Friday, December 26, 2025
E-PAPER
Homeజాతీయంఉసురు తీస్తున్న విద్వేషాగ్ని

ఉసురు తీస్తున్న విద్వేషాగ్ని

- Advertisement -

ఒడిశాలో బెంగాల్‌ కార్మికులపై మూక దాడి
ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు


భువనేశ్వర్‌ : ఒడిశాలో విద్వేషకారులు రెచ్చిపోతున్నారు. పరాయి దేశస్తులంటూ స్వదేశానికి చెందిన వలసకార్మికులపై దాడులకు తెగిస్తున్నారు. సంబల్‌పూర్‌ పట్టణంలో బెంగాల్‌ కార్మికులపై జరిగిన మూకదాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశీయులుగా అనుమా నిస్తూ కార్మికులపై విద్వేషకారులు ఈ దాడికి పాల్పడ్డారు. కార్మికుల గుర్తింపు కోసం ఆధార్‌ కార్డులు అడుగగా, వాటిని వారు తీసుకొచ్చేందుకు వెళుతుండగా వెనుకనుంచి కర్రలతో దాడి చేశారు. ఆపకుండా కొట్టారు. దీంతో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి గురించి కార్మికులను పనికి తీసుకొచ్చిన కాంట్రాక్టర్‌ హక్‌ సాహెబ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాకు చెందిన కొంతమంది భవన నిర్మాణ కార్మికులు కొంతకాలంగా సంబల్‌పూర్‌ పట్టణంలో పనిచేస్తున్నారు. వీరిలో ముగ్గరు బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో టీ తాగడానికి బయటకు వచ్చారు. వీరిని దాదాపు పది మందితో కూడిన విద్వేషకారుల గుంపు అడ్డగించింది.

బంగ్లాదేశీయులు అని కార్మికులను ఎగతాళి చేశారు. భారత్‌కు చెందిన వారయితే గుర్తింపు కోసం ఆధార్‌ కార్డులు చూపించాలని అడిగారు. దీంతో కార్మికులు అధార్‌ కార్డులు కోసం తిరిగి వెళుతుండగా వారి తలపై కర్రలతో కొట్టడం ప్రారంభించారు. ఈ దెబ్బలతో 20 ఏండ్ల జువల్‌ రాణా మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాము దాదాపు 13 ఏండ్ల్ల నుంచి సంబల్‌పూర్‌లో ప్రశాంతంగా పనిచేస్తున్నామని, కానీ ఒడిశాలో బీజేపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి హింస, దాడులు పెరిగాయని కాంట్రాక్టర్‌ సాహెబ్‌ తెలిపారు. ఈ దాడిపై సంబల్‌పూర్‌లోని అయింతపాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయిందని ఐజీ హిమాన్సు లాల్‌ ఒక మీడియా ప్రకటనలో తెలిపారు. నిందితుల్ని అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. కాగా, ఒడిశాలోని బిజెపి ప్రభుత్వం కూడా వలసకార్మికులపై ప్రత్యేకంగా తనిఖీలు చేస్తోంది. ఆగస్టు నెలలో ఝూర్సుగూడ జిల్లాలో అక్రమ వలసదారులనే అనుమానంతో 444 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ధ్రువీకరణ తరువాత వీరంతా పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చిన కార్మికులుగా వెల్లడయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -