కాంగ్రెస్‌కు ‘గుడ్‌బై’ చెప్పే యోచనలోనే జీవన్ రెడ్డి!
ఆయన్ను దారికి తెచ్చేందుకు ఉదయమే వెళ్లిన ఇద్దరు మంత్రులు
ఫెయిల్ అయిన మంత్రుల ‘బ్రేక్ ఫాస్ట్’ రాజకీయం
రాజీనామాపై నేడు బహిరంగ లేఖ విడుదల చేసే అవకాశం!
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / జగిత్యాల
దశాబ్దాల కాలంపాటు కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డిని దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ చేసిన చివరి ప్రయత్నాలు కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. పార్టీలో వలస నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత, సీనియర్లకు ఇవ్వడం లేదని, విస్మరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన.. కాంగ్రెస్ పార్టీని వీడేందుకే సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. జీవన్‌రెడ్డిని బుజ్జగించి రాజీనామా ఆలోచనను విరమించుకునేలా చేసేందుకు మంత్రులు, సీనియర్ నేతలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మేడపల్లి సత్యం చేసిన ‘బ్రేక్ ఫాస్ట్’ రాజకీయం బెడిసికొట్టింది.
గంటన్నర పాటు సుదీర్ఘ చర్చలు
కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం ఉదయం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పిలుపును కూడా ఆయన గతంలో తిరస్కరించిన నేపథ్యంలో, ఈ భేటీకి రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం అల్పాహారం చేస్తూ సుమారు గంటన్నరపాటు మంత్రులు ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రులు ఎంత బతిమాలినా.. జీవన్‌రెడ్డి మెత్తబడలేదని, వారి ప్రతిపాదనలకు ఆయన ససేమిరా అన్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో అధిష్టానం తీరుపై జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆవేదన వెళ్లగక్కినట్టు సమాచారం. ‘నేటి కాంగ్రెస్ పార్టీ రాజీవ్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు. ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న సొంత నేతలకు అన్యాయం చేస్తూ, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పెద్దపీట వేయడం ఎంతవరకు సమంజసం?’ అని మంత్రుల ముందే ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని స్పష్టం చేశారు.
నేడు బహిరంగ లేఖ.. 25న రాజీనామా?
కాంగ్రెస్ పార్టీని వీడాలని ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన జీవన్ రెడ్డి.. ఆదివారం ఒక బహిరంగ లేఖ ద్వారా కాంగ్రెస్ పార్టీకి తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తోందో ప్రజలకు, అభిమానులకు వివరించనున్నట్టు సమాచారం. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు తన పదవులకు కూడా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
‘దేవుడు శాసిస్తే.. జీవుడు అనుసరిస్తాడు..’
తన భవిష్యత్ కార్యాచరణపై మీడియా అడిగిన ప్రశ్నలకు ‘దేవుడు శాసిస్తే.. జీవుడు అనుసరిస్తాడు’ అంటూ జీవన్‌రెడ్డి వేదాంత ధోరణిలో బదులివ్వడం గమనార్హం. త్వరలోనే ముఖ్య అనుచరులతో ఒక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. తదుపరి రాజకీయ అడుగులను (బీఆర్‌ఎస్ వైపు వెళ్తారా? లేక స్వతంత్రంగా ఉంటారా? తదితర అంశాలను) ఆయన అధికారికంగా ప్రకటించనున్నట్టు జగిత్యాల ప్రజలు, ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా జీవన్‌రెడ్డి నిష్క్రమణ ఉత్తర తెలంగాణ కాంగ్రెస్‌లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.



