– ఐరాస సంస్థలను నిర్వీర్యం చేసే ఎత్తుగడ
– ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటుకు ఆరాటం
– బోర్డులో భారత్ చేరికపై ఊహాగానాలు
– భద్రతా మండలిని పలుచన చేయడమే ట్రంప్ లక్ష్యం
రఫా : గాజా శాంతి బోర్డులో చేరాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ఆహ్వానించారు. భారత్ సహా కొన్ని దేశాలకు ఇప్పటికే ఆహ్వానం అందగా మరికొన్ని దేశాలు దాని కోసం ఎదురు చూస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ బోర్డు ఎప్పుడైనా, ఎక్కడైనా సమావేశం కావచ్చునని ట్రంప్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో గాజా శాంతి బోర్డుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇది మన దేశానికి ఓ ‘మందుపాతర’గా మారవచ్చునన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గాజా పునర్నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ట్రంప్ ప్రతిపాదించినదే ఈ శాంతి బోర్డు. అయితే దీని ఉద్దేశాలు కేవలం పునర్నిర్మాణానికే పరిమితం కావని, దానికి మించి వేరే లక్ష్యాలు ఉన్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు.
ఏమిటీ శాంతి బోర్డు?
ప్రపంచ దేశాలలో ఘర్షణలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి, పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి అమెరికా నేతృత్వంలో వివిధ దేశాలతో ఏర్పడే సంస్థే శాంతి బోర్డు. గత సంవత్సరం సెప్టెంబరులో ట్రంప్ దీనిని ప్రతిపాదించారు. గాజాలో అమెరికా మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న కాల్పుల విరమణ రెండో దశను పరిశీలించడం ప్రస్తుతం దీని పని. గాజా పాలనకు సంబంధించిన జాతీయ కమిటీని పర్యవేక్షించడం దీని తక్షణ కర్తవ్యం. అంటే పాలస్తీనాలో సాంకేతిక నిపుణులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అదే సమయంలో గాజా పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించడం, హమాస్ సిబ్బంది ఆయుధాలను విడనాడేలా చూడడం వంటి పనులను ఈ బోర్డు చూడాల్సి ఉంటుందన్న మాట. ఈ బోర్డుకు ట్రంప్ నేతృత్వం వహిస్తారు. వ్యాపారవేత్త, అమెరికా అధ్యక్షుడికి గతంలో సీనియర్ సలహాదారుగా వ్యవహరించిన జేర్డ్ కుష్‌నర్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వంటి ప్రముఖులు ఇందులో సభ్యులు. ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలకు ప్రత్యామ్నాయంగా కార్యకలాపాలు సాగించడమే దీని ఉద్దేశమని నిపుణులు తేల్చి చెప్పారు.
ప్రేక్షక పాత్ర తప్పదా?
బోర్డులో చేరాల్సిందిగా సుమారు 60 మంది ప్రపంచ నేతలకు ట్రంప్ నుంచి ఆహ్వానం అందిందని తెలుస్తోంది. ఇందులో శాశ్వత సభ్యత్వం పొందాలంటే పునర్నిర్మాణ నిధికి అక్షరాలా బిలియన్ డాలర్లు సమర్పించుకోవాల్సి ఉంటుంది. అయితే ఐరాస సర్వసభ్య సమావేశం లేదా భద్రతా మండలిలో మాదిరిగా వాటాదారులందరికీ శాంతి చర్యలలో భాగస్వామ్యం ఉండదు.
అంటే ఇది ఓ పరిమిత వేదిక మాత్రమే అవుతుంది. మరి మన దేశం అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది. అలాంటప్పుడు శాంతి బోర్డు వ్యవహారాలు భారత్‌కు ఇబ్బందికరం అవుతాయి. అన్ని వ్యవహారాలలో తనకు ప్రమేయం ఉండాలని భారత్ కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే శాంతి బోర్డులో అది సాధ్యపడకపోవచ్చు. ఫలితంగా మనం నిష్క్రియాత్మక ప్రేక్షక పాత్రకే పరిమితం కావాల్సి వస్తుంది. పాలస్తీనా విషయంలో మనం రెండు దేశాల పరిష్కారాన్ని కోరుకుంటున్నాము. అలాగే పాలస్తీనియన్ల హక్కులను పరిరక్షించాలని ఆశిస్తున్నాము. అదే సమయంలో ఇజ్రాయిల్‌తో కూడా వ్యూహాత్మక, రక్షణ సంబంధాలను పెంచుకుంటున్నాము. శాంతి బోర్డు ద్వారా ఇవన్నీ సాధ్యపడతాయా?
ఒరిగేదేముంది?
ట్రంప్ ప్రతిపాదించిన శాంతి బోర్డు ఐరాస భద్రతా మండలి అధికారాలను, విలువను పలుచన చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రంప్ నేతృత్వంలో ప్రత్యామ్నాయ ప్రపంచ శాంతి-భద్రతా వ్యవస్థ నిర్మాణానికి అది బాటలు వేస్తుంది. ఆ వ్యవస్థ అమెరికా కనుసన్నలలోనే పనిచేస్తుంది. శాంతి బోర్డుతో భారత్‌కు ఒరిగేదేముంటుంది?. భాగస్వామ్యం, సహకారం, సమానత్వం, అందరి ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకోవాలనే సూత్రానికి మన దేశం కట్టుబడి ఉంది. చాలా కాలంగా వాటినే మనం ఆచరిస్తున్నాం. కోరుకుంటున్నాం. మరి శాంతి బోర్డు వాటిని గౌరవిస్తుందా? ఐరాసను వద్దనుకొని అమెరికా నేతృత్వంలో ఏర్పడే బోర్డులో చేరితే కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరించారు.
పాక్ కూడా చేరితే…
శాంతి బోర్డులో చేరాల్సిందిగా పాకిస్తాన్‌ను కూడా ట్రంప్ ఆహ్వానించారని తెలుస్తోంది. దీనివల్ల భారత్‌కు కొత్తగా ప్రాంతీయ దౌత్య సవాలు ఎదురవుతుంది. ఆహ్వానం అందిందని పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించగా భారత్ మాత్రం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. గాజాలో అంతర్జాతీయ స్థిరీకరణ దళానికి పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఐరాస యేతర కార్యకలాపాలకు తన దళాలను పంపేది లేదని భారత్ పలు సందర్భాలలో ఇప్పటికే స్పష్టం చేసింది. శాంతి బోర్డులో భారత్ చేరితే దౌత్యపరమైన చర్చల సమయంలో పాకిస్తాన్‌తో కలిసి కూర్చోవాల్సి వస్తుంది. ఇది స్వదేశంలో విమర్శలకు దారితీస్తుంది. ఏదేమైనా శాంతి బోర్డుకు భారత్ దూరంగా ఉండే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. అలాంటి వేదికలో చేరితే మాత్రం సమస్యలు వెంటాడడం తథ్యం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దేశీయ విధానాలను, అలాగే ప్రపంచ దేశాలలో భారత్‌కు ఉన్న పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని అడుగు వేయాల్సి ఉంటుంది. లేకుంటే మందుపాతరపై ప్రయాణం తప్పదు.



