”విజన్ 2047 డాక్యుమెంట్” ద్వారా నిర్దేశించాం
హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపేలా ప్రణాళికలు
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్
రెండేండ్లలో 62,749 ఉద్యోగాల కల్పన
1.30 కోట్ల మందికి ఉచిత సన్నబియ్యం పంపిణీ
మేడారం అభివృద్ధికి రూ.251 కోట్లు : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సమగ్ర, సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఆయన భద్రతాదళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం… ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ రెండేండ్లలో సాధించిన ప్రగతిని వివరించారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ డాక్యుమెంట్ ద్వారా అసమానతలు లేకుండా అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా లక్ష్యాలను నిర్దేశించామని తెలిపారు. కోర్, ప్యూర్, రేర్ పేర్లతో రాష్ట్రాన్ని మూడు ఎకనమిక్ జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ (బాపూఘాట్), మెట్రో రెండో దశ, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ జోన్ ద్వారా ఔటర్ రింగ్‌రోడ్, రీజినల్ రింగ్‌రోడ్ మధ్య గల ప్రాంతాన్ని తయారీ రంగం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రూరల్ అగ్రికల్చర్ రీజినల్ ఎకానమీ జోన్ ద్వారా ట్రిపుల్ ఆర్‌కు బయట వ్యవసాయం, హరిత ఆర్థికవ్యవస్థ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. మేడారం అభివృద్ధికి రూ.251 కోట్లు కేటాయించినట్టు గవర్నర్ వెల్లడించారు. రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామనీ, 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. సన్నవడ్లకు బోనస్‌గా రూ.1,780కోట్లు అందజేశామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. గతేడాది బతుకమ్మ వేడుకలు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాయని పేర్కొన్నారు. భూ వివాదాలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు.
62 వేల ఉద్యోగాలు..
గ్రూప్-1, 2, 3 ద్వారా రెండేండ్లలో 62,749 ఉద్యోగాలు భర్తీ చేశామని గవర్నర్ తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లుగా మార్చి, తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రయివేట్ విద్యా సంస్థలతో సమానంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థుల మెస్ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచామని వివరించారు. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేందుకుగాను 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు. అలాగే పోలీస్ సిబ్బంది పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభించామని గవర్నర్ తెలిపారు.
మహిళా సాధికారతే….
మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని గవర్నర్ అన్నారు. వారిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని తెలిపారు. రెండేండ్లలో బ్యాంకుల ద్వారా మహిళలకు రూ.40 వేల కోట్లు సమకూర్చామన్నారు. మహిళలను పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులకు ఓనర్లుగా చేశామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే 200 కోట్ల మంది ఉచిత ప్రయాణాలు చేశారని వెల్లడించారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం 27 ఎకరాల్లో రూ.2వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టిందని తెలిపారు.
4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు…
ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. చెంచులకు ప్రత్యేకంగా 10 వేల ఇండ్లను కేటాయించామని తెలిపారు. నిధులను నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తున్నామని వివరించారు. చేనేత కార్మికులకు రూ.5లక్షల బీమా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ”తెల్ల రేషన్ కార్డుల ద్వారా 1.03 కోట్ల కుటుంబాలకు చెందిన 3.34 కోట్ల మందికి లబ్ది చేకూరుతోంది. ప్రతి నెలా 2.10 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. పాఠశాలలు, హాస్టళ్లకు 6,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందిస్తున్నాం. 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సన్నబియ్యం అందిస్తున్నాం” అని గవర్నర్ వివరించారు.
ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థే లక్ష్యం…
”కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే క్రమంలో తెలంగాణ సైతం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఈ లక్ష్యసాధనకు తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని రూపొందించింది” అని గవర్నర్ వివరించారు. సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, ఐటీ రంగంలో రాష్ట్రం విశేష పురోగతి సాధించిందన్నారు. ”మన దేశం, మన తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి. రాజ్యాంగ విలువలను పరిరక్షించాలి. ప్రజలు శాంతి, గౌరవం, సౌభాగ్యంతో జీవించాలి” అని గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు తదితరులు హాజరయ్యారు.



