రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో నిర్వహణ : పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఐటీయూ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఐదో మహాసభలను అక్టోబర్ 14, 15 తేదీల్లో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ పట్టణంలో నిర్వహించబోతున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్ ప్రకటించారు. సోమవారం హైదరా బాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాస్కర్‌తో పాటు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, భూపాల్, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్, ఆహ్వాన సంఘం కార్యదర్శి డి. కిషన్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం. చంద్రమోహన్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ అక్టోబర్ 14, 15 తేదీల్లో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ పట్టణంలో మహాసభలు జరుగుతాయనీ, 14న జరిగే బహిరంగ సభకు వేలాది మంది మున్సిపల్ ఉద్యోగ, కార్మికులు తరలిరానున్నారని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకుని మున్సిపల్ కార్మికుల పర్మినెంట్, కనీస వేతనం రూ.26 వేలు అమలు కోసం పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పారు.