Saturday, January 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీహెచ్‌ఎంసీ విస్తరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలి

జీహెచ్‌ఎంసీ విస్తరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలి

- Advertisement -

అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) విస్తరణకు సంబంధించిన సవరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ 15 రోజుల్లో మెగా హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు కోసం అభ్యం తరాలను పంపాలని జీహెచ్‌ఎంసీ కోరడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లేకుండా వార్డుల విభజన ఎలా చేపట్టారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల ఓటర్ల వివరాల్లేకుంటే రిజర్వేషన్లను ఎలా ఖరారు చేస్తారని అడిగారు. ఇది కోర్టులో నిలబడుతుందా?అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ విస్తరణకు సంబంధించి మరికొంత కాలం ఆగాలని కోరారు. ఢిల్లీలో ఏక్యూఐ 400 దాటిందని వివరించారు. హైదరాబాద్‌లో ఐదు రోజుల కింద ఏక్యూఐ 371 నమోదైందని అన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాలని చెప్పారు. ట్రాఫిక్‌ను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.

చలాన్లు వేసేందుకే పోలీసులు పనిచేస్తున్నారనీ, ఆ డబ్బులు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పావురాలు, కుక్కల సమస్య తీవ్రంగా ఉందన్నారు. హైదరాబాద్‌ ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పెద్ద ప్రాజెక్టులు కాకుండా ప్రజలకు కనీస వసతులు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలని కోరారు. చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, జూపార్క్‌, గోల్కొండ కోటను చూసేందుకు లక్షల మంది పర్యాటకులు వస్తున్నారనీ, వారికి కనీస వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దానివల్ల హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ తగ్గుతుందన్నారు. వైఎస్‌ ఫ్యాబ్‌సిటీ, కేసీఆర్‌ ఫార్మాసిటీ అన్నారనీ, అవి రద్దయ్యాయని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌ సిటీ అంటున్నారనీ, అది నెరవేరాలని కోరుకుంటున్నానని అన్నారు.

3 కార్పొరేషన్ల పేర్లు ఏంటి? : దానం
జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసిందనీ, వాటి పేర్లు చెప్పాలని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ విస్తరణ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. మూడు పోలీస్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మిగతా శాఖలు ఒకే గొడుగు కింద ఉంటాయా? వేర్వేరుగా ఉంటాయా?అని అడిగారు.

క్రెడిట్‌ కోసం విస్తరణ చేయొద్దు : కూనంనేని
హైదరాబాద్‌ మహానగరం విస్తరించామనే క్రెడిట్‌ కోసం చేయొద్దని సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు సూచించారు. పరిపాలనా సామర్థ్యం జాగ్రత్తగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ, ట్రాఫిక్‌, తాగునీరు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తిరుగుతుంటే కొత్తగూడెంలోనే రోడ్లు నయం అనే అభిప్రాయం కలుగుతోందన్నారు. అరగంట వర్షం వస్తే ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోతుందని చెప్పారు. డ్రైనేజీ, ట్రాఫిక్‌, తాగునీరు, మౌలిక సదుపాయాలపై నిపుణులతో మాట్లాడాలని సూచించారు. మహానగరం అభివృద్ధిపై బ్లూప్రింట్‌ తయారు చేసి ముందుకెళ్లాలని కోరారు.

రంగారెడ్డి జిల్లా అస్తిత్వం కోల్పోయే ప్రమాదం : మల్‌రెడ్డి రంగారెడ్డి
జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల విలీనం వల్ల రంగారెడ్డి జిల్లా అస్తిత్వం కోల్పోయే ప్రమాదముందని కాంగ్రెస్‌ సభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాప్రతి నిధుల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అధికారులు ఇష్టమొచ్చినట్టు చేస్తే ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. వార్డులను ఇష్టమొచ్చినట్టు విభజించారని విమర్శించారు. మ్యాప్‌ను బట్టి విభజిస్తారా? క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూసి విభజిస్తారా?అని ప్రశ్నించారు. వార్డుల విభజన తప్పుల తడకగా ఉందన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి చేస్తే ప్రజాపాలన అవుతుందని చెప్పారు. ప్రభుత్వం సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్‌ భవిష్యత్‌ అంధకారం : పాల్వాయి హరీశ్‌బాబు
జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల విలీనంతో హైదరాబాద్‌ భవిష్యత్‌ అంధకారం అవుతుందని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. ఈ నిర్ణయం ప్రజల అభిప్రాయానికి విరుద్ధమనీ, దీన్ని వ్యతిరే కిస్తున్నామని చెప్పారు. కోటి ఉన్న జనాభా రెండు కోట్లు అవుతుందన్నారు. అధికార వికేంద్రీకరణ జరగాల్సిందిపోయి కేంద్రీకృతం చేస్తున్నారని అన్నారు. స్థానిక స్వపరి పాలన ధ్వంసమవుతుందని చెప్పారు. నగర శివారు ప్రాంతాల్లో పచ్చదనం, పర్యావరణం, వ్యవసాయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేతివృత్తులు, కులవృత్తులకు ప్రమాదం వస్తుందన్నారు. ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరుగుతాయని చెప్పారు. ప్రజల నడ్డి విరుగుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు, ఇతర అనుమ తుల కోసం తిరగాల్సి వస్తుందన్నారు. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల ఉనికి ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -