Wednesday, July 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునీటిహక్కుల కోసమే పోరాటం

నీటిహక్కుల కోసమే పోరాటం

- Advertisement -

కేసీఆర్‌ నిర్ణయాలే తెలంగాణకు మరణశాసనం
బనకచర్లకు ఇంకా బ్రేకులు పడలేదు
మళ్లీ తెరమీదకొస్తుంది : ప్రజాభవన్‌ పీపీటీలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

మాజీ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలే తెలంగాణకు మరణ శాసనాలు అయ్యాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విమ ర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లే మన ప్రధాన ఎజెండా అని, ఇప్పుడు కూడా మన నీటి హక్కులను కాపాడడమే మా పోరాట మని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై మంగళవారం ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దీనికి సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు డి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, గడ్డం వివేక్‌, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారులు అర్కా వేణుగోపాల్‌రావు, వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, సలహాదారు ఆదిత్యనాద్‌ దాస్‌ పాల్గొన్నారు.


రూ.7 వేల కోట్ల కరెంటు బిల్లులు:సీఎం
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్ల కరెంటు బిల్లులు వచ్చాయని సీఎం చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పునరుజ్జీవం కోసం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే నీళ్ల సెంటిమెంట్‌ను మళ్లీ వాడుకుంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పునరుజ్జీవం కోసం ఏపీ సీఎంను, తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ బద్నాం చేస్తున్నదని నిరసన తెలిపారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు కేసీఆర్‌ కుట్ర చేశారని ఆరోపించారు. ఇందులో భాగంగానే రోజా ఇంటికెళ్లి రాగి సంకటి, చేపల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమ చేస్తానని కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు. మాకు రాగి సంకటి, చేపలు పులుసు వద్దనీ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అనుమతుల తిరస్కరణ తాత్కాలికమేననీ, పున:పరిశీలన తర్వాతైనా మళ్లీ తెరమీదకు వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కార్‌ మనుగడ చంద్రబాబు మీద ఆధారపడి ఉందనీ, చంద్రబాబు మనుగడ గోదావరి జలాలపై ఆధారపడి ఉందని అన్నారు.


’11 ఏండ్లుగా తెలంగాణకు బీజేపీ అన్యాయం’
11 ఏండ్లుగా తెలంగాణను కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందనీ, రాష్ట్రానికి అన్యాయం చేస్తోన్న బీజేపీపై పోరాటం ఉధృతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ తెచ్చిన బీఆర్‌ఎస్‌ను బతికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని వివరించారు. రాష్ట్ర హక్కులను కాలరాసేందుకే బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చామా ? అని ప్రశ్నించారు. ఏపీ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు, వాళ్ల రాష్ట్రం కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారనీ, తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు మాత్రం రాష్ట్రం కోసం ఏమీ చేయడం లేదని అన్నారు. నీటి కేటాయింపులపై కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కిషన్‌రెడ్డి ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీశారు. కేసీఆర్‌ కోసమే కిషన్‌రెడ్డి పనిచేస్తున్నారనీ, ఆయన మాట్లాడే ప్రతిమాట కేసీఆర్‌ దగ్గర నుంచే వస్తున్నదని ఆరోపించారు. నీటి పంపకాల గురించి చర్చించేందుకు మేము వస్తున్నామంటే ఆయన ముందు వెళ్లి కేంద్ర మంత్రిని కలుస్తున్నారనీ, కిషన్‌రెడ్డి తీరు అనుమానాలకు తావు ఇస్తున్నదని అన్నారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు కిషన్‌రెడ్డి మాతో కలిసి ఎందుకు రావడం లేదనీ, మాకంటే ముందే వెళ్లి రహస్యంగా వెళ్లి చర్చించాల్సిన అవసరమేంటి అని ప్రశ్నించారు.


మొదటి పంటకే నీళ్లు లేవు: సీఎం
గోదావరి వరద జలాలను తరలిస్తే తెలంగాణకు ఇబ్బందేంటని ఏపీ వాదిస్తున్నదనీ, మరీ నికర జలాల్లో మా వాటాపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతున్నదని సీఎం అడిగారు. మూడో పంట కోసమే ఏపీ ప్రయత్నిస్తున్నదనీ, ఇక్కడ మాకు మొదటి పంటకే నీళ్లు లేవని అన్నారు. మా నీటి వాటాలపై ఏపీ కూడా సహకరించాలని కోరారు. కేసీఆర్‌ హయాంలో జరిగిన చర్చల మేరకే చంద్రబాబు ప్రాజెక్టు కడుతున్నారని గుర్తు చేశారు. నికర జలాల్లో 968 టీఎంసీలు, ప్రాజెక్టులకు అనుమతుల కోసమే మా ప్రయత్నమని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నికర జలాలు, మిగులు, వరద జలాల లెక్కలు తేల్చాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. అన్నీ లెక్కలు తేలాకే వరద జలాల గురించి మాట్లాడాలని స్పష్టం చేశారు.


బనకచర్ల అనుమతుల తిరస్కరణ తెలంగాణ సర్కార్‌ విజయం:ఉత్తమ్‌
ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు తిరస్కరించడం ప్రభుత్వ విజయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజాభవన్‌లో పీపీటీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అందుకే బనకచర్లకు పర్యావరణ అనుమతులు తిరస్కరించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవమని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలోనే ఈ మోసానికి పునాది పడిందన్నారు. 2016లో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారని చెప్పారు. 2018 మార్చి, జూన్‌, సెప్టెంబర్‌లలో ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా జీవోలు ఇచ్చినా నాటి ముఖ్యమంత్రి నోరు మెదపలేదన్నారు. జీఎం 98 పేరుతో నిధులు మంజూరు చేసినా అడ్డుచెప్పలేదని విమర్శించారు. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా నదికి మళ్లించేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చర్చలు జరిపిందే కేసీఆర్‌ అని చెప్పారు. అధికారులతో హైలెవల్‌ కమిటీ సైతం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అప్పుడు అన్నీ ఒప్పందాలు చేసుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు.


299 టీఎంసీలకు కేసీఆర్‌ ఒప్పుకున్నారు: సీఎం రేవంత్‌
పీపీటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 811 టీఎంసీల కృష్ణాజలాల్లో కేసీఆర్‌ 512 టీఎంసీలను ఏపీకి ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణకు ఇచ్చిన కేవలం 299 టీంఎంసీల నీటిలో కూడా 220 టీఎంసీలకు మించి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎప్పుడూ వినియోగించుకోలేదన్నారు. ఈ పనిచేసి అనాడే కేసీఆర్‌ తెలంగాణకు మరణశాసనం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతం 68 శాతం తెలంగాణలో ఉందన్నారు. అలాంటప్పుడు తెలంగాణకు 299 టీఎంసీలే ఎలా వస్తాయని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌, హరీశ్‌రావు తొమ్మిదిన్నరేండ్ల పాటు నీటిపారుదల శాఖను చూశారని గుర్తు చేశారు. డబ్బులకు కక్కుర్తిపడి ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్‌, హరీశ్‌రావు వమ్ముచేశారని విమర్శించారు. నీళ్ల విషయంలో బీఆర్‌ఎస్‌ తీసుకున్న నిర్ణయాలు, తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో నీటి కేటాయింపులపై బీఆర్‌ఎస్‌ ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. గోదావరిలో నీటి లభ్యత 1480 టీఎంసీలుగా గుర్తించారని తెలిపారు. గోదావరిపై పెండింగ్‌ ప్రాజెక్టులేవి కేసీఆర్‌ పూర్తిచేయలేదనీ, అందులో ప్రధానమైనది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అని అన్నారు. ధనదాహం కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోస్తే, వరదలొచ్చి మళ్లీ నీటిని కిందకు వదిలేవారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -