Sunday, February 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ రూ.11,460 కోట్లు

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ రూ.11,460 కోట్లు

- Advertisement -

ఆమోదించిన చివరి పాలకమండలి
ముగిసిన పదవీకాలం
అయినా ‘గ్రేటర్‌’పై అదే బాధ్యత : కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి ఐదేండ్ల పదవీకాలం ముగిసింది. శనివారం మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన చివరి ప్రత్యేక బడ్జెట్‌ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి రూ.11,460 కోట్ల భారీ అంచనా బడ్జెట్‌ను కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుండటంతో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో మేయర్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టే ముందు ప్రసంగించారు. తమ పాలకవర్గం ఐదేండ్ల పాలనా కాలంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్య వ్యవస్థ బలోపేతానికి అధిక ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు.

పాలన కాలం విజయవంతంగా పూర్తయ్యిందంటే దానికి కౌన్సిల్‌ సభ్యులుగా మీరు ఇచ్చిన మార్గదర్శనం, సూచనలు, విమర్శలు అని చెప్పారు. అవి కూడా నాకు బలాన్నిచ్చాయని భావోద్వేగానికి గురయ్యారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు, పారిశుధ్య కార్మికులు ఎండా వానా.. పగలు రాత్రి తేడా లేకుండా నగర అభివృద్ధి కోసం చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. పదవి ముగిసినా, హైదరాబాద్‌ పట్ల తన ప్రేమ, బాధ్యత, నిబద్ధతత ఎప్పటికీ తగ్గవన్నారు. భవిష్యత్‌లో నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి అధికారి, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. తనకు ఈ గొప్ప బాధ్యతను అప్పగించిన నగర ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ఈ ప్రయాణంలో తప్పులు జరిగి ఉండొచ్చునని, లోపాలు కనిపించి ఉండొచ్చని అన్నారు. ఆ తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.

ప్రారంభంలో రాజకీయ సెగలు
సమావేశం ప్రారంభంలో రాజకీయ సెగలు కనిపించాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జీహెచ్‌ఎంసీ అప్పుల పాలైందని, అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఆరోపించడంతో గందరగోళం నెలకొంది. దీనిపై బీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. చివరకు మేయర్‌ జోక్యంతో ఇరు గ్రూపులు శాంతించాయి. సమావేశం ప్రారంభంలో ఇటీవల అకాల మరణం చెందిన చంపాపేట్‌ బీజేపీ కార్పొరేటర్‌ వంగా మధుసూదన్‌ రెడ్డికి సభ ఘనంగా నివాళులర్పించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. చివరగా, కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ బదులిస్తూ, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, మల్క కొమురయ్య, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మీర్‌ జుల్ఫేకర్‌ అలీ, మాజిద్‌ హుస్సేన్‌, బండారి లక్ష్మారెడ్డి, అదనపు కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లు, విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -