ప్రపంచ వాణిజ్య సంస్థకు ఇటీవలనే మూడు పదులు నిండాయి. డోనాల్డ్ ట్రంప్ తీరుతెన్నులు చూస్తుంటే దానికి త్వరలో మంగళం పాడే సూచనలు కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకున్న నాజీ హిట్లర్ చర్యలు రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఇప్పుడు ప్రపంచమంతా తాను చెప్పినట్లు నడవాలని శాసించేందుకు పూనుకున్న అమెరికా దానికి నేతగా ఉన్న ట్రంప్ ఆగస్టు ఒకటి లోగా తమతో ఒప్పందాలకు రావాలని ఫర్మానా జారీ చేశాడు. అంటే ఆ రోజును తొలి ప్రపంచ వాణిజ్య యుద్ధానికి నాందిగా చెప్పవచ్చు. దానిలో భాగంగానే భారత వస్తువులపై 25శాతం దిగుమతి సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటించాడు.తాను కత్తిగట్టిన రష్యా నుంచి చమురు, ఆయుధాలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటున్న కారణంగా అదనంగా అపరాధ రుసుం విధిస్తానని కూడా చెప్పాడు. అతగాడికి ఈ అధికారం ఎవడిచ్చాడు? సర్వసత్తాక భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేయటం తప్ప మరొకటి కాదిది. వాణిజ్య లావాదేవీలు ఒక పద్ధతి ప్రకారం జరగాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థను ముందుకు తేవటంలో అమెరికా ముందున్న సంగతి తెలిసిందే.దాని నిబంధనలు, ఆచరణకు ఏవైనా తేడాలుంటే సభ్యదేశం మీద ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, విచారణ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ప్రపంచమంతటా వాణిజ్యం అనిశ్చితంగా ఉన్నప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థను గట్టి పునాది కలిగినదని సభ్యదేశాలు ఎందుకు విశ్వసించాలని సంస్థ డైరెక్టర్ జన రల్ నిర్వేదం వ్యక్తం చేశారంటే దానికి కారకులెవరు? అన్ని దేశాల వస్తువులపై కనీసం పదిశాతం పన్ను విధిస్తున్నట్లు ఏప్రిల్ రెండవ తేదీని విముక్తి దినంగా ట్రంప్ చేసిన ప్రకటన కారణంగానే అనిశ్చితిఅని వేరే చెప్పనవసరం లేదు.
‘మా ఇంటికొస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికొస్తే మాకేం పెడతారు’ అంటూ అమెరికా బలహీనదేశాలపై కొరడా జులిపిస్తున్నది. ఏకపక్షంగా ఒక దేశ వస్తువులపై పన్ను విధింపు, ఆంక్షలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధం.విషాదం ఏమిటంటే గత కొన్నేండ్లుగా అమెరికా ఇలాంటి దందాకు పాల్పడుతున్న కారణంగా ఎవరైనా ఫిర్యాదు చేసినా విచారించే యంత్రాంగం లేకుండా అడ్డుకుంటున్నది. తాను ఊహించిన దానికి భిన్నంగా ఎప్పుడైతే చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా అవతరించిందో అప్పటి నుంచి అమెరికా అడ్డగోలుగా వ్యవహరించటం ప్రారంభించిందని చెప్పవచ్చు.దాని చర్యలను ఎవరైనా సవాలు చేస్తే విచారించి తీర్పు చెప్పకుండా విచారణ సంస్థకు న్యాయమూర్తుల నియామకం జరగకుండా అడ్డుకొంటున్నది. దానికి కూడా డోనాల్డ్ ట్రంపే ఆద్యుడు. తొలిసారి అధ్యక్షుడిగా గద్దెనెక్కిన తర్వాత చైనా కంపెనీల నుంచి ప్రభుత్వం ఎలాంటి కొనుగోళ్లు జరపరాదని నిషేధం విధించటంతో నాంది పలికాడు. విచారణ సంస్థలో న్యాయమూర్తులు లేకపోయిన తరువాత ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎవరు నిబంధనావళిని ఉల్లంఘించినా తప్పొప్పులను తేల్చేవారు లేకపోయిన తరువాత తరువాత చూసుకోవచ్చులే అని అడ్డగోలు వ్యవహరాలే సాగుతాయి. అందుకే తనతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఎవరెంత పన్నులు చెల్లించాలో దేశాలన్నింటికీ ట్రంప్ బెదిరింపు లేఖలు పంపాడు.కొన్ని దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, మరికొన్ని ప్రతిఘటిస్తున్నాయి.ప్రపంచ వాణిజ్య సంస్థకు ఈ గూండాయిజం గురించి ఫిర్యాదు చేసినా ఒరిగేదేమీ లేదని ఎవరూ ఆ సంస్థ గేట్లవైపు కూడా చూడటం లేదు.
ఆయా దేశాల బలాబలాలను బట్టి ట్రంప్ పట్టువిడుపులతో వ్యవహరిస్తున్నాడు. వాణిజ్య లావాదేవీల్లో చైనా మిగుల్లో ఉంది గనుక దాన్ని సరిచేసుకోవాల్సింది అమెరికా. అందుకే పన్నుల గురించి చర్చించటానికి తమకు అభ్యం తరం లేదని, కావాలంటే మూడో దేశంలో కూర్చుందామని చైనా చెబితే తలాడించుకుంటూ జెనివా, లండన్, స్టాకహేోంలకు తన ప్రతినిధులను పంపక తప్పలేదు. మనం కూడా అమెరికాతో వాణిజ్య మిగులులోనే ఉన్నాం కానీ జరిగిందేమిటి? ఫిబ్రవరి నుంచి మన అధికారులు, మంత్రులు వాషింగ్టన్ గేట్ల వద్ద పడిగాపులు పడటం తప్ప ఒక్కసారి కూడా అమెరికన్లు ఢిల్లీలో అడుగుపెట్టలేదు. నువ్వెంత దిగివస్తే నేనంత వస్తా అన్నట్లుగా చైనా వ్యవహరిస్తున్నది. తాత్కాలికంగా కుదిరిన సంధిని పొడిగించేందుకు ట్రంప్ దిగిరాక తప్ప లేదు. మన మాదిరి చైనా కూడా భారీ మొత్తంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నది. అయినప్పటికీ ఆ లావాదేవీల మీద జరిమానా విధిస్తానని ట్రంప్ అనలేకపోయాడు. కానీ మనల్ని పన్నులతో పాటు జరిమానా విధిస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఇలాంటి దుశ్చర్యలను ఎదుర్కోవాలంటే మనతో సహా బాధిత దేశాలన్నీ ఐక్యం కావటం, చలిచీమల మాదిరి అమెరికా దుండగాన్ని అంతం చేయటం తప్ప మరొక మార్గం లేదు!
తొలి ప్రపంచ వాణిజ్య యుద్ధం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES