భారతీయ చలనచిత్ర రంగంలో తొలితరం హీరోలు అంటేనే ఒక పృథ్వీరాజ్ కపూర్ నో,ఒక కె.ఎల్.సైగల్ నో చెప్పుకుంటారు కానీ పృథ్వీరాజ్ కపూర్ సమకాలికుడిగా సైకిల్ కన్నా ముందుగా బొంబాయి లో తయారైన నిశ్శబ్ద మాటలు నేర్చిన సినిమాలలో హీరోగా నటించిన తెలంగాణ వాడి గురించి భారతీయ సినిమా చరిత్రకారులు ఎందుకో విస్మరించారు. అతనే పైడి జయరాజ్ నాయుడు.
భారతీయ సినిమా రంగంలో మూకీల కాలంలోనే తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించిన తొలి తెలుగు నటుడుగా, ఏడు దశాబ్దాల పాటు బాలీవుడ్లో నట జీవితాన్ని గడిపిన వాడిగా చరిత్రకెక్కిన మహానటుడు పైడి జయరాజ్ నాయుడు. ఆయన తొలితరం భారతీయ నటుల్లో ఒకరు.
హైదరాబాదు రాజ్యంలో అలనాడు ఎంతో పేరు ప్రతిష్టలు, సమాజ గౌరవం ఉన్న సరోజినీ నాయుడు కుటుంబానికి దగ్గరి బంధువు మన జయరాజ్ నాయుడు. సరోజినీ నాయుడు భర్త గోవిందరాజులు నాయుడుకు స్వయాన మేనల్లుడాయన. 1909 సెప్టెంబర్ 28న కరీంనగర్ లో జన్మించారాయన. తండ్రి ప్రజా పనుల శాఖలో అకౌంటెంట్గా పని చేసేవారు. ధనవంతుల కుటుంబం కావడంవల్ల ఆయన చదువంతా హైదరాబాదులోనే సాగింది. ఆరడుగుల పొడుగు, బలమైన దేహ దారుఢ్యం ఇవన్నీ వున్న జయరాజు యవ్వనావేశంలో నేవీలో చేరి సాహసాలు చేయాలనుకున్నాడు. అయితే అప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసిన అతని అన్నగారైన సురేందర్రాజ్ తమ్ముడి నిర్ణయానికి ససేమిరా అన్నాడు. ఏది ఏమైనా ఇంజనీరింగ్ చదివి తీరాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పాడు. అన్న మాట కాదనలేక ఇంజనీరింగ్ చదివాడాయన.

అయితే జయరాజుకు చిన్నతనం నుండే నాటకాలతో పరిచయం ఉండింది. నిజాం కాలేజీలో చదివే రోజుల్లో షేక్ స్పియర్ నాటకాల్లో నటించాడు. ఇంజనీరింగ్ చదివినా తనదైన జీవనశైలిని నటనలో కొనసాగించాలనుకున్నాడు. ఎట్లానూ నేవీలో చేరలేక పోయానని, ఇక నటుడిగానైనా రాణించాలని 19వ ఏట తండ్రిని ఒప్పించి బొంబాయి పయనమయ్యాడు.. ఇది జరిగింది 1928లో. బొంబాయిలో దిగిన జైరాజ్‌కు దొరికిన తొలి ఆలంబన తన మిత్రుడు, అప్పటి సికిందరాబాదులో ఉన్న మహవీర్ ఫోటో ప్లేస్ మూకీ నిర్మాణ సంస్థలో పని చేసిన రంగయ్య. అప్పటికి బొంబాయిలో మూకీల నిర్మాణం చాలా జోరుగా సాగుతున్నది. జయరాజును వెంట తీసుకుని మామా వారేర్కర్ అనే నాటక రంగ మ్రుఖుడిని కలిశాడాయన. వారేర్కర్ అప్పట్లో మూకీ సినిమా తీయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. జయరాజును చూడగానే తన సినిమాలో హీరోగా నటింప చేయడానికి ఎంపిక చేసుకున్నారు. అయితే దురదష్టవశాత్తు ఈ సినిమా పూర్తి కాలేదు. కానీ ఆ వెంటనే నాగేంద్ర మజుందార్ తన చంద్రికా ఫిలింస్ ‘జగ్ మగాతీ జవానీ’ (స్పార్క్ లింగ్ యూత్ 1929)లో నటించడంతో జైరాజ్ సినీ జీవితం మొదలైంది. ఆ వెంటనే వచ్చిన యంగ్ ఇండియా పిక్చర్స్ వారి ”రసీలి రాణి” (1930) జైరాజ్ నటించిన రెండో మూకీ కాగా హీరోగా నటించిన తొలి చిత్రం. ఈ చిత్రానికి మరోకపేరు ”ట్రింప్ ఆఫ్ లౌవ్” ఈ చిత్రంలో మాధురి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అయిదు వారాలు ఆడటం అప్పటి మూకీల కాలంలో ఒక సంచలనం. ఇదో పెద్ద విజయంగా భావించే వారారోజుల్లో. ఇదే చిత్ర నిర్మాణ సంస్థకు ‘ఫైట్ అన్ టు డెత్’ (1930) చిత్రంలో హీరోగా నటించాడాయన. ఆ తరువాత 1931లో ‘శారదా ఫిలిం కంపెనీ’లో నెలకు 100 రూపాయల జీతంతో చేరారు. ఈ కంపెనీలో మొదటిసారిగా ‘పెరల్’ (మహా సాగర్ ను మోతీ)లో నటించారు. హీరోయిన్ జేబున్నీసా. ఆ తరువాత వీరిద్దరూ సినిమాలలో హిట్ పెయిర్గా పాపులరైనారు. ఈ క్రమంలో జైరాజ్ ‘క్వీన్ ఆఫ్ ఫెయిరీస్’, ‘ది ఎనిమి’, ‘తుఫానీ తరుణి’, ‘షి’ (1931), ‘మై హీరో’ (1932) మూకీ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాల ద్వారా స్టార్డమ్ అందుకున్న జైరాజ్ అప్పటికే మూకీల్లో అగ్రహీరోలుగా స్థిరపడిన బిల్లిమోరియా, జాల్ మెర్చంట్, పథ్వీరాజ్ కపూర్ల సరసన నిలిచాడు. ఇదంతా ఒక తెలంగాణ వాడి అకుంఠిత దీక్ష, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుంది.
జయరాజ్ ముఖి సినిమాలలో తన నటన అనుభవాన్ని గురించి ఒక సందర్భంలో ఇలా చెప్పుకున్నాడు. ఆరోజుల్లో పదివేల రూపాయలకు ఒక సైలెంట్ చిత్రం తయారయ్యేది. నిడివి కూడా పదివేల అడుగులకు మించకుండేది. అది కూడా స్వంత స్టూడియో ఉన్న నిర్మాతలు మాత్రమే సినిమాలు తీసేవారు. తక్కువ సాంకేతిక పరికరాలతోనే చిత్ర నిర్మాణం చేసేవారు. ఒక్కో సినిమా తయారీకి రెండు నెలలకు మించి సమయం తీసుకునేవారు కాదు. ఆరోజుల్లో ప్రతి కంపెనీకి పర్మినెంట్ ఆర్టిస్టులు ఉండేవారు.”
అయితే జయరాజ్ మూకీల సినీ జీవితం బొంబాయి వెళ్లిన తొలి తెలుగు వారెవరో తేటతెల్లం చేస్తుంది. 1928లోనే బొంబాయి వెళ్లి 11 సైలెంట్ చిత్రాలలో నటించిన మన జయరాజును చరిత్రలో చేర్చలేదు. తెలుగు సినీ చరిత్రకారుల వివక్షకు ఇదొక నిదర్శనం. అంతెందుకు మలిదశ తెలంగాణ ఉద్యమం ముందునాటి వరకు జైరాజ్న ఫాల్కే అవార్డు గ్రహీతల జాబితాలో తెలుగు వారి సరసన పేరైనా రాయలేదు. వాస్తవానికి బాలీవుడ్లో నటించిన తొలి తెలుగువాడు మన తెలంగాణ వాడైన పైడి జయ రాజే. ఎందుకంటే ఎల్.వి.ప్రసాద్ ఏ మూకీలోనూ నటించినట్లు ఎక్కడా రికార్డు కాలేదు.

పైడి జైరాజ్ తన రెండేళ్ల మూకీ నటి జీవితంలో నటించిన చిత్రాలు 11. వీటిలో ఎక్కువగా యంగ్ ఇండియా పిక్చర్స్ వారికి 5 చిత్రాలు, శారదా ఫిలిం కంపెనీకి 5 చిత్రాలు, చంద్రికా కంపెనీకి 1 చిత్రంలో నటించాడు. హీరోయిన్లు మాధురి, జేబున్నీసాలతో ఆయనది హిట్ కాంబినేషన్.
తన మూకీ జీవితానుభవాన్ని ఆర్.కె.వర్మ సైలెంట్ ఫిల్మోగ్రఫీ (1895-1934) పుస్తకానికి ముందుమాట రాస్తూ ”మూకీ చిత్రాలు నాడు ప్రేక్షకులకు సంగీత నాటక రంగాలను దాటి వినోదాన్ని అందించినవి. ఆ రోజుల్లో మూకీ చిత్రాలు తయారు చేయడం పెద్ద ఖర్చుతో కూడిన పనికాదు. నాటి ప్రజలు సామాజిక పరిస్థితులను కాదని సినిమాను ఆమోదించారు. నిజానికి నేను కూడా సామాజిక కట్టు బాట్లకు వ్యతిరేకంగానే సినిమాల్లోకి వచ్చాను. తొలి దశలో తయారైన మూకీలన్నీ దశ్యానికి ప్రాధాన్యతనిచ్చినవి. ఆ తరువాతనే సామాజిక స్పహతో తయారు కావడం మొదలైంది. కోహినూర్, రంజిత్, ఇంపీరియల్, శారదా ఫిలిం కంపెనీలన్నీ పౌరాణిక గాథలతో, యాక్షన్తో కూడిన చిత్రాలను అంతర్జాతీయ ఆదరణను దష్టిలో ఉంచుకుని తీసినవి. అందుకే ఆ కాలంలో తయారైన ఏ మూకీనైనా సరే ప్రపంచంలో ఏ చోటనైనా ప్రదర్శించేందుకు అనువుగా ఉండేవి. టాకీలు వచ్చాక సినిమా పరిధి తగ్గిపోయింది. ‘అందుకే మూకీశకం’ ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ గా మిగిలిపోయింది” అని పేర్కొన్నారు. 1931లో టాకీ సినిమాలు వచ్చిన తరువాత 200 పైగా సినిమాల్లో నటించి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి మరికొన్నింటిని నిర్మించిన పైడి జయరాజ్ నాయుడు 1980లో భారత ప్రభుత్వ అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు.
టాకి చిత్రాలలో జయరాజ్ చలనచిత్ర జైత్రయాత్ర గురించి మరో సందర్భంలో ప్రస్తావించుకుందాం.
పైడి జయరాజ్ నటించిన మూకీలు
1. స్పార్క్లింగ్ యూత్ (జగ్ మగాతీ జవానీ) చంద్రికా ఫిలింస్ కంపెనీ (1929-30)
2. ట్రింప్ ఆఫ్ లవ్ (రశీలీ రాణి) యంగ్ ఇండియా పిక్చర్స్ (1930)
3. ఫైట్ అన్ టు డెత్ (ఖాందానా ఖేల్) యంగ్ ఇండియా పిక్చర్స్ (1931)
4. భవానీ నోభోగ్ యంగ్ ఇండియా పిక్చర్స్ (1931)
5. కష్ణకుమారి (ఫ్లవర్ ఆఫ్ రాజస్తాన్) యంగ్ ఇండియా పిక్చర్స్ (1931)
6. పెరల్ (మహాసాగర్ ను మోతీ) శారదా ఫిలిం కంపెనీ (1931)
7. ఆల్ ఫర్ లవ్ (దీవానా) శారదా ఫిలిం కంపెనీ (1931)
8. ది ఎనిమి (దుష్మన్) శారదా ఫిలిం కంపెనీ (1931)
9. క్వీన్ ఆఫ్ ఫెయిరీస్ (హుసపరి) శారదా ఫిలిం కంపెనీ (1931)
10. షి (బహదూర్ బేటి) శారదా ఫిలిం కంపెనీ (1931)
11. మై హీరో (మాతభూమి మై మదర్ హుడ్) యంగ్ ఇండియా పిక్చర్స్ 1932
(వ్యాసకర్త తెలంగాణ సినీ చరిత్రకారుడు)- హెచ్ రమేష్ బాబు, 7780736386



