Thursday, May 15, 2025
Homeప్రధాన వార్తలు'చేప' పట్టకపాయె..!

‘చేప’ పట్టకపాయె..!

- Advertisement -

– వనరులున్నా పది కేంద్రాలు ఇప్పటికే మూత..
– 23కు పైగా విత్తనోత్పత్తి కేంద్రాలపై సర్కారు నిర్లక్ష్యం
– ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా ఆంధ్రా నుంచి దిగుమతి
– సిండికేట్‌ అవుతున్న టెండర్‌దారులు.. ప్రతియేటా పంపిణీ జాప్యం
– మత్స్యకారుల వృద్ధి నిధులు రూ.600 కోట్లు కాంట్రాక్టర్ల పాలు
– నేరుగా సొసైటీలకే నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌

రాష్ట్రవ్యాప్తంగా చేప విత్తనోత్పత్తి కేంద్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఎక్కడా నిర్వహణ సరిగ్గా లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. ఏటేటా విత్తనోత్పత్తి తగ్గిపోతోంది. స్థానికంగా విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తే దేశవ్యాప్తంగా ఎగుమతి చేసే సామర్థ్యం రాష్ట్రంలోని ఉత్పత్తి కేంద్రాలకు ఉన్నా.. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఏటేటా ఉత్పత్తి పడిపోతోంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. తద్వారా ప్రతియేటా టెండర్లు ఆలస్యమవుతున్నాయి. మత్స్యసొసైటీలకు నష్టం వాటిల్లుతోంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్నా ప్రభుత్వాల వైపు నుంచి సరైన స్పందన ఉండటం లేదని మత్స్య సొసైటీలు గగ్గోలు పెడుతున్నాయి. మత్స్యకారుల వృద్ధి కోసం కేటాయించే రూ.600 కోట్ల నిధులు నేరుగా సొసైటీలకే విడుదల చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రంలో 6000 మత్స్యకార సొసైటీలు, సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల పరిధిలో సుమారు ఆరు లక్షల మంది మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. ఒక్కో చేపల ఉత్పత్తి కేంద్రం వంద చెరువులు, కుంటలకు పిల్లలను పంపిణీ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటిని వినియోగించుకోకుండా కాకినాడ, భీమవరం నుంచి పిల్లలను దిగుమతి చేసుకుంటున్నారని సీపీఐ(ఎం) తెలిపింది. మత్స్యకార్మికులు ఏటా రూ.30వేల కోట్ల వ్యాపారం చేస్తూ వారు జీవించటమే కాకుండా రాష్ట్రానికి ఆదాయం తెచ్చుపెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నిండా నిర్లక్ష్యం
దాదాపు 150 కోట్లకు పైగా చేపపిల్లలను ఉత్పత్తి చేసే కేంద్రాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న విమర్శలున్నాయి. మరోవైపు వీటి కొనుగోలుకు ఏటా కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లకు పైగా చెల్లిస్తోంది. గతేడాది నిబంధనలు మార్చడంతో కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారారు. 30 జిల్లాల్లో ఎక్కడా టెండర్లు వేయకుండా నిరాకరించారు. ఫలితంగా అక్టోబర్‌ వరకు చాలా జిల్లాల్లో టెండర్లు దాఖలు కాలేదు. రెండు, మూడు సార్లు టెండర్లు పిలిచినా ఇదే పునరావృతమైంది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ ఏడాది కూడా చేపల ఉత్పత్తిపై ప్రభావం పడనుంది.
వనరులున్నా…
రాష్ట్రంలో 19 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటి ని వినియోగించుకునే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం ఏటా టెండర్లు పిలిచి చేప పిల్లలను కొనుగోలు చేస్తోంది. 2014 తర్వాత నూతన జల వనరుల దగ్గర మరో నాలుగు చేపల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిం చారు. ప్రస్తుతం వీటి సంఖ్య 23కు చేరింది. 19 జిల్లాల్లో 390.61 ఎకరాల్లో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో భవనాలు, షెడ్లు ఉన్నాయి. చిన్న ట్యాంకులు, క్షేత్రాలను ఏర్పాటు చేశారు. చేపలకు కృత్రిమ గర్భధారణ విధానాల ద్వారా విత్తనోత్పత్తి చేసి వాటిని 13 నుంచి నెలరోజులు పెంచి చెరువులు, కుంటల్లో పెంచేందుకు పంపిణీ చేస్తారు. కానీ చేపల పంపిణీ పథకం ప్రారంభమైన తర్వాత ఏ ఒక్కరోజు కేంద్రాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏటేటా ఉత్పత్తి కేంద్రాలకు ఇచ్చే నిధులను తగ్గించేస్తున్నారు. ఒక్కో కేంద్రానికి ఐదుగురు సిబ్బంది ఉండాలి. కానీ ఒకరిద్దరితోనే నెట్టుకొస్తున్నారు. సిబ్బంది లేక కొన్ని కేంద్రాలకు తాళాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ మండలంలోని అచ్చంపేట చేప విత్తనోత్పత్తి కేంద్రానిది ఏడాది క్రితం వరకు ఇదే పరిస్థితి.
సిండికేట్‌గా మారి టెండర్లలో జాప్యం
మత్స్యశాఖ డైరెక్టరేట్‌ అధికారుల సంబంధీకులే టెండర్‌దారులు కావటంతో సిండికేట్‌గా మారుతున్నారన్న ఆరోపణలున్నాయి. వ్యూహాత్మకంగా టెండర్లకు ముందుకు రాకుండా నిరాకరిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. జాప్యమయ్యే కొద్దీ మత్స్యసొసైటీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఆ ప్రభావం ప్రభుత్వంపై పడేలా చేసి పెండింగ్‌ బిల్లులను విడుదల చేయించుకున్న తర్వాత టెండర్లకు సిద్ధమవుతున్నారు. గతేడాది మూడుసార్లు టెండర్లు పిలిస్తే గానీ ముడిపడలేదు. 2024 జులై 23న ఒకసారి, ఆగస్టు 2న మరోసారి టెండర్లు పిలిచారు. రెండుసార్లూ ఎవరూ ముందుకు రాకపోవడంతో తిరిగి ఆగస్టు 13న మూడోసారి ఆహ్వానించారు. ఏటా రాష్ట్రవ్యాప్తంగా 23వేలకు పైగా చెరువుల్లో చేపల పెంపకం చేపడతారు. చిన్న చెరువుల్లో 35-40 మి.మీ పిల్లలు 41.63 కోట్లు, పెద్ద చెరువుల్లో 80-100 మి.మీ పైగా సైజ్‌ ఉన్న పిల్లలు 34.74 కోట్లు పంపిణీ చేస్తారు. అలాగే 357 మంచినీటి చెరువులకు 9.15 కోట్ల రొయ్య పిల్లలను సరఫరా చేస్తారు. చిన్నపిల్లలకు హెక్టార్‌కు మూడు వేల చొప్పున లక్ష పిల్లలకు రూ.51వేలు, పెద్ద వాటికి హెక్టార్‌కు రెండువేల చొప్పున లక్ష పిల్లలకు రూ.1.61 లక్షలు చెల్లిస్తారు.
బినామీలుగా అధికారుల సంబంధీకులు..!
ఏటా చేపపిల్లల పంపిణీ పథకం కోసం ప్రభుత్వం జిల్లాల వారీగా టెండర్లు పిలుస్తోంది. 10 నుంచి 12 మంది కాంట్రాక్టర్లు వీటిని దక్కించుకుంటున్నారు. కొందరు అధికారుల సంబంధీకులు బినామీలుగా అవతారం ఎత్తుతున్నారు. టెండర్‌ పొందిన తర్వాత సరిగా పంపిణీ చేయటం లేదు. అయినప్పటికీ వీరికి ప్రతేడాది రూ.100 కోట్లు చెల్లింపులు చేస్తున్నారు.
ఎవరికీ పట్టని ‘వైరా’ చేప ఉత్పత్తి కేంద్రం
ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో నాలుగేండ్ల కిందట చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. కోటి పిల్లల ఉత్పత్తి లక్ష్యంతో ప్రారంభమైన ఈ కేంద్రంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా తొలి ఏడాది పది లక్షల పిల్లలను మాత్రమే ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ ఐదారు లక్షలకు పడిపోయాయి. గతేడాది రెండు లక్షల పిల్లలను మాత్రమే ఉత్పత్తి చేశారు. ఈ కేంద్రం నిర్వహణకు ఏటా రూ.కోటి నిధులు కావాల్సి ఉండగా రూ. లక్ష, రెండు లక్షలు మాత్రమే విడుదల చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -