Wednesday, December 17, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునేడే తుది విడత పోరు

నేడే తుది విడత పోరు

- Advertisement -

పోలింగ్‌కు సర్వం సిద్ధం
3,752 సర్పంచ్‌ స్థానాలకు… బరిలో12,652 మంది
28,410 వార్డు స్థానాలకు 75,725 మంది పోటీ
100 శాతం పోలింగ్‌ స్లిప్పుల పంపిణీ
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా తుది విడతలో 182 మండలాల్లోని 3,752 పంచాయతీల్లో జరగనున్న సర్పంచ్‌ ఎన్నికలకు సర్వం సిద్దం చేసినట్టు ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సర్పంచ్‌ స్థానాలకు 12,652 మంది, వార్డు స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌, ఆ తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి కౌటింగ్‌ ఉంటుందన్నారు. 31 జిల్లాల్లో 36,483 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 26,01,861 మంది పురుష ఓటర్లు, 27,04,394 మంది మహిళా ఓటర్లు, 140 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణకు 4,502 మంది రిటర్నింగ్‌ అధికారులను, 77,618 మంది ఇతర సిబ్బందిని నియమించినట్టు వివరించారు. మూడు విడతలకు కలిపి మొత్తం 2,489 మైక్రో అబ్జర్వర్లను నియమించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. బుధవారం సాయంత్రం ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తామనీ, వీలు కాకుంటే గురువారం పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్ల నియామకం జరిగిందని తెలిపారు. ఓటు వేసే వారు తమ ఎలక్షన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర 18 రకాల ఐడీ కార్డులను అనుమతించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా చివరి విడతలో 3,547 పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు వెబ్‌ కాస్టింగ్‌ లాగిన్‌ పాస్వర్డ్‌ ఎన్నికల సంఘం ఇచ్చింది. పొలింగ్‌, ఇబ్బందులు, ఇతర శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు తక్షణమే స్పందిచి తగు చర్యలు తీసుకుంటారు. నెట్‌ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో లోకల్‌ వీడియో రికార్డింగ్‌ ఏర్పాటు చేశారు.

పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమలైనప్పటినుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.9,11,34,563 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. రూ.2,28,32,539 విలువైన మత్తు పదార్థాలు, రూ.3,81,63,154 విలువైన మద్యం సీజ్‌ చేశామని పేర్కొంది. 12,20,500 విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.78,33,840 విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఇప్పటి వరకు 36,165 మందిని బైండోవర్‌ చేసినట్టు పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వివరించింది. గ్రామాల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లందరూ పోలింగ్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. అలాగే ఫిర్యాదుల కోసం 92400212456 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -