– బసవతారకం ఆస్పత్రి చైర్మెన్ బాలకృష్ణ
– ఆస్పత్రిలో రెండో అత్యాధునిక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్
అందరికీ అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, భవిష్యత్‌లోనూ ఇదే సేవాభావాన్ని కొనసాగిస్తామని బసవతారకం ఆస్పత్రి చైర్మెన్, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించే లక్ష్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రి ప్రాంగణంలో రూ.2 కోట్లతో సిద్ధం చేసిన రెండో అత్యాధునిక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ఆస్పత్రి చైర్మెన్ బుధవారం ప్రారంభించారు. అనంతరం స్వయంగా బస్సును డ్రైవ్ చేసి సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. అలాగే ఆస్పత్రి రేడియాలజీ విభాగంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చికిత్సలో కీలకమైన ఆధునీకరించిన బ్రాకీ థెరపీ యూనిట్‌ను బాలకృష్ణ ప్రారంభించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ సమయంలో రోగులకు వచ్చే ప్రమాద స్థాయిని అంచనా వేసేందుకు రూపొందించిన ప్రత్యేక యాప్‌ను, క్యాన్సర్‌కు సంబంధించిన క్లిష్ట పదాలను సులభంగా అర్థమయ్యేలా పెద్ది సాంబశివరావు క్రోడీకరించిన క్యాన్సర్ పదజాల కోశాన్ని చైర్మెన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశంలో క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు అమెరికాకు చెందిన డా.తులసీదేవి పోలవరపు సహకారంతో ప్రత్యేక స్క్రీనింగ్ బస్సును ఏర్పాటు చేశామన్నారు. ఈ మొబైల్ స్క్రీనింగ్ యూనిట్‌లో డిజిటల్ ఎక్స్‌రే, డిజిటల్ మామోగ్రామ్, డిజిటల్ అల్ట్రాసౌండ్‌తోపాటు పలు అత్యాధునిక పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఒక బస్సు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తూ మూడు లక్షల మందికిపైగా సేవలందించామని వివరించారు. రెండో బస్సుతో మరింత విస్తృతంగా సేలు అందిస్తామని, క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించడంతోపాటు వ్యాధిని అరికట్టే దిశగా ముందుకెళ్తామని చెప్పారు. తన తల్లి నందమూరి బసవతారకం ఆశయాలను కొనసాగిస్తూ, ధనిక-పేద తేడా లేకుండా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న రోగులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా రోగులు తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకుని క్యాన్సర్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చని సూచించారు. సాంబశివరావును ప్రత్యేకంగా అభినందించారు.
40 వీల్‌చైర్ల స్వీకరణ
క్యాన్సర్ రోగుల సహాయార్థం ఖమ్మ జిల్లాకు చెందిన కె.రామచంద్రరావు అందించిన 40 వీల్‌చైర్లను బాలకృష్ణ స్వీకరించారు. క్యాన్సర్‌పై పోరాటంలో రామచంద్రరావు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఆస్పత్రి అభివృద్ధికి సహకరిస్తున్న దాతలు, సిబ్బంది, యాజమాన్య సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు జెఎస్‌ఆర్.ప్రసాద్, సీఈవో డా. కె.కృష్ణయ్య, మెడికల్ డైరెక్టర్ డా.టియస్‌రావు, మెడికల్ సూపరింటెండెంట్ డా.ఫణి కోటేశ్వరరావు, అసోసియేట్ డైరెక్టర్ (అకాడెమిక్స్) డా.కల్పనా రఘునాథ్‌తోపాటు పలు విభాగాల అధిపతులు, వైద్యులు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.
అందరికీ అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



