జ్ఞాన్ బాగ్ అడవి! అందులో మధ్యలో ప్యాలెస్! కుక్కలు బోలెడు ఉంటాయి! ఉదయం 5 గంటలకే రమ్మన్నారు! గేట్ దగ్గరకు వచ్చాక ఫోన్ చేయమన్నారు రాజకుమారి! నేను, నాతో ఫోటోగ్రాఫర్ నగేష్! గేటు దగ్గర నుంచి ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతోంది, లిఫ్ట్ చేయడం లేదు! తిరిగి వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్న సమయంలో వాచ్ మెన్ వచ్చాడు… అమ్మగారు రమ్మంటున్నారంటూ! అది ప్యాలెస్ కు తగిన గేటు కాదు! కర్రలతో అడ్డం పెట్టిన తలుపు! అది ప్యాలెస్, గేటు ఇలా ఉందేమిటా అనుకున్నాను! సితార సినిమా గుర్తుకొచ్చింది! వాచ్ మెన్ మమ్మల్ని తీసుకుని అర కిలోమీటర్ పైనే లోపలకు చెట్ల మధ్యలోంచి వెళితే ఒక పాడుబడిన మహా ప్యాలెస్! బూత్ బంగళాలాంటిదే! అవుట్ హౌసులు దాటుకుని లోపలకు అడుగు పెడితే, నిజ్జంగా మతిబోయింది!
రాజులు రాణులు ఇలా ఉండేవారేమో ఆ రోజుల్లో అన్నట్లు ఆ ఆనవాళ్ళకు గుర్తుగా అక్కడ సామాగ్రి, ఫర్నిచర్! పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకున్నట్లుగానే ఆ రాజసం ఉట్టిపడుతూనే వుంది! ఇద్దరూ కవులే కాబట్టి అంతా కళాత్మకంగా ఉంది! అలా కూర్చుని చుట్టూ కళ్ళతో స్కాన్ చేస్తూ ఉండగా ఆరు గంటలకు ఆయన వచ్చారు! పరిచయాలు అయ్యాక కాసేపటికి ఆమె వచ్చారు! ఇద్దరూ ఇద్దరే! మెరిసిపోతున్నారు! అప్పటికే ఆమెకు 73, ఆయనకు 76 ఉండొచ్చు! ఆమెతో సహవాసం ఆయనకూ రాజరికం వచ్చేసింది! ఎంతో హుందాగా ఎంతో రాజసంగా! ఆమె కాఫీ కలిపి ఆయనకు, అదే చేతితో మాకు! కలయా నిజమా….
నిజమే! ఆ ఇద్దరే…ఒకరు రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిర్, మరొకరు నాకు అత్యంత ఇష్టమైన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ! అది ”డైరీ లో ఒక పేజీ” అనే ఫీచర్ కోసం చేసిన ఇంటర్వ్యూ! వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వారి దినచర్యను పాఠకులకు పరిచయం చేయడం! ఆ అదృష్టం వల్ల ఒక రోజంతా వారిద్దరితో కలసి ఉండే అరుదైన అవకాశం నాకు లభించింది! ఆ తరువాత తరువాత ఎన్నో అనుభవాలు మరెన్నో జ్ఞాపకాలు! అయితే మొదటిసారి కలసిన ఆరోజు నా జీవితంలో మధురమైన రోజు! ఇటీవల రాజకుమారి ఇందిరాదేవి కనుమూశారు తన 96వ ఏట! అంబర్‌పేట్ స్మశాన వాటికలో శేషేంద్ర సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు నిరాడంబరంగా జరిగిపోయాయి! అలా జరగాలనేది ఆమె చివరి కోరిక! సింపుల్ గా ఆమె అంత్యక్రియలు జరిగిపోవాలనేది ఆమె ఆఖరి ఆలోచన! విశ్వనాధ సత్యనారాయణ గారి సోదరుడి కుమారుడు శోభనాద్రి గారు దగ్గరుండి అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహించారు.
అది కూడా ఆమె కోరిక ప్రకారమే! శేషేంద్రుడికి జరిగినట్లే బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతుల్లో ఆమె వెళ్ళిపోయింది! ఒక చరిత్ర ముగిసింది! నిజాం ప్రభువుతో అనుబంధం వున్న రాజకుమారి శకం ముగిసింది! రాజకుమారి ఇందిరాదేవి గారిది ఘన చరిత్ర! ఆనాటి హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రి కిషన్ పెర్షాద్‌తో ఆమె క్యారమ్స్ ఆడారు! మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ ఆమె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు! ఆమె తండ్రి రాజా ధన్ రాజ్ గిర్ హైదరాబాద్‌కు క్రికెట్ పరిచయం చేశారు! హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర ఆయన కోర్టు సేవలు అందించారు. అల్లామ ఇక్బల్, మఖ్డుం మొహియుద్దీన్ లాంటి కవులు ఆమె స్నేహితులు! అందుకే కవిత్వం అబ్బింది! హైదరాబాద్ కు ఆంగ్ల, ఉర్దూ కవులు వస్తే ముందుగా వారి రాజ కోటలోనే అతిధ్యం! కొందరికి ఆ కోట విడిది! ఆమె చిన్నప్పుడే ఇండో ఆంగ్ల కవయిత్రిగా గుర్తింపు పొందారు. అప్పటికే పెళ్ళి అయి పిల్లలున్న శేషేంద్ర శర్మను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
ఆ పెళ్ళి కూడా హాలీబీడ్ లో ఒక ఆలయంలో సింపుల్‌గా జరిగిపోయింది. పెళ్ళి సమయంలో రాజకుమారి గుడిలో పెళ్ళి చేసుకుంటున్నడని తెలిసి ఆ జంటను చూసేందుకు ఊర్లో వాళ్లంతా లాంతర్లు పట్టుకుని వచ్చారట! ఈ విషయం రాజకుమారి ఒక కథలా నాకు చెప్పారు! అప్పట్లో శేషేంద్ర నెల్లూరులో మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం! అప్పటికే భార్య పిల్లలున్నారు! పోస్టు కార్డులతో మొదలై ట్రంక్ కాల్స్ వరకు వెళ్లి ఆ ఇంట ఈ కోటలో ఎదిరించి చేసుకున్న వివాహం! ఆయన కోసం ఆమె కవిత్వం పక్కన పెట్టేశారు! ఆయనకు జీవితాన్ని అంకితం చేసుకున్నారు! ఇదొక ప్రేమ చరిత్ర! కళ్ళ ముందున్న ఘన చరిత్ర! అమరమైన భాగ్యనగర జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ ప్రేమ! ఈ ప్రేమ జరగకుండా ఉంటే రాజకుమారిగా ఆమె జీవితం ఇంకెలా ఉండేదో!
నేనొకసారి అడిగాను! 1973లోనే నోబెల్ అంచుల వరకు వెళ్లిన తొలి భారత కవయిత్రి అయి ఉండి ఎందుకు వెనకడుగు వేశారని! ”ఇదుగో ఈ బంగారం కోసమే” అని శేషేంద్రను చూపించారు. ఇద్దరూ రొమాంటిక్ దంపతులు! కవితలతో ఆడుకుంటారు! అక్షరాలతో వారిద్దరి సరసాలు అలకలు అద్భుతాలు! ఇందిరాదేవికి భాగ్యనగరం అంటే ఎనలేని ప్రేమ! అబిడ్స్ లోని సరోజిని నాయుడు ఇంటిని గోల్డెన్ థ్రెషోల్డ్ గా అద్భుతంగా మార్చడం వెనక ఆమె కృషి వుంది! తన ప్యాలెస్ ను దర్బార్ గా మార్చి ఎన్నో కవితా యజ్ఞాలు నిర్వహించారు! ఏది చేసినా శేషేంద్ర కోసమే చేశారు! ఏం చేసినా ఆయన కళ్ళల్లో ఆనందం కోసమే అనేవారు! 1975లోనే ఆ ప్యాలెస్‌లో బాపు గారు ముత్యాల ముగ్గు సినిమా తీసిన చరిత్ర వుంది!
రాజకుమారి ఇందిరాదేవి ఒకసారి నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నేను చేస్తున్న ఉద్యోగం మానేసి తన దగ్గర ప్యాలెస్ లో చేరి చేతులు కలపమన్నారు! ప్యాలెస్‌ను కవుల దర్బార్‌గా మార్చి రోజూ సందడి చేస్తూ శేషేంద్ర గారికి ఆనందం ఇద్దాం వచ్చేయమన్నారు. నేను ధైర్యం చేయలేకపోయాను! ప్యాలెస్‌కే నా జీవితం పరిమితం అయిపోతుందేమో అని భయపడ్డాను. అప్పుడప్పుడు సాయంత్రాలు వెళ్ళి అర్ధరాత్రి వరకు వారితో కబుర్లు చెప్పుకోవడం అలవాటుగా మార్చుకున్నాను. వారిద్దరూ రాసుకున్న ప్రేమ లేఖలను దుమ్ము దులిపి ఆమె చదివితే నేను వినే వాడ్ని! ఆమె అపురూపంగా దాచుకున్నారు. ఎన్నో విషయాలు పంచుకున్నారు! అవన్నీ తలచుకుంటుంటే రాజకుమారి వైభవం కళ్ళ ముందు కదలాడుతున్నట్లే ఉంటుంది! ఎంత గర్వంగా ఉంటుందో నచ్చితే అంత ఒదిగి ఉంటుందావిడ! దేశంలో హైదరాబాద్ సాహిత్య ఖిల్లా కావడానికి ఏం చేద్దామంటూఎన్నో ప్రణాళికలు రూపొందించారు. కానీ, ఆమెకు ఎవ్వరు సరైన సహకారం ఇవ్వలేదు! కారణం శేషేంద్రకు ఎక్కడ పేరొస్తుందనే భయం కావచ్చని ఆమె నాతో అన్నారు పలుమార్లు!
అందుకే తెలుగు సాహిత్య రంగంలో ఇద్దరు కవులు అంటే ఆమెకు మహా కోపం! తన ప్రాణానికి ప్రాణమైన శేషేంద్రకు జ్ఞానపీఠ రాకుండా చేశారని తెగ తిట్టేవారు! ఒకసారి శేషేంద్ర గారికి స్వర్ణ కంకణ మహోత్సవం రవీంద్రభారతిలో చేయాలని తలపెట్టారు ఆమె! వంశీ సంస్థ ఆధ్వర్యంలో జరగాల్సిన వేడుక! సి.నారాయణ రెడ్డిని పిలవాల్సిందే అని ఆ సంస్థ పట్టుబట్టింది! ఆయన లేకుండా చేయమని రాజకుమారి ఆజ్ఞ! వాళ్ళు కుదరదన్నారు! అంతే, అప్పటికప్పుడు సంస్థనే మార్చేశారు! యువకళావాహినికి అవకాశం ఇచ్చారు! ఇలా ఆమె ఆలోచనలు చాలా సాహసంగా ఉండేవి! అప్పటికప్పుడు ఆమె తీసుకునే నిర్ణయాలు చాలా ఆశ్చర్యం కలిగించేవి! కొన్నాళ్ళకు శేషేంద్ర గారి ఆరోగ్యం దెబ్బతింది. ఇక ఆమె నన్ను పిలవడం మానేశారు. 2007లో ఆయన చనిపోయారు. ఆ తరువాత చాలాసార్లు పిలిచినా చాలా తక్కువ సార్లు నేను ప్యాలెస్ కు వెళ్ళాను. పాపం ఆమెకు హైదరాబాద్ లో సాహిత్య రంగానికి ఎంతో చేయాలనే తపన! కానీ, ఆమె ఆలోచనలు ఏవీ కార్యాచరణలోకి రాలేదు! ఆమెను కలసిన ప్రతిసారి హైదరాబాద్ చరిత్రను కలసినట్లే ఉండేది! ఇక ఆమె కూడా లేరు! జ్ఞాన్ బాగ్ తలుపులు మూసుకుపోయాయి! అశ్రు నివాళి.
- డా. మహ్మద్ రఫీ, 9848992826



