దేశ ప్రజల ఆర్థిక సామాజిక ప్రగతికి, ఒక జాతి అన్ని కోణాల్లోనూ అభివృద్ధి చెందడానికి విద్యతో పాటు వైద్య ఆరోగ్యరంగం కూడా ముఖ్యమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, మన దేశంలో ఈ అంశాలే అత్యంత నిర్లక్ష్యానికి గురవుతుండటం బాధాకరం. మన మానవ వనరుల పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో చెప్పడానికి ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) వెల్లడించిన గణాంకాలే నిదర్శనం. ఐదేండ్లలోపు చిన్నారుల్లో 67 శాతం, 15 నుంచి 49 సంవత్సరాల మహిళల్లో 57 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడించింది. ఈ లెక్కలు పదేండ్లపైన నిరాటంకంగా పాలిస్తున్న కేంద్రపాలకులకు చెంపపెట్టు లాంటిది. అయినా మన దేశాధినేతలు దేశం ప్రపంచ ఆర్థిక పటంలో వేగంగా ఎదుగుతోందని, ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పుకోవడం మాత్రం సిగ్గుచేటు.
పిల్లల్ని కనే వయసున్న మహిళల్లో రక్తహీనత గత పదేండ్లలో నాలుగు శాతం పెరిగిందని సర్వేలో వెల్లడైంది. తల్లి ఆరోగ్యం బలహీనమైతే కుటుంబ ఆరోగ్యం దెబ్బతింటుంది; గర్భిణీల్లో రక్తహీనత ఉంటే తక్కువ బరువుతో పుట్టే శిశువులు, శిశుమరణాలు పెరుగుతాయి. ఈ పరిస్థితి తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. పేదరికం వల్ల సరైన పోషకాహారం లేకపోవడమూ సమస్య ను మరింత పెంచుతున్నాయి. చిన్నారి జీవితం లోనూ తొలి ఐదేండ్లు శారీరక, మానసిక, మేధో అభివృద్ధికి అత్యంత కీలక దశ. ఈ సమయంలో ఏదీ తగ్గినా తరచూ అనారోగ్యానికి గురవుతారు. దీని ప్రభావం పాఠశాల విద్య నుంచి భవిష్య త్తు ఉపాధి అవకాశాల దాకా ఉంటుంది. ఈ సమస్యను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తాము అధికారంలోకి రాగానే అందరికీ తిండి, ఆరోగ్యం, వైద్యం, వైద్యం, కనీస మౌలిక సదుపాయాలు అందిస్తామని చెప్పినప్పటికీ, అదే బాటలో బీజేపీ కూడా నిర్లక్ష్యం చేస్తోందని గణాంకాలను బట్టే అర్థమవుతోంది.
పదేండ్లు దాటినా ఇప్పటికీ రక్తహినతతో బాధపడేవారు, చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడంలేదు. 2019లో ఎనీమియా ముక్త్ భారత్ (ఎఎంబి) పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టినా… ఉపయోగం లేకపోగా, అమలే సరిగా లేదు. ప్రజా ఆరోగ్య వ్యవస్థపై పెట్టుబడులు తగినంతగా లేకుండా మాతా శిశువులకు బలవర్థకమైన ఆహారాన్ని అందించాలని ఎన్ని ప్రకటనలు చేస్తే లాభం? ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, పప్పులు, నూనెలు, ప్రోటీన్ వనరులు అందుబాటులో ఉంచడం, అంగన్‌వాడీ సేవలను విస్తరించడం, ఆశా కార్యకర్తలను పెంచడం ప్రధానం. ఇంకా చెప్పాలంటే ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచడం వంటి నిర్మాణాత్మక చర్యలు చాలా అవసరం. ఇవి చేయకుండా రక్తహీనత ఎలా తగ్గుతుంది?
పన్నెండేండ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పాలనలో కార్పొరేట్ కేంద్రీకృత ఆర్థిక విధానాలు వేగవంతమయ్యాయి; భారీ మౌలికవసతుల ప్రాజెక్టులు, కార్పొరేట్ పన్ను రాయితీలు, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ జరుగుతోంది. కార్పొరేట్లకు ఉపయోగపడే విధానాలు తప్ప పేదలకు ప్రయోజనం చేకూర్చే సంక్షేమ పథకాలను పటిష్టం చేయడం లేదు. ప్రజల పోషకాహార భద్రత, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా వదిలేసింది. ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రల సరఫరా నిరంతరాయంగా లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ బలహీనంగా ఉండటం, అంగన్‌వాడీ వ్యవస్థకు బడ్జెట్‌లో నిధులు తగ్గించడం వంటివి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నిధులు తగ్గించి రాష్ట్రాలపై భారం మోపడం, మధ్యాహ్న భోజనం పథకాన్ని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ నిధులు తగ్గించడం వంటి అంశాలు మాతాశిశువుల్లో రక్తహీనతకు కారణమవుతున్నాయి.
రక్తహీనతను తగ్గించడం అనేది కేవలం ఆరోగ్య సూచిక మెరుగుదల కాదు, అది దేశ మానవ మూలధనాన్ని బలోపేతం చేసే పెట్టుబడి. ఆర్థికంగా శక్తివంతమైన దేశం కావాలంటే ఆరోగ్యంగా, పోషకాహారంతో నిండిన భారత్ కావాలి. గణాంకాలు హెచ్చరికగా మారిన ఈ దశలో ప్రభుత్వం, సమాజం, కుటుంబాలు కలిసికట్టుగా కదలకపోతే అభివృద్ధి అంకెల్లో మాత్రమే కనిపిస్తుంది గానీ ప్రజల జీవితాల్లో ప్రతిఫలించదు. బియ్యం, గోధుమల పంపిణీతో మాత్రమే సమస్య పరిష్కారం కాదు, పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు వంటి పోషకాలను ప్రభుత్వాలు అందుబాటులో ఉంచాలి. ప్రజల ఆరోగ్యం, పోషకాహారం, గౌరవప్రద జీవనోపాధి హక్కుగా స్థాపించబడినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం. ‘అందరికీ ఆరోగ్యం’ నినాదాన్ని సాకారం చేయాలంటే ఆరోగ్య వ్యవస్థను మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసే విధానాలను పాలకులు విడనాడాలి.
భవిష్యత్తు బలహీనం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



