అనుకోకుండా అడుగులు గుట్ట దిక్కు పడ్డయి
చెట్ల మీద ఆకాశాన్ని పందిరిలా ఎవరో కప్పిండ్రు
పొద్దున్నే రెక్కలిప్పిన ఇగం తప్ప
ఎగిరిన పచ్చిలేదు
నీడలు కూడా ముడుచుకున్నయి
పొద్దు పొద్దుబోయినంగా లేచింది
నిశ్శబ్దం అంతా తిరిగొచ్చీ
తలలో పొదిగిన మహాకాంతిని
రాత్రికి వెన్నెలబంతికి దాచుకుంది
ఎవరెవరో నడుచుకుంటా నా గుండా వొస్తున్నరు
మొక్కలు పేరు తెలియని పువ్వులకు
నా గురించి ఏదో చెబుతున్నాయి
ఎండ పొడ మెల్లగా ఎక్కుతుంటే
సండ్ర చెట్ల మధ్య పిట్ట పిల్లలు
ఎండిన ఆకుల్ని పొడుస్తున్నయి
సీతాఫలలా చెట్ల మధ్య
తియ్యని పచ్ఛులమైన తలం
గుట్ట మీదికెళ్లీ ఎగురుకుంటా వచ్చి
సమరు కాకి సాయంత్రాన్ని తీసుకొచ్చింది
పాత రధం కాడ యాప పండ్ల కుప్ప మీద
ఆడుకుంటున్న గోరెంక
ఎన్నెల్ని రమ్మంటు ఎగిరిపోయింది
తాటి పండ్లు కాలిన వాసన…
పాటి పరిమళాలు
గంటిల ముసల్ది నవ్వినట్టుంది
ఏ అవ్వో గవ్వల పేరు మర్చిపోయినట్టుంది
అమ్మ చెప్పిన ముచ్చట్లు
నా చుట్టూ రింగన్న పురుగులా తిరుగుతున్నాయి
గాలి ఎల్లమ్మ కథ చెబుతున్నట్టుంది
జీవన తంత్రులు మీటిన జీవగడ్డ కదా ఇది
అణువణువు పరవశించి నాట్యం చేసిన నేల కదా
ఏ చెట్టు కింద కూసున్న ధ్యాన లోకమే కదా
భూమి కదులుతుందో
మాయి ముంతలు కదులుతున్నాయో…..
సన్నగా వణుకు పురివిప్పి
పూనకం పూనుకున్నది
అమ్మ గుడి మెట్లు కడిగినంగెనే
దేవుడు కిందికొచ్చేటోడు
ఇంకో నాలుగు అడుగులు ముందుకు పడ్డాక
ఉన్నట్టుండి ఉడుతలు ఊరికిపోయినయి
పచ్చులు పారిపోయినయి
పొదలల్ల జీవి లేదు
మరుగున మనిషి లేడు
ముని తోవలల్లా ముళ్ళు మొలిచినయి
ఏవో నీడల శ్వాస
మర్రి చెట్టు నీడ లేదు
మనసు విప్పిన మాట లేదు
సల్లని చెమ్మేలేదు
ఎటు చూసినా ఎద జాడ లేదు
చెట్లు తలవొంచుకునే ఉన్నయి
ఈ నేలను ఎవ్వమతొవ్వుకుంటూ పోయిన,
ఇంక బువ్వ పెడుతూనే ఉంది
ఖాళీ చేసిన పోయిన నిశ్శబ్దాలు
నన్ను అలింగనం చేసుకుంటున్నాయి
చీకటి పడుతుంది
పడమటి గూట్లో కాలన్ని పొదుగుతున్న పొద్దు
ఖాళీగా ఉన్న గూడు….
రేపటి పచ్చల కోసం ఎదురుచూస్తుంది
- మునాసు వెంకట్, 9948158163.



