భయాలను ఓడించిన స్త్రీని, తన గాయాలపై పువ్వులు పూయించిన స్త్రీని ఎవ్వరూ అడ్డుకోలేరు. అలాంటి స్త్రీకి ఇంకెవరి అవసరం లేదు. తన మనసు, తన గౌరవం, తన ఆత్మ ఇవే ఆమె బలం. స్త్రీని అర్థం చేసుకోవడం అంటే ఆమెను నియంత్రించడం కాదు, ఆమెకు స్వేచ్ఛ ఇవ్వడం, ఆమెని నమ్మడం.
ప్రతి స్త్రీ ప్రేమ కోసం పుట్టదు… ఆమె గౌరవం కోసం, ఆత్మబలం కోసం, మానసిక స్వంతనం కోసం పుడుతుంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



