Tuesday, February 10, 2026
E-PAPER
Homeబీజినెస్ఐదేండ్లలో ఐదు రెట్ల వృద్ధి లక్ష్యం

ఐదేండ్లలో ఐదు రెట్ల వృద్ధి లక్ష్యం

- Advertisement -

– ఎస్‌బీఐ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ భారీ విస్తరణ..!
– 2030 నాటికి రూ.15 లక్షల కోట్ల ఏయూఎం : ఎస్‌బీఐ చైర్మెన్‌ చల్లా శ్రీనివాసులు వెల్లడి
ముంబయి :
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారంలో నూతన మైలురాళ్లను నెలకొల్పాలని నిర్ణ యించుకుంది. 2030 నాటికిి ఈ విభాగంలోని నిర్వహణ ఆస్తుల విలువ (ఎయూఎం)ను ఏకంగా రూ.15 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ బ్యాంక్‌ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. మార్చి 2025 నాటికి ఈ వ్యాపార విలువ సుమారు రూ.2.83 లక్షల కోట్లుగా ఉండగా.. రానున్న ఐదేండ్లలో దీని ఐదు రెట్లు పెంచాలని బ్యాంక్‌ యోచిస్తోంది.

ప్రజల్లో పొదుపు పట్ల పెరుగుతున్న అవగాహన, ఆర్థిక క్రమశిక్షణ ఈ వృద్ధికి ప్రధాన కారణం కానున్నాయని శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బ్యాంక్‌ వద్ద ఉన్న రూ.4 లక్షల కోట్ల వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఆస్తుల్లో ఎక్కువ భాగం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ ఖాతాల రూపంలోనే ఉన్నాయి. కాగా.. భవిష్యత్తులో పెట్టుబడుల వాటాను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

2030 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న రూ.15 లక్షల కోట్లలో కనీసం రూ.4 లక్షల కోట్ల మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌, బాండ్లు, ఇతర పెట్టుబడి సాధనాల ద్వారానే రావాలని ఎస్‌బీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ సేవల కోసం బ్యాంక్‌ ఇప్పటికే 1,068 మంది ప్రత్యేక రిలేషన్‌షిప్‌ మేనేజర్లను నియమించింది. ధనిక, ఉన్నత వర్గాల వినియోగదారులకు వారి రిస్క్‌ సామర్థ్యాన్ని బట్టి అత్యుత్తమ పెట్టుబడి సలహాలను అందించడం ద్వారా ఈ విభాగంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని ఎస్‌బీఐ నిర్దేశించుకుంది.

ఎస్‌బీఐ వెల్త్‌ అనేది ఎస్‌బీఐ అందించే ఒక వీఐపీి సర్వీస్‌ లాంటిది. ఈ సర్వీసు పొందాలంటే ఖాతాదారుడికి బ్యాంక్‌లో డిపాజిట్లు, ఇన్వెస్ట్‌మెంట్లు కలిపి కనీసం రూ.30 లక్షలు ఉండాలి. లేదా నెలకు కనీసం రూ.2 లక్షల సంపాదన కలిగిన వారికి ఈ సేవలను అందిస్తుంది. బ్యాంక్‌కు వెళ్తే సాధారణ కౌంటర్ల వద్ద కాకుండా ప్రత్యేక లాంజ్‌లలో సర్వీస్‌ అందిస్తారు. లాకర్‌ ఫీజులు, డెబిట్‌ కార్డ్‌ ఫీజులు లేదా చెక్‌ బుక్‌ ఛార్జీలపై వీరికి భారీ తగ్గింపులు లేదా మినహాయింపులు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -