- బీసీ జేఏసీ బంద్‌లో ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ-అచ్చంపేట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు పోరాటం ఆగదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం అచ్చంపేటలో బంద్ ప్రశాంతంగా జరిగింది. అంబేద్కర్ చౌరస్తాలో చేసిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడారు.. బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీలు పిలుపుమేరకు అచ్చంపేట పట్టణంలో నియోజకవర్గంలో బంద్ విజయవంతమైందన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు జరగాలని ధర్నా నిర్వహించడం జరిగిందని, ఈ యొక్క ధర్నాలో వంద మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు జరగాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, అమలు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపు లేదని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చాలా బాధగా ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని ఆయన అన్నారు. అఖిలపక్ష బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం అభినందనీయమని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, బిజెపి, అన్ని కుల సంఘాలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నాయి.
