– మూడో రోజుకు చేరిన గుడిసెవాసుల దీక్షలు
– గుడిసెలు తొలగింపునకు అధికారుల యత్నం
– నెల రోజుల్లో పరిష్కారానికి ఆర్డీఓ హామీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి
పట్టాలు ఉన్న లబ్దిదారులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్ తేల్చి చెప్పారు. యాదాద్రి భువనగిరి పట్టణంలోని సర్వేనెంబర్ 700లో పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని చేపట్టిన దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. అయితే, మంగళవారం తహసీల్దార్ అంజిరెడ్డి, ఇతర అధికారులు పోలీసు బలగాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గుడిసెలను తొలగించేందుకు యత్నించగా లబ్దిదారులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలుసుకున్న జహంగీర్, నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అధికారులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. స్థలాలు చూపే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ పెద్దఎత్తున ధర్నా చేశారు. దాంతో ఆర్డీవో కృష్ణారెడ్డి నాయకులను సాయంత్రం చర్చలకు పిలిచారు. అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ..
గుడిసెలు వేసుకున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించి వారితో మాట్లాడారు. 25 ఏండ్ల కింద నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని, నేటికీ స్థలం చూపించకపోవడం బాధాకరమన్నారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో లబ్దిదారులు సర్వే నెం.700లోని భూమిలో గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. స్థలాలు చూపించనందున ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేక అప్పటి నుంచి ఒక్కో ఇంట్లో రెండు మూడు జంటలు నివాసముంటున్నాయని తెలిపారు. ఏండ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో చొరవ తీసుకుని ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ సర్వేనెంబర్ 700లోని భూమిని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, పట్టణ కార్యదర్శి మాయకృష్ణ, నాయకులు బర్ల వెంకటేష్ కల్లూరి నాగమణి, వల్దాసు అంజయ్య, కొత్త లక్ష్మయ్య, కొత్త లలిత, దొడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నాయకులతో ఆర్డీఓ చర్చలు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జహంగీర్, ఇండ్ల స్థలాల సాధన కమిటీ నాయకులతో సాయంత్రం ఆర్డీఓ కృష్ణారెడ్డి చర్చించారు. 20 ఏండ్ల కిందట ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లకు స్థలాలు చూపలేదని, వారంతా అద్దె ఇండ్లు, ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నెట్టుకొస్తున్నాయని వివరించారు. వెంటనే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు నెల రోజుల సమయం ఇవ్వాలని, ఆ లోపు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు.