– మహా జాతరకు చారిత్రాత్మక వసతులు : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
– మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర-2026 ఏర్పాట్లలో భాగంగా మంత్రులు శనివారం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించారు. రవాణా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మేడారం జాతరకు సందర్శకుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 4,000 ఆర్టీసీ బస్సులను ప్రణాళి కబద్ధంగా నడుపుతున్నామని, అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులను వెంటనే పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ఏర్పాట్ల కోసం రవాణా శాఖ తరపున వందలాది మంది అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, జాతర ప్రయాణ సేవలను అధికారికంగా ప్రారంభించినట్టు చెప్పారు. బస్సుల సేవలు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సహా ఉన్నతాధికారులంతా జాతర విజయవంతానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారని అన్నారు. సందర్శకులు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులనే వినియోగించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సొంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్, ఎక్కువ నడక వంటి ఇబ్బందులు తప్పవని, ఆర్టీసీ బస్సులు గద్దెలకు సమీపంలోనే దించు తాయని తెలిపారు. జాతర సమయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను తల్లిదండ్రులు వినియోగించు కోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా తప్పిపోయిన పిల్లలను వేగంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంటుందని తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 2024లోనే సీఎం రేవంత్‌రెడ్డి మేడారం జాతరకు రవాణా మౌలిక వసతులు కల్పించాలనే దూరదృష్టితో ముందడుగు వేశారని చెప్పారు. ఈసారి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మేడారానికి వచ్చి రవాణా ఏర్పాట్లను పరిశీలించారని, ఇందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సందర్శకులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో బస్ డిపో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వెంటనే స్పందించి దాదాపు రూ.5కోట్ల వ్యయంతో శాశ్వత బస్ డిపోను మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పనులు చేపట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. ఏటూరు నాగారం ప్రాంతంలో ఆర్టీసీ డిపో మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడి నుంచి భద్రాచలం సహా ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉండేవని, ఆర్టీసీ డిపో ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. మేడారం ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలకు, గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్, ఆర్టీసీ ఈడీవో-ఓ మునిశేఖర్, ఈడీ ఇంజనీరింగ్ వెంకన్న, సీటీఎం, సీఅండ్‌ఎం శ్రీధర్, వరంగల్ ఆర్‌ఎం విజయభాను, డిప్యూటీ ఆర్‌ఎం బానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
శాశ్వత రవాణా సౌకర్యాలే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



