Tuesday, December 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతొలిరోజు ప్రశాంతం

తొలిరోజు ప్రశాంతం

- Advertisement -

అసెంబ్లీలో కేసీఆర్‌ దగ్గరకెళ్లి నమస్కారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
‘జనగణమన’ వరకే సభలో మాజీ సీఎం
సంతాప తీర్మానం కాగానే వెళ్లిపోయిన సీఎం
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి నివాళులు
జీరో అవర్‌లో సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఏకరువు
కౌశిక్‌రెడ్డి మైక్‌ కట్‌ చేసిన స్పీకర్‌

కొండంత రాగం తీసి కూసింత పాట పాడటం అంటే ఇదేనేమో! అసెంబ్లీలో నీటి యుద్ధం జరుగుతుందని పత్రికలన్నీ కోడై కూసాయి. కానీ అలాంటిదేం జరగలేదు. కేసీఆర్‌ సభకు వస్తున్నారు…ఇక కాస్కోండి అనే హెచ్చరిక కూడా తుస్సు మంది. ‘సార్‌’ శాసనసభకు ‘టెక్నికల్‌’గా వచ్చి వెళ్లారు. సభలో పట్టుమని పది నిముషాలు కూర్చున్నదీ లేదు… నోరు తెరిచి ఓ మాట మాట్లాడిందీ లేదు. కాకపోతే సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి ‘నమస్కారం’ పెట్టడమే తొలిరోజు అసెంబ్లీలో జరిగిన హైలెట్‌ సీన్‌. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధ్యక్ష స్థానంలోకి రాగానే ‘జనగణమన’ గీతం రికార్డు వినిపించారు. ఆ వెంటనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణానికి సంతాపం తెలుపుతూ తీర్మానం పెడుతున్నానని ప్రకటిస్తుండగానే కేసీఆర్‌ సభ నుంచి వెళ్లిపోయారు.

తీర్మానాలు పెట్టి, నివాళులు అర్పించాక, స్పీకర్‌ ‘జీరో అవర్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులంతా తమ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పీకర్‌ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టాక సభ నుంచి వెళ్లిపోయారు. శాసనసభ దాదాపు రెండుగంటలపాటు నడిచింది. శాసనమండలి 40 నిముషాలు మాత్రమే నడిచింది. ఆ వెంటనే ఉభయసభలు జనవరి 2వ తేదీకి వాయిదాపడ్డాయి. డిసెంబర్‌ 30,31 జనవరి 1వ తేదీ వరకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. 2 నుంచి 7వ తేదీ వరకు మరో ఆరు రోజులు శాసనసభ, మండలి సమావేశాలు నడపాలని శాసనసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ)లో ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తొలిరోజు శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకర్ని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చాలా కాలం తర్వాత మాజీ సీఎం, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత కేే చంద్రశేఖరరావు (కేసీఆర్‌) సభలోకి వచ్చారు. తమపార్టీకి చెందిన ఇతర సభ్యులతో కలిసి సభా సమయాని కంటే కొంతముందే వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. సరిగ్గా ఉదయం 10:31 నిమిషాలకు సీఎం రేవంత్‌రెడ్డి సభలో అడుగుపెట్టారు. వస్తూనే నేరుగా ప్రతిపక్షనేత కేసీఆర్‌ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి నమస్కరించారు. బాగున్నారా సార్‌… అంటూ పలుకరించారు. అంతా బాగే అన్నట్టు కేసీఆర్‌ సైగ చేశారు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఆ వెంటనే సీఎం వెళ్లి తన సీటులో ఆసీనులయ్యారు. ఆ తర్వాత విప్‌ ఆది శ్రీనివాస్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ దగ్గరకెళ్లి నమస్కారం చేశారు.

ఆయన కూడా ప్రతినమస్కారం చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపొందిన కాంగ్రెస్‌ సభ్యులు నవీన్‌ యాదవ్‌ మర్యాదపూర్వకంగా కేసీఆర్‌ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపన అయిపోగానే స్పీకర్‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సంతాప తీర్మానం అయిపోగానే సీఎం రేవంత్‌రెడ్డి కూడా బయటకు వెళ్లిపోయారు. తొలి రోజు నుంచే హాట్‌హాట్‌గా సభ జరుగుతుందనే చర్చ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరినొకరు పలుకరించుకోవడం మంచి పరిణామంగా కనిపించింది. అయితే రెండో తేదీ నుంచి ఏడో తేదీ వరకు జరిగే సభలో సన్నివేశాలు ఇలా ఉండే అవకాశాలు లేవు. నీళ్లపై చర్చ హాట్‌హట్‌గానే జరిగే అవకాశాలు ఉన్నాయి.

మాజీ మంత్డ్రి, ఎమ్మెల్యేకి సభ సంతాపం
తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతికి శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారి మృతికి సంతాపం ప్రకటించారు. ఇరువురి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా దామోదర్‌రెడ్డి అందించిన సేవలను వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ స్థాపించి, రాజకీయ రంగంలో రాణించిన లక్ష్మారెడ్డి సేవలను స్మరించుకున్నారు. అనంతరం సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది.

స్థానిక సమస్యలు ప్రస్తావించిన ఎంఐఎం సభ్యులు
ఎంఐఎం సభ్యులు బలాల, మాజీద్‌ హుస్సేన్‌, జాఫర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ..జీహెచ్‌ఎంసీలో ముఖ్యంగా పాతబస్తీలో పారిశుధ్యం పడకేసిందని ఎత్తిచూపారు. ఓపెన్‌ గార్బేజ్‌ల నుంచి వారానికోసారి చెత్తను తీసుకెళ్తున్నారనీ, దీంతో అక్కడ దుర్వాసనతో ప్రజలకు వ్యాధులు ప్రబలుతున్నాయని వాపోయారు. వీధి లైట్లను వేయించాలని కోరారు. ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్పులు విడుదల చేయాలని బలాల విజ్ఞప్తి చేశారు. చిన్నపిల్లలకు వైద్యం విషయంలో దేశంలోనే ప్రసిద్ధి పొందిన నీలోఫర్‌ ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలనీ, డాక్టర్ల సంఖ్యను పెంచాలని మాజీద్‌ హుస్సేన్‌ విన్నవించారు. నాంపల్లి నియోజకవర్గంలో ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు.

మూసీ నదిపై మలక్‌పేట్‌-అంబర్‌పేట మధ్య ఉన్న మూసారాంబాగ్‌ బ్రిడ్జి పనులు ప్రారంభమై మూడేండ్లు అవుతున్నదనీ, దాన్ని త్వరగా పూర్తిచేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు కాలేరు వెంకటేశ్‌ కోరారు. ఆ బ్రిడ్జి పనుల్లో ఆలస్యం వల్ల ఆ రూట్‌లో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ సభ్యులు నవీన్‌యాదవ్‌ మాట్లాడుతూ..వర్షాకాలంలో కృష్ణానగర్‌ ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. హైటెన్షన్‌ వైర్ల సమస్యను పరిష్కరించేందుకు భూగర్భ కేబుల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అరికెపూడి గాంధీ, సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..తమ నియోజకవర్గాల్లోని డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని విన్నవించారు.

కౌశిక్‌రెడ్డి మైక్‌ కట్‌ చేసిన స్పీకర్‌
బీఆర్‌ఎస్‌ సభ్యులు పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ..తన నియోజకవర్గంలోని కల్వల ప్రాజెక్టును పూర్తిచేస్తే ఆరేడు వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చుననీ, దాన్ని త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చినట్టుగానే మంత్రి కొడుకుకు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ తన నియోకవర్గంలోని తనుగుల చెక్‌డ్యామ్‌ను బాంబు పెట్టి పేల్చిందని ఆరోపించారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. ఈడ కూర్చొని మాట్లాడటం గాదు తన నియోజకవర్గానికి వచ్చి చూడాలంటూ కాంగ్రెస్‌ సభ్యులకు కౌశిక్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఇంతలోనే కౌశిక్‌రెడ్డి మైక్‌ను స్పీకర్‌ కట్‌ చేశారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను తొలగించాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు.

నా దగ్గరా కోతుల సమస్య ఉంది : స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌
కాంగ్రెస్‌ సభ్యులు రాంచందర్‌నాయక్‌ మాట్లాడుతూ..తన నియోజకవర్గంలోని హామ్ల్లెట్‌ గ్రామాల్లో రేషన్‌ షాపులకు సంబంధించిన సబ్‌ సెంటర్లను పెట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు. రేషన్‌ తెచ్చుకోవడానికి కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తున్నదని చెప్పారు. తన నియోజకవర్గంలో కోతుల సమస్య తీవ్రంగా ఉందనీ, రైతుల పంటలను ఆగం చేస్తున్నాయని సభలో ఏకరువు పెట్టారు. ఇంతలోనే స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ…తన నియోజకవర్గంలోనూ కోతుల సమస్య తీవ్రంగా ఉందనీ, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

హరీశ్‌రావు వర్సెస్‌ మంత్రి శ్రీధర్‌బాబు
జీరో అవర్‌ అరణ్యరోదనగా మారిందనీ, మంత్రులు నోట్‌ చేసుకుంటున్నామని చెబుతున్నారుగానీ సమాధానాలు పంపడం లేదనీ, సమస్యలు పరిష్కరించడం లేదని బీఆర్‌ఎస్‌ సభ్యులు టి.హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వానికి రథచక్రాలుగా ఉండే ఉద్యోగులు తీవ్ర మనోవేదనలో ఉన్నారనీ, వారి ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టడం దుర్మార్గమని అన్నారు. పీఆర్సీ రెండేండ్లుగా పెండింగ్‌లో ఉందని ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఈహెచ్‌ఎస్‌ జీవోను అమలు చేయడం లేదని విమర్శించారు. పీఎఫ్‌, రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

సీపీఎస్‌ను ఓపీఎస్‌గా మారుస్తామన్నహామీ ఏమైందని ప్రశ్నించారు. పోలీసులకు సరెండర్‌ లీవ్‌లు ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని అడిగారు. పోలీసులకు ఆరోగ్యభద్రత స్కీమ్‌ను లక్ష రూపాయలకు కుదించడం దారుణమన్నారు. దీనికి మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ..ఉద్యోగుల సమస్యల గురించి హరీశ్‌రావు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించనట్టుగా ఉందని విమర్శించారు. 20వ తేదీ వరకు కూడా జీతాలు చెల్లించనివారు ఇప్పుడు ఉద్యోగుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జీపీఎఫ్‌, రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ అందించేందుకు తమ ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తుందని చెప్పారు.

సింగరేణిని పరిరక్షించండి : కూనంనేని
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో మైనింగ్‌ రంగం ప్రయివేటు పరం అవుతుందనీ, అందులో భాగంగా సింగరేణి కూడా ప్రయివేటుపరం అయిపోయే ప్రమాదం ఉందని సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. సింగరేణి పరిరక్షణ కోసం దాని పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరారు. తీవ్ర అసంతృప్తిలో ఉన్న సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని విన్నవించారు. డిపెండెంట్‌ ఎంప్లారు వ్యవస్థ సరిగా అమలు కావడం లేదన్నారు. కారుణ్య నియామకాల వయస్సు 40 ఏండ్లకు పెంచారనీ, మెడికల్‌ బోర్డు సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయని విమర్శించారు. కేంద్రం నిర్ణయాల వల్ల సింగరేణి బ్లాకులు ప్రయివేటు సంస్థల చేతుల్లోకి వెళ్తున్నాయనీ, కనీసం బొగ్గు వెలికి తీసే పనినైనా సింగరేణికి అప్పగించాలని సూచించారు. కోలిండియా తరహాలో సింగరేణిలోనూ ట్యాక్స్‌ రిటర్న్‌ చేయాలని కోరారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని విన్నవించారు.

ఆస్పత్రులు విస్తరించండి
కాంగ్రెస్‌ సభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ..రామన్నపేటలోని ప్రభుత్వాస్పత్రిని వంద పడకలకు విస్తరించాలని సభాదృష్టికి తీసుకొచ్చారు. భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండలో 30 పడకలకు ఆస్పత్రిని విస్తరించాలని కోరారు. తాండూరు ఆస్పత్రిలో ఐసీయూని ఏర్పాటు చేయాలని మనోహర్‌రెడ్డి విన్నవించారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ..భీంగల్‌ మున్సిపాల్టీలోని ఆస్పత్రిని వంద పడకలకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అక్కడ 80 శాతం పనులు పూర్తయ్యాయనీ, రూ.5 కోట్లు వెచ్చిస్తే మిగిలిన పనులు పూర్తయితాయని సభాదృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్‌ బిల్లులు విడుదల చేసి ఆస్పత్రిని పూర్తిచేయాలని కోరారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారనీ, పోడురైతులను సాగు చేసుకోనివ్వడం లేదని ఎడ్మ బుజ్జి, పాయం వెంకటేశ్వర్లు, రాంచందర్‌నాయక్‌ ప్రస్తావించారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలనీ, తన నియోజకవర్గంలో ఒక కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని విప్‌ బీర్ల అయిలయ్య విన్నవించారు. టెట్‌ నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలనీ, సబ్జెక్టుతో సంబంధంలేని ఇతర అంశాల నుంచి ప్రశ్నలు ఇవ్వడమేంటని పి.రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. టీచర్లకు టెట్‌ నుంచి మినహాయించాలని కేంద్రానికి లేఖ రాయాలని కోరారు.

బూతులు మాట్లాడొద్దు : వెంకటరమణారెడ్డి
సభలో ఎదుటి సభ్యులను గౌరవిస్తూ సభామర్యాదల్ని కాపాడాలని బీజేపీ సభ్యులు కె.వెంకటరమణారెడ్డి కోరారు. బూతులు మాట్లాడే అవలక్షణాన్ని సభ్యులు విడనాడాలని విజ్ఞప్తి చేశారు. సభలోని 57 మంది కొత్త సభ్యులకు సీనియర్‌ సభ్యులు ఆదర్శంగా ఉండాలని కోరారు. కేసీఆర్‌, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, సభ్యులందరూ మంచి సందేశాన్ని ఇచ్చి సభా సాంప్రదాయాలను కాపాడాలని విన్నవించారు. అసభ్యకర మాటలతో వరల్డ్‌ క్లాస్‌ నగరమైన హైదరాబాద్‌ను థర్డ్‌ క్లాస్‌ సిటీగా మార్చొద్దన్నారు. నేతల మాటలను అలుసుగా తీసుకుని ప్రధానిని మొదలుకొని ఎమ్మెల్యేల వరకు మీడియావాళ్లు ఏకవచనంతో సంబోధిస్తున్న విషయాన్ని ఎత్తిచూపారు.

జీరో అవర్‌లో …
సభలో జీరో అవర్‌ గంటా 40 నిమిషాలకు పైగా నడించింది. అందులో అధికార, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఏకరువు పెట్టారు. వాటిని పరిష్కరిం చేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. సభలోని ఎక్కువ మంది సభ్యులు తమ నియోజకవర్గాల్లోని ఆస్పత్రుల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, సాగునీటి పెండింగ్‌ ప్రాజెక్టులు, హామ్ల్లెట్‌ గ్రామాల్లో రేషన్‌షాపుల సబ్‌ సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. జీరో అవర్‌లో మంత్రులు కాకుండా 39 మంది సభ్యులు మాట్లాడారు. అందులో బీఆర్‌ఎస్‌ నుంచి 12, కాంగ్రెస్‌ నుంచి 20, బీజేపీ నుంచి ముగ్గురు, ఎంఐఎం నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఒకరు మాట్లాడారు. సభలో వారు లేవనెత్తిన సమస్యలను నోట్‌ చేసుకున్నామంటూ మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు సమాధానాలిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -