నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణచారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ చారి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. వైద్య విద్యార్థులకు స్థానికత కల్పించే జీవో నెంబర్ 33 అమలుపై నీట్ పేరెంట్స్ చేపట్టిన ఉద్యమం, సుప్రీంకోర్టును ఆశ్రయించి నీట్ విద్యార్థుల తరఫున ఆ కేసులో ఇంప్లీడ్ అయి సాధించుకున్న విజయాల గురించి చర్చించారు. నీట్ పేరెంట్స్ అసోసియేషన్ కమిటీని ఎన్నుకున్నారు. నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా మల్లోజు సత్యనారాయణ చారి, ప్రధాన కార్యదర్శిగా పొడిశెట్టి రమేష్, ముఖ్య సలహాదారులుగా బీరెల్లి కమలాకర్‌రావులి, ఉపాధ్యక్షులుగా బొడ్డుపల్లి అంజయ్య, జాయింట్ సెక్రెటరీలుగా డి రఘుపతి, రాజు, కోశాధికారిగా ఎం శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ భాస్కర్‌రావు, కె రవికుమార్, పి సుజాత, కార్యవర్గ సభ్యులుగా గడ్డం స్వప్న, పబ్బం మానస, కె నరహరి, టి రత్న ప్రసాద్, నరేందర్‌రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ చారి మాట్లాడుతూ వైద్య విద్యార్థుల స్థానికతకు సంబంధించిన 33 జీవో గతేడాది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో 86 మంది తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీట్లు కోల్పోయారని వివరించారు. ఈ ఏడాది కూడా మళ్లీ అదే విధంగా 459 మంది విద్యార్థులు వైద్య సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు. 33 జీవో కచ్చితంగా అమలు చేయాలని పలు ఉద్యమాలు చేపట్టి విజయవంతం అయ్యామన్నారు. తెలంగాణ స్థానికతకు సంబంధించి ఆ జీవో అమలుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించామని వివరించారు. రాష్ట్రస్థాయి కమిటీతోపాటు ఉమ్మడి 10 జిల్లాల స్థాయిలో ఇన్‌చార్జీలను నియమించామని సత్యనారాయణ చారి, రమేష్, బీరెల్లి కమలాకర్ రావు చెప్పారు. నీట్ మెంటార్ జైపాల్ లాండే పలువురు నీట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నీట్ కౌన్సెలింగ్‌పై అవగాహన కల్పించారు.