– అందుకు తగినట్టుగానే స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన
– క్రీడాభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం
– తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్
ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని రూపొందించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలు ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తుండగా.. భారత్ ఒక్క పసిడి పతకం సాధించలేని దుస్థితిలో ఉండటం ఎంతో బాధించింది. విశ్వ క్రీడల్లో భారత్ పతక వేట సులభతరం కావాలి, అందుకు తెలంగాణ క్రీడాకారులు ముందంలో నిలవాలనే సంకల్పంతో రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. స్పోర్ట్ కల్చర్ సష్టించేందుకు, యువత క్రీడలపై ఫోకస్ పెట్టేందుకు ప్రభుత్వాలతో పాటు కార్పోరేట్ కంపెనీలు, క్రీడాకారుల సహకారం అవసరం. ఒలింపిక్స్‌లో పతక వేటకు తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ ఓ బంగారు దిక్సూచిగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి వేదికగా తొలి తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్పోర్ట్స్ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై… క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్జ్ చైర్మెన్ కే. శివసేనా రెడ్డి, క్రీడాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, శాట్జ్ ఎండీ సోనీ బాలాదేవిలతో కలిసి తెలంగాణ నూతన క్రీడా విధానాన్ని ఆవిష్కరించారు. భారత మేటీ క్రీడాకారులు అనిల్ కుంబ్లే, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, పుల్లెల గోపీచంద్, అంజూ బాబి జార్జ్, అనూప్ యమా తదితరులు స్పోర్ట్స్ కాంక్లేవ్ చర్చాగోష్టిలో క్రీడాభివద్దికి తీసుకోవాల్సిన చర్యలపై విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డుకు వ్యాపారవేత్త సంజీరు గోయెంకా చైర్‌పర్సన్‌గా, సినీ నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.
క్రీడా పోటీలకు హైదరాబాద్ వేదిక
తెలంగాణ స్పోర్ట్స్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘ హైదరాబాద్ అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదికగా నిలిచిన ఘన చరిత్ర కలిగి ఉంది. నేషనల్ గేమ్స్, ప్రపంచ మిలటరీ గేమ్స్ సహా ఆఫ్రో ఆసియా క్రీడలకు నగరం వేదికైంది. క్రీడా స్టేడియం కారణంగానే గచ్చిబౌలి వేగంగా అభివద్ది చెందింది. గత పదేండ్లలో పాలకులు క్రీడలను పట్టించుకోలేదు. ఫలితంగా యువత, విద్యార్థులు మత్తుపదార్థాలకు బానిసలుగా మారారు. డ్రగ్స్, గంజాయి ఊబిలో చిక్కుకుంటున్న యువతను సరైన దారిలో పెడుతున్నాం. యువతను మైదానాలకు రప్పించి.. క్రీడలను ఎంచుకుని కెరీర్‌లో ఎదిగేలా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాం. 2026 ఖేలో ఇండియా గేమ్స్ లేదా జాతీయ క్రీడలను హైదరాబాద్‌లో నిర్వహించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కోరాం. 2036 ఒలింపిక్స్‌కు భారత్‌కు ఆతిథ్యం అందిస్తే.. రెండు క్రీడాంశాల పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరామని’ అన్నారు.
క్రీడల్లో మనది ఘనమైన చరిత్ర
క్రీడల్లో హైదరాబాద్, తెలంగాణకు ఘనమైన చరిత్ర ఉంది. 1956 ఒలింపిక్స్ భారత ఫుట్‌బాల్ జట్టులో ఏకంగా 9 మంది క్రీడాకారులు హైదరాబాద్‌కు చెందిన వారే. మహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్, నందిని అగసార, దీప్తి జీవాంజి సహా ఎంతో మంది క్రీడాకారులు హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. నిఖత్ జరీన్, సిరాజ్‌ను ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగిగా నియమించగా.. పారాలింపిక్స్ మెడలిస్ట్ దీప్తిని గ్రూప్-2 ఉద్యోగిగా నియమించాం. మేటీ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నాం. గడిచిన పదేండ్లలో క్రీడలకు ఆదరణ లేక స్టేడియాలు ఫంక్షన్‌హాల్స్‌గా తయారైన పరిస్థితి నుంచి ఇప్పుడు క్రీడా పోటీలతో కళకళలాడుతున్న దశ్యాలను చూస్తున్నామని సీఎం అన్నారు.
క్రీడల్లోనూ బలమైన దేశంగా..
భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా వద్ది చెందుతోంది. ఇదే సమయంలో బలమైన స్పోర్ట్స్ నేషన్‌గానూ ఎదగాలి. అందుకే 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌లో క్రీడాభివద్దికి ప్రత్యేక చాప్టర్ కేటాయించాం. ఆ లక్ష్య సాధన దిశగా క్రీడల్లో మంచి ఫలితాలు సాధిస్తున్న వారిని ఈ వేదికపైకి ఆహ్వనించాం. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో రాజకీయ జోక్యం తగ్గించేందుకు ప్రయివేటు-పబ్లిక్ భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నాం. క్రీడాభివద్దికి పాటుపడుతున్న క్రీడాకారులు, కార్పోరేట్ కంపెనీలు సహా ఈ రంగంలో విశేష అనుభవం ఉన్న వారితో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డును ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు.
దక్షిణ కొరియా సహకారంతో.. :
దక్షిణ కొరియా చిన్న దేశం. పారిస్ ఒలింపిక్స్‌లో 32 పతకాలు సాధించింది. అందులో 16 పతకాలు కొరియా స్పోర్ట్స్ యూనివర్శిటీ నుంచి వచ్చినవే. ఆ దేశ పర్యటన సందర్భంగా స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శించాను. అక్కడ ఒలింపిక్ పతక విజేతలకు అందిస్తున్న శిక్షణ, మౌళిక సదుపాయాలను మన దగ్గర ఏర్పాటు చేయాలని అనుకున్నాను. అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ రూపకల్పన చేశాం. ఇందులో స్పోర్ట్స్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ అకాడమీలు ఉంటాయి. మన స్పోర్ట్స్ యూనివర్శిటీకి కొరియా స్పోర్ట్స్ యూనివర్శిటీ నుంచి కోచింగ్ సహకారం ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఆరు సంస్థలతో కీలక ఒప్పందాలు
తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ వేదికగా క్రీడామంత్రిత్వ శాఖ పలు ఎంఓయూ ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రంలో క్రీడాభివద్ది, క్రీడాకారులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాల శిక్షణలో దోహదం చేయగల క్రీడా సంస్థలు, అకాడమీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నారు. భారత మాజీ కెప్టెన్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు చెందిన టెన్‌విక్, ఒలింపిక్ మెడలస్ట్- షఉటర్ గగన్ నారంగ్‌కు చెందిన గన్ ఫర్ గ్లోరీ, ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత- దిగ్గజ షఉటర్ అభినవ్ బింద్రాకు చెందిన ఓవెప్ సహా ఫిఫా టాలెంట్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మహిళా అథ్లెట్లను సానపట్టేందుకు ఆస్పైర్ ఫర్ హర్… బాస్కెట్‌బాల్‌లో ప్రతిభాన్వేషణ సహా విదేశీ కోచ్‌లతో శిక్షణ నిమిత్తం స్పోర్ట్స్‌ప్రీ సంస్థలతో సైతం ఎంఓయూలు కుదిరాయి.
ఒలింపియన్లే మెంటార్లుగా..
తెలంగాణలో క్రీడాకారులను ప్రపంచ శ్రేణి అథ్లెట్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారత మేటీ అథ్లెట్లు, ఒలింపియన్లతో మెంటార్‌షిప్ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందుకోసం గగన్ నారంగ్, అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్‌తో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా షఉటర్ల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ప్రతి మూడు నెలలకు ఓసారి గగన్ నారంగ్ టెక్నికల్ సెషన్స్ నిర్వహించనున్నాడు. ఎలైట్ అథ్లెట్ శిక్షణ, ఇంజూరీ మేనేజ్‌మెంట్ సహా ఫర్‌ఫర్మామెన్స్ మానిటరింగ్ కోసం క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్)తో కలిసి అభినవ్ బింద్రా పని చేయనున్నాడు. తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభాన్వేషణ, శిక్షణ నమూనా, కోచింగ్ ప్రమాణాల పెంపుపై పుల్లెల గోపీచంద్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
నగదు ప్రోత్సాహకాలు
ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్జ్ చైర్మెన్ శివసేనా రెడ్డి నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన నందిని అగసార (హెపథ్లాన్)కు రూ. 5 లక్షలు, టేబుల్ వాల్ట్ ఈవెంట్‌లో కాంస్యం అందుకున్న జిమ్నాస్ట్ నిషిక అగర్వాల్‌కు రూ. 3 లక్షలు, ప్రపంచ డెఫ్ ప్రపంచ షఉటింగ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన పారా షఉటర్ ధనుశ్ శ్రీకాంత్‌కు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఈజిప్టియన్ పిరమిడ్స్ గోల్‌బాల్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్న పవన్ కళ్యాణ్, సాయితేజలకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES