సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం వల్ల దేశంలో గ్యాస్, ఇంధన కొరత ఏర్పడి ప్రజలు, పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయనీ, తక్షణమే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని గ్యాస్, ఇంధన సంక్షోభాన్ని నివారించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో, రాష్ట్రంలో గ్యాస్, ఇంధన కొరత రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోందని తెలిపారు. గృహ వాడకం, పరిశ్రమలు, వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సుమారు 40 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. అనేక పరిశ్రమల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని పేర్కొన్నారు. దీంతో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని తెలిపారు. వంట గ్యాస్ కొరత వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి. ప్రజలపై మరింత భారాన్ని మోపిందని విమర్శించారు. మరో పక్క బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశరు.
వంట గ్యాస్ కొరత కారణంగా ఆస్పత్రులు, హాస్టళ్లు మూతపడ్డాయని తెలిపారు. వేలాది మంది గిగ్ వర్కర్లు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి జిల్లాల్లో వందలాది పరిశ్రమలు గ్యాస్ కొరతతో మూడపడిపోయాయని తెలిపారు. మరికొన్ని ఉత్పత్తిని తగ్గించడం, మూడు షిఫ్టులు పనిచేసే పరిశ్రమల్లో ఒకే షిఫ్ట్ కార్మికులతో పని చేయడంతో మిగతా కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారని తెలిపారు. ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించడం పల్ల ధరలు విపరీతంగా పెరగడంతో కార్మికులకు భారమవుతున్నదని పేర్కొన్నారు.
ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ఔషధి పదార్థాలు తయారు చేసే కంపెనీలకు కూడా సరిపడా గ్యాస్ లేకపోవడంతో ఔషధాల ఉత్పత్తి తగ్గుతున్నదని తెలిపారు. ఇది రాబోయే రోజుల్లో ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎన్‌జీ గ్యాస్ కొరతతో ట్రాన్స్‌పోర్టు రంగం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని తెలిపారు. ఆటో, క్యాబ్, ఇతర వాహనాలను నడిపే వారికి సీిఎన్‌జీ లేకపోవడంతో రవాణా వ్యవస్థ స్థంభించిందనీ, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ వ్యవస్థ దెబ్బతింటున్నదనీ, దళారులు అధిక ధరలు పెట్టి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. రవాణా వ్యవస్థ సంక్షోభంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురౌతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరతను నివారించాలని డిమాండ్ చేశారు.
గ్యాస్, ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



