Sunday, October 19, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌ను వెంటాడుతున్న నిరుద్యోగ భూతం

బీహార్‌ను వెంటాడుతున్న నిరుద్యోగ భూతం

- Advertisement -

ఉద్యోగాల కల్పనపై హామీలు గుప్పిస్తున్న నేతలు

పాట్నా : బీహార్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల కల్పనపై ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌తో పాటు కొత్తగా రంగంలోకి దిగిన ప్రశాంత్‌ కిషోర్‌ కూడా ఎన్నికలు హామీలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేషియో (ఎల్‌ఎఫ్‌పీఆర్‌) యాభై ఐదు శాతం మాత్రమే ఉంది. ఎల్‌ఎఫ్‌పీఆర్‌ అంటే…పనిచేసే వయసున్న జనాభా శాతం. బీహార్‌ పట్టణ ప్రాంతాల్లోని పది మంది యువ మహిళల్లో ఒక్కరు మాత్రమే పని చేయడమో లేదా ఉపాధి కోసం ఎదురు చూడడమో జరుగుతోంది. దీనిని బట్టి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థమవుతోంది. బీహార్‌లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ సమస్యే ప్రధానంగా ముందుకు వస్తోంది. అందుకే అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ బరిలో ఉన్న మూడు కూటములు హామీలు ఇస్తున్నాయి.

ఎన్నికలు ఎన్ని వచ్చినా సమస్య అదే
బీహార్‌లో నిరుద్యోగ సమస్య ఈ నాటిది కాదు. 2020లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ అంశమే ప్రధానంగా నిలిచింది. పది లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాలు కల్పిస్తామని తేజస్వి యాదవ్‌ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ శాసనసభలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్ని ఎన్నికలు వచ్చినా, ఎన్ని మ్యానిఫెస్టోలు విడుదలైనా నిరుద్యోగ భూతం మాత్రం యువతను వెంటాడుతూనే ఉంది. లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. దీనికి కారణమేమిటో తెలుసుకోవాలంటే బీహార్‌లో ఉపాధి, ఉద్యోగాల కల్పనను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

వ్యవసాయమే ప్రధాన ఉపాధి
2023-24లో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే బీహార్‌లో ఎల్‌ఎఫ్‌పీఆర్‌ చాలా తక్కువగా ఉందని పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) తాజా వార్షిక నివేదిక చెబుతోంది. రాష్ట్రంలో 15-59 సంవత్సరాల మధ్య వయస్కులలో…అంటే పని చేయగలిగిన వారిలో 55 శాతం మందికి మాత్రమే ఉద్యోగమో లేదా ఉపాధో దొరుకుతోంది. పని కోసం వెతుకుతున్న వారు కూడా ఇందులోనే ఉంటారు. ఇక మిగిలిన 45 శాతం మంది పనిచేయరు. వేతనాలు తక్కువగా ఉండడం, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేకపోవడం, అవసరమైన నైపుణ్యం కొరవడడం దీనికి కారణం. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. అంటే వ్యవసాయంలోనే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారని అర్థం.

యువత పరిస్థితి మరింత అధ్వాన్నం
బీహార్‌ యువతలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 15-29 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఎల్‌ఎఫ్‌పీఆర్‌ కేవలం 34.6 మాత్రమే. మహిళల్లో ఇది మరింత తక్కువగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో 15.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో 10.7 శాతం మాత్రమే ఉంది. రాష్ట్రంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వారి ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి పది రోజుల ముందు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన పథకాన్ని ప్రారంభించారు. 75 లక్షల మంది మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో పది వేల రూపాయల చొప్పున జమ అయింది. ఇప్పటి వరకూ 1.21 కోట్ల మంది మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.12,100 కోట్లు జమ అయ్యాయి.

ఇదిలావుండగా మై బహిన్‌ మాన్‌ యోజన పథకం కింద అట్టడుగు వర్గాలు, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో నెలకు రెండున్నర వేల రూపాయల చొప్పున జమ చేస్తామని ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి హామీ ఇచ్చింది. పార్టీల హామీల మాట ఎలా ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత మాత్రం తమ బతుకులు ఎప్పుడు బాగు పడతాయా అని ఎదురు చూస్తూనే ఉంది.
బీహార్‌లో మహిళలు, పట్టభద్రులు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం అధికంగా ఉంది. పట్టభద్రుల్లో 14.7 శాతం, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లలో 19శాతం మంది నిరుద్యోగులే. ఉపాధి, ఉద్యోగాలు దొరికినా అసంఘటిత రంగంలోనే అధికంగా ఉంటోంది. బీహార్‌లో 90.8 శాతం మంది పురుషులు, 78.8 శాతం మంది మహిళలు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారే. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా జీతం భత్యం లేని ఇంటి పనితోనే కాలక్షేపం చేస్తున్నారు.

హామీల వరద
శాసనసభ ఎన్నికల లోపు యాభై వేల ఉద్యోగాలు కల్పిస్తామని, ఆ తర్వాత వచ్చే ఐదేండ్ల కాలంలో కోటి మందికి ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆగస్ట్‌ 22న బోధ్‌ గయలో హామీ ఇచ్చారు. ఆ వేదికపై ప్రధాని మోడీ కూడా ఉన్నారు. ఆర్జేడీ నేత, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ కూడా ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. బీహార్‌లోని ఏ ఒక్క కుటుంబంలో కూడా యువత నిరుద్యోగంతో ఉండకూడదని, తేజస్వి అందరికీ ప్రభుత్వోద్యోగాలు ఇస్తాడని, 17 ఏండ్ల కాలంలో ఎన్డీఏ చేయలేని పనిని తాము 17 నెలల్లో చేసి చూపెడతామని ఆయన తెలిపారు. అటు జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ కూడా నితీశ్‌, తేజస్విపై విమర్శలు సంధిస్తూ తాము అధికారంలోకి వస్తే పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -