సేవా భావమే నాయకత్వాన్ని ఇనుమడింపజేస్తుంది
కొత్త డీఎస్పీల శిక్షణ ప్రారంభసభలో డీజీపీ వ్యాఖ్య
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పోలీసు శాఖలోకి కొత్తగా చేరిన డీఎస్పీలు ఈ శాఖ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆర్‌బీవీఆర్ పోలీస్ అకాడమీలో కొత్తగా చేరిన 112 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) అధికారులకు శిక్షణ ప్రారంభోత్సవ సభ జరిగింది. కొత్తగా చేరినవారిలో 38 మంది మహిళా అధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీపీ మాట్లాడుతూ… సేవా భావమే నాయకత్వ లక్షణాన్ని మరింతగా వికసింపజేస్తుందనీ, అధికారులంటే అహంకారంతో వ్యవహరించడం కాదని వారికి ఉద్బోధించారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ పోలీస్ కుటుంబంలోకి అడుగుపెడుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో కూడుకున్న అతిపెద్ద బ్యాచ్ ఇదేనని వెల్లడించారు.
పోలీసు అధికారి చట్టాన్ని అమలు చేయడమే కాకుండా దాని ఆత్మను అర్థం చేసుకోవాలని, నిష్పాక్షికత, ఓర్పు, సహానుభూతి వంటి విలువలే ఒక అధికారిని ఉత్తమంగా తీర్చి దిద్దుతాయని చెప్పారు. ప్రజలు మిమ్మల్ని అధికారులుగా కాకుండా న్యాయప్రతినిధులుగా చూస్తారని డీజీపీ తెలిపారు. శిక్షణ కఠినమైనదే అయినా ప్రతి క్రమశిక్షణా చర్యలో ఒక అర్థం ఉందని చెప్పారు. గ్రేహౌండ్స్, అక్టోపస్, సీఐ సెల్, టీజీసీఎస్‌బీ, ఈగిల్ వంటి ప్రత్యేక సంస్థల ద్వారా తెలంగాణ పోలీస్ ఆధునిక పోలీసింగ్‌లో దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీమ్స్, భరోసా సెంటర్స్, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలకు నిదర్శనాలని చెప్పారు. ఈ బ్యాచ్‌లో 38 మంది మహిళా అధికారులు ఉండటం గర్వకారణమనీ, తెలంగాణ పోలీస్ భవిష్యత్తు మీరేనని అన్నారు. గౌరవం, సమానత్వం ఇక్కడి నుంచే ప్రారంభమవ్వాలని సూచించారు.
తెలంగాణ ప్రజలు తమ పోలీసులపై అపార విశ్వాసం కలిగి ఉన్నారనీ, ఆ విశ్వాసం మనం సంపాదించుకు న్నదని తెలిపారు. ప్రొబేషనరీ అధికారులు నిజాయితీ, సహానుభూతి, వృత్తి నైపుణ్యత అనే మూడు ప్రాథమిక విలువలను పాటించాలని సూచించారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ మాట్లాడుతూ.. పదినెలల పాటు జరగనున్న ఈ శిక్షణ కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. మొదటి దశలో 42 వారాల పాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిలబస్ కాపీలను డీజీపీ ఆవిష్కరించారు. శిక్షణ పొందుతున్న ట్రైనీలు వారి అనుభవాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం భగవత్, పోలీస్ కమిషనర్లు వి.సి సజ్జనార్, సుధీర్‌బాబు, అవినాశ్ మహంతి, ఐజీపీలు, అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



