పరీక్షకు అర్హత సాధించిన 462 మంది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జేఈఈ మెయిన్ -2026 మొదటి విడత పరీక్షా ఫలితాల్లో తెలంగాణ గిరిజన గురుకులాల విద్యాలయాల సంస్థ, తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీకి చెందిన విద్యార్థులు గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. గతేడాది కటాఫ్ ఆధారంగా చూస్తే 462 మందికి ఈ ఏడాది జేఈఈ (అడ్వాన్స్ డ్ ) పరీక్షకు అర్హత సాధించినట్టే. వీరిలో రాజేంద్రనగర్, ఇతర ప్రతిభ కేంద్రాలకు చెందిన విద్యార్థులు అత్యధిక పర్సంటైల్‌ను సాధించి తమ కుటుంబ పేదరికం విజయానికి అడ్డంకి కాదని నిరూపించారు. చౌహాన్ ప్రవీణ్ 93.45 పర్సంటైల్, అజ్మీరా మహేశ్ 91.97, రమావత్ లక్ష్మణ్ నాయక్ 90.01, బానోత్ కార్తీక్ 90.18 పత్లావత్ స్వాతి 89.29, ముడు గీతాంజలి 89.29 పర్సంటైల్ సాధించారు.
90 పర్సంటేజ్ పైగా 5 మంది, 80 – 90 పర్సంటైల్ 27 మంది, 70- 80 పర్సంటైల్ 71 మంది, 60-70 పర్సంటైల్ 83 మంది, 50-59 పర్సంటైల్ 109 మంది తెచ్చుకున్నారు. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షల్లో మరింత మంది విద్యార్థులు అత్యధిక పర్సంటైల్ సాధించేందుకు ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నట్టు ఆ రెండు సంస్థల అధికారులు తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులను, వారి బోధనా సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్య కార్యదర్శి సభ్యసాచి ఘోష్, ఆ సొసైటీల కార్యదర్శి కె.సీతాలక్ష్మి అభినందించారు.



