మూతపడుతున్న థియేటర్లు, వీధిన పడుతున్న కార్మికులు
కరోనాలో మూతపడి నేటికీ తెరుచుకోని థియేటర్లు
పోస్టర్ బార్సు మొదలుకొని ప్రొప్రయిటర్ల దాక
పాన్‌షాప్‌లు మొదలుకొని పల్లీ బట్టీల వరకు
పనిలేక వీధిన పడిన వందలాది కుటుంబాలు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
సినిమా రంగం ఆధారంగా జీవనం సాగించే కళాకారుల నుంచి కార్మికుల దాక వారి జీవన పరిస్థితులు చిధ్రమయ్యాయి. ఒక చేత్తో డొక్కు సైకిల్ పట్టుకొని మరో చేత్తో పొడవాటి నిచ్చెన భుజాన పెట్టుకుని ఈగలు ముసిరిన లై డబ్బాను వెంటబెట్టుకొని రంగు రంగు పోస్టర్లు వేసే పోస్టర్ బారునుంచి ప్రొప్రయిటర్ దాక.. పాన్ షాపుల నుంచి పల్లీలమ్మే వారిదాక.. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కరోనా తర్వాత మనిషి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. సినిమాలను థియేటర్లలో చూడటంపై ఆసక్తి తగ్గింది.
దాంతో ఆర్థికభారంతో రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కొత్త సినిమా వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఉదయం షో మొదలుకొని రాత్రి రెండో ఆట దాక థియేటర్ల ముందు బారులు తీరి టికెట్ల కోసం ఎగబాకేవారు. కొత్త సినిమా విడుదలయిన మొదటి రోజయితే టికెట్ల దగ్గర యుద్ధం తలపించేది. వారం రోజుల ముందే టికెట్లు అమ్మేవారు. మరికొందరయితే.. రూ. 20ల టికెట్లను రూ.200ల వరకు భ్లాక్‌లో కొని మరీ సినిమా చూసేవారు. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం వీరిని గుర్తించి జీవనోపాధి కోసం ఆర్థిక సహాయం అందజేయాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.
ప్రతి గ్రామంలో ఆధునిక ఎల్‌ఈడీ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ఓటీటీలో వచ్చిన సినిమాను వెంటనే టీవీలో చూసే అవకాశాలూ వచ్చాయి. ఎక్కడ ఉన్నా.. తన దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌లో సైతం సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి. ఐబొమ్మ, మూవీరూల్స్ వంటి వెబ్‌సైట్స్‌లో కూడా కొత్త సినిమాలు పెడుతునానరు. ముఖ్యంగా మారిన జీవన శైలి వల్ల థిమేటర్లకు వెళ్లి రెండున్నర గంటలు సినిమా చూసే పరిస్థితులు లేవు. పెరిగిన పోటీతత్వం, ఆర్థిక అవసరాలు, పని వత్తిడి తదితర అంశాలు ప్రజలను థియేటర్లకు దూరం చేశాయి. ఈ పరిస్థితుల్లోనే జిల్లాల్లో ఆర్థిక భారం మోయలేక అనేక థియేటర్లు మూత పడుతున్నాయి. జిల్లాలో ఉన్న థియేటర్లు మూతపడటంతో అందులో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి ఉపాధి లేకుండా పోయింది.
ఒక థియేటర్ పరిధిలో పోస్టర్ బార్సు ఇద్దరు, సైకిల్, బైక్, కారు స్టాండ్‌లో ఆరు మంది, ఇద్దరు వాచ్‌మెన్లు, క్లీనింగ్‌కు నలుగురు, సాంకేతిక నిపుణులు 5 మంది, ఆపరేటర్లు ఇద్దరు, టికెట్లు అమ్మేవారు నలుగురు, పాన్‌డబ్బా, టిఫిన్, పల్లీలు, బటానీలు అమ్మేవారు, వీరితోపాటు శీతల పానీయాలు.. ఇలా ఒక్కో టాకీస్ పరిధిలో సుమారు 50 కుటుంబాలు జీవిస్తుంటాయి. అరకొర ఆదాయం ఉన్నా గత్యంతరం లేక జీవనం సాగించేవారికి థియేటర్లు మూత పడుతుండటంతో జీవనోపాది కోల్పోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 110 థియేటర్లు ఉంటే 5500 కుటుంబాలు జీవనం సాగిస్తుంటారు. వీరిలో నేడు 75శాతానికి పైగానే జీవనోపాధి కోల్పోయారు.
ఉపాధి లేక..
ఉపాధి లేక అనేక మంది కార్మికులు ఇతర రంగాల్లో పనిచేయడానికి వెళ్తున్నారు. ప్రధానంగా నిర్మాణ రంగం, హోటళ్లు, బట్టల షాపుల్లో పనిచేస్తున్నారు. అలాగే, ఇప్పుడు నడుస్తున్న షాట్‌లైట్ ప్రసారంతో ఇక్కడ సాంకేతిక నిపుణుల అవసరం లేదు. దాంతో ఇప్పుడు నడుస్తున్న థియేటర్లలో సైతం వీరి అవసరం లేకుండా పోయింది. మూతపడ్డ థియేటర్లతో పాటు నడుస్తున్న థియేటర్లలో సైతం సాంకేతిక నిపుణుల అవసరం లేకపోవడంతో వీరు సైతం రోడ్డున పడ్డారు. షాట్‌లైట్ ప్రసారం కావడంతో అనేక మంది జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
నాకు పని లేకుండా పోయింది
నాగర్ కర్నూల్ పట్టణంలోని రవీంద్ర సినిమా థియేటర్లో 10 సంవత్సరాలు టికెట్ల బుకింగ్‌లో పనిచేశాను. ఈ థియేటర్ మూతపడిన తర్వాత నాకు పని లేకుండా పోయింది. బయట ఏ పని చేయలేకపోతున్నాను.
-శంకర్, నాగర్ కర్నూల్
ఉపాధి కోసం బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించాలి
జిల్లాలో 20 థియేటర్ల దాకా మూతపడ్డాయి. సుమారు వెయ్యి మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. నేడు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. వీరికి ప్రభుత్వం ద్వారా రుణమందిస్తే చిన్న చిన్న వృత్తులు చేసుకొని జీవిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణ సదుపాయం అందించాలి.
-పొదిల రామయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు నాగర్ కర్నూల్



