ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల విడుదలపై మంత్రి అడ్లూరి హర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యార్ధుల భవిష్యత్తే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదనీ, గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిల నిధులు విడుదల చేశామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చెప్పారు.ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ విద్య ద్వారా సమాన అవకాశాలు దక్కాలనీ, వారి ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థికి ఓవర్సీస్ పథకం కింద రూ .20 లక్షలు ఇచ్చామనీ, 2, 288 విద్యార్థులకు సుమారు రూ. 304కోట్ల నిధులు విడుదల చేశామని గుర్తు చేశారు. ఇప్పటివరకు 3,642 మంది విద్యార్థులకు రూ.463 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 2022 నుంచి ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ విడుదల అయ్యాయని చెప్పారు. అర్హతకలిగిన విద్యార్థులకు నేరుగా వారు బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతుందన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్న విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించి ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులను విడుదల చేశామన్నారు. 
తద్వారా విద్యార్థుల కలలను నేరవేర్చడంతో పాటు వారి కుటుంబాల్లో వెలుగులు నింపామని చెప్పారు. యూకే ,అమెరికా యూరప్ ఆస్ట్రేలియాతో పాటు పలు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అననూకూల పరిస్థితులున్నాయనీ, ఈ స్థితిలో నిధుల విడుదల కొంత ఊరట కల్పిస్తుందన్నారు. సంక్షేమ హాస్టళ్లలో (ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ) తక్షణ ఇబ్బందులను అధిగమించేందుకు రూ. 60 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇవి జిల్లా కలెక్టర్లు, సెక్రటరీ పరిధిలో ఉంటాయన్నారు. 119 నియోజకర్గాల్లో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వారు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల డైట్ గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. సమావేశంలో సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సభ్యసాచి గోష్, ఎస్‌సీడీడీ ప్రధాన కార్యదర్శి బుద్ధ ప్రకాష్, కమిషనర్ క్షితిజ, గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
                                    