రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక- 2035 ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు 2030 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో పేర్కొన్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక-2035’ను గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ డి. రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రాబోయే ఐదేండ్లలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రణాళికలో నిర్దేశించారు.
వచ్చే ఐదేండ్లలో రూ. 921.40 కోట్లు సాగు పెట్టుబడిగా, అలాగే రూ. 942.50 కోట్లు డ్రిప్ కోసం పెట్టుబడిగా కేటాయిస్తే, ఒక్క రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళిక పేర్కొంది. ఈ విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా రూ. 1,341 కోట్ల ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది. వివిధ పంటల్లో మిగులు, ఉత్పత్తి లోటు ప్రాతిపదికగా కార్యాచరణను అమలు చేయాలనీ, మిగులు ఉత్పత్తి ఉన్న పంటలు, లోటు ఉత్పత్తి ఉన్న పంటలు గుర్తించి, వాటికి అనుగుణంగా విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, పంట యాజమాన్యం, మార్కెటింగ్ వంటి అంశాలను ప్రణాళికలో సమగ్రంగా వివరించారు. ఈ ప్రణాళిక పుస్తకాన్ని డాక్టర్ డి. రాజిరెడ్డి, డాక్టర్ ఎ. భగవాన్, డాక్టర్ జి.పి. సునంది తదితరులు రూపొందించారు.
ఉద్యానపంటల ఉత్పత్తి పెంపే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES