Monday, August 4, 2025
E-PAPER
Homeజాతీయంమృత్యువుతో పోరాడి ఓడిన బాలిక

మృత్యువుతో పోరాడి ఓడిన బాలిక

- Advertisement -

– ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూత
– గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడం వల్లేనన్న మృతురాలి తల్లి
– బయటి వ్యక్తుల ప్రమేయంలేదన్న పోలీసులు
భువనేశ్వర్‌:
15 రోజులుగా మృత్యువుతో పోరాడిన ఓ బాలిక ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూసింది. ఒడిశాలోని పూరీ జిల్లాలోని భార్గవి నది ఒడ్డున జులై 19న బాలిక(15)ను గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అపహరించి, మండే పదార్థం పోసి నిప్పంటించినట్టు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంటల్లో కాలిపోతున్న బాలికను అక్కడి స్థానికులు రక్షించి వెంటనే పిపిలీ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. 70 శాతానికిపైగా కాలిన గాయాలైన ఆమెకు అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించి అనంతరం భువనేశ్వర్‌ ఎయిమ్స్‌కు మరుసటి రోజు ఢిల్లీ ఎయిమ్స్‌కు ప్రత్యేక విమానంలో తరలించారు. అక్కడ బాలికకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా ఫలితం లేకపోవడంతో బాలిక శనివారం రాత్రి కన్నుమూసింది. ఒడిశా పోలీసులు శుక్రవారం మేజిస్ట్రేట్‌ సమక్షంలో ఆమె వాంగ్మూలం నమోదు చేశారు.

గవర్నర్‌, సీఎం సంతాపం
ఈ ఘటనపై 15 రోజుల పాటు దర్యాప్తు చేసిన పోలీసులు బాలికకు నిప్పుపెట్టడంలో ఇతరుల జోక్యం లేదని తెలిపారు. ఇలాంటి సున్నితమైన అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోరారు. బాలిక మృతిపై ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు విచారం వ్యక్తం చేశారు. ఒడిశా సీఎం, మంత్రులు కూడా బాలిక మృతికి సంతాపం తెలిపారు. ”బాలిక మరణ వార్త విని షాక్కు గురయ్యాను. ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ఎయిమ్స్‌లోని ప్రత్యేక వైద్యుల బృందం అన్ని రకాలుగా ప్రయత్నించినా బాలికను కాపాడలేకపోయాం. బాలిక ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.” అని ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -