జైపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారిగా విధులు.. ఆదాయానికి మించి ఆస్తులు
ఆరు చోట్ల ఏకకాలంలో విజిలెన్స్ అధికారుల సోదాలు
భువనేశ్వర్ : ఒడిశాకు చెందిన ఓ అటవీ శాఖ అధికారి, ఆయన కుటుంబసభ్యుల పేరిట 115 ప్లాట్లు రిజిస్టరై ఉండటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దానిని మర్చిపోక ముందే ఇదే తరహా ఘటన మరొకటి అదే రాష్ట్రంలో బయటపడింది. శుక్రవారం ఉదయం రామచంద్ర నేపక్ అనే అటవీశాఖ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు భారీగా నగదుతోపాటు బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 16 బంగారు నాణేలు (ఒక్కొక్కటి 10 గ్రా), రూ.1.44 కోట్ల నగదు గుర్తించినట్లు వెల్లడించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. రామచంద్ర గతంలో జైపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారిగా విధులు నిర్వర్తించే వారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఒడిశా, జైపూర్‌లో ఆరు చోట్ల ఏక కాలంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జైపుర్‌లో అతడు నివాసం ఉన్న అపార్ట్‌మెంట్‌లో గుట్టలు గుట్టలుగా నగదు బయటపడుతుండటంతో.. లెక్కించేందుకు ప్రత్యేకంగా కరెన్సీ కౌంటింగ్ మెషీన్‌ను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆయన నివాసంతోపాటు, ఆయన పని చేసిన కార్యాలయం, అత్తవా రిల్లు, భువనేశ్వర్‌లోని ఆయన సోదరుడి ఇంట్లోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న నిత్యానంద నాయక్ అనే అధికారి ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించగా.. 115 ప్లాట్లు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. నాయక్ పేరుతో 53 ప్లాట్లు, ఆయన భార్య పేరుపై 42, ఇద్దరు కుమారులపై 16, కుమార్తె పేరు మీద మరో నాలుగు ప్లాట్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. తాజాగా ఒడిశాకు చెందిన మరో అధికారి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో డబ్బు, బంగారం బయటపడటం మరోసారి చర్చనీయాంశమైంది.
అటవీశాఖ అధికారి ఇంట్లో నోట్ల గుట్టలు
- Advertisement -
- Advertisement -