నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల డిమాండ్
ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ – ముషీరాబాద్
పెన్షనర్స్ సవరణ హక్కును నీరుగార్చే ‘ఆర్థిక చట్టం-2025’ను రద్దు చేయాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఎమ్‌ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్థిక చట్టం-2025’లోని నిబంధనలు పెన్షనర్ల పెన్షన్ సవరణ హక్కును తిరస్కరించే లేదా నీరుగార్చే ఉద్దేశంతో ఉన్నాయన్నారు. 8వ వేతన సవరణ కమిషన్‌కు సూచించిన నిబంధనల నుంచి అభ్యంతరకరమైన.. తప్పుదారి పట్టించే పదజాలాన్ని ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ కమిషన్‌తో జరిగే వేతనం, పెన్షన్ సవరణకు సంబంధించిన అన్ని చర్చల్లో పెన్షనర్లను చేర్చాలని కోరారు. బ్యాంకు, ఇన్సూరెన్స్, కోల్‌మైన్స్ పెన్షనర్ల పెన్షన్‌ను అప్‌డేట్ చేయాలన్నారు.
ఈపీఎస్ పెన్షనర్లకు కరువుభత్యంతో కూడిన కనీస పెన్షన్ నెలకు రూ.9000, కోల్‌మైన్ పెన్షనర్లకు రూ.15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాప్రా అధ్యక్షులు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ కాలంలో రద్దు చేసిన రైలు ప్రయాణ రాయితీలను పునరుద్ధరించాలని, అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ విషయంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచన లను యథాతథంగా అమలు చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పెన్షనర్లందరి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. వివిధ పథకాల పేరుతో ఇప్పటికే ఉన్న వైద్య సదుపాయాలను కుదించే ప్రయత్నం మానుకో వాలన్నారు. ఈ సదస్సులో నాయకులు సోమయ్య, రామకృష్ణాచార్యులు, బి.గాంధీ, ఎస్‌ఎన్ రెడ్డి, భార్గవాచారి, యుగేందర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.



