ఐదో టెస్టులో 5 వికెట్లతో గెలుపు
4-1తో యాషెస్ సిరీస్ సొంతం
సిడ్నీ (ఆస్ట్రేలియా) : సొంతగడ్డపై యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. బ్యాట్‌తో, బంతితో అద్భుత ప్రదర్శన కనబరిచిన కంగారూలు 4-1తో యాషెస్ సిరీస్‌ను గెల్చుకున్నారు. గురువారం ముగిసిన సిడ్నీ టెస్టులో ఇంగ్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 31.2 ఓవర్లలోనే ఛేదించింది. మార్నస్ లబుషేన్ (37), జేక్ వెథర్‌లాండ్ (34), ట్రావిశ్ హెడ్ (29), అలెక్స్ కేరీ (16నాటౌట్), కామెరూన్ గ్రీన్ (22 నాటౌట్) రాణించారు. ఇంగ్లాండ్ పేసర్ జోశ్ టంగ్ (3/42) మూడు వికెట్లతో మెరిశాడు. ఇంగ్లాండ్ వరుస ఇన్నింగ్స్‌ల్లో 384, 342 పరుగులు చేయగా.. ట్రావిశ్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (138) సెంచరీలతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగుల భారీ స్కోరు చేసింది. శతక హీరో ట్రావిశ్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలువగా.. ఐదు టెస్టుల్లో 31 వికెట్లు, 156 పరుగులతో విజృంభించిన మిచెల్ స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్ ట్రోఫీ 4-1తో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.



