Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం

- Advertisement -

రవాణా శాఖలో నిరంతర పర్యవేక్షణ
జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్స్‌
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు
పెనాల్టీతోపాటు ఓవర్‌ లోడింగ్‌ వాహనాలు సీజ్‌
రోడ్‌ సేఫ్టీపై ప్రజల్లో విస్తృత అవగాహన
మహిళలకు ఆటో అనుమతులు ఇచ్చేందుకు సానుకూలత : రవాణాశాఖ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రవాణా శాఖలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా కార్యాచరణ ప్రణాళికను కఠినతరం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ఈ పర్యవేక్షణ కోసం జిల్లాల స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో మూడు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా వాహన నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై పెనాల్టీతోపాటు ఓవర్‌ లోడింగ్‌ వాహనాలు సీజ్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్‌ సేఫ్టీ మంత్‌పై ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి మహిళా ఆటో అనుమతులు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో రవాణా శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజూ విధిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఆ రోజు చేయాల్సిన పర్యవేక్షణ ప్రాంతాలపై ఆయా బృందాలకు ఉదయం ఆరు గంటలకు రవాణా శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం తెలపాలని కోరారు. ముఖ్యంగా ఓవర్‌ లోడింగ్‌ లారీలు, బస్సులు, మినరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇసుక, ఫ్లైయాష్‌, రాళ్లు, బిల్డింగ్‌ మెటీరియల్స్‌, వాహనాల ఫిట్‌నెస్‌, పొల్యూషన్‌, చలానాలపై ఈ పర్యవేక్షణ బృందాలు తనిఖీలు చేస్తాయని వివరించారు. వాటికి అదనపు పెనాల్టీతోపాటు వాహనాలను సీజ్‌ చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కో బృందంలో డీటీసీ,ి ఎంవీఐ, ఏఎంవీఐ ఇతర సిబ్బంది ఉంటారని వివరించారు. గత నెలలో రద్దు చేసిన చెక్‌ పోస్ట్‌ల్లో పనిచేసిన సిబ్బందిని కూడా ఈ తనిఖీల్లో పనిచేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లపై వేధింపులకు గురి చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు.

పర్యవేక్షణ మార్గదర్శకాల్లో ప్రధానంగా
జేటీసీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయడానికి జిల్లాల నుంచి ఎంవీఐ, ఏఎంవీఐలను నెలవారీ రొటేషన్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీ చేయడానికి ఈ స్క్వాడ్‌ను ఉపయోగిస్తారు. జేటీసీ-హైదరాబాద్‌, డీటీసీిలు ప్రభుత్వ సెలవు దినాలతోసహా అన్ని సమయాల్లో కనీసం ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం రోడ్డుపై ఉండే విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను మోహరించేలా చూసుకోవాలి. హైదరాబాద్‌లోని జేటీసీ, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, సంగారెడ్డి డీటీసీలు ప్రతి వారం కనీసం రెండుసార్లు అంతర్రాష్ట్ర కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ బస్సులపై తనిఖీలు నిర్వహించేలా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలి.

ఫిట్‌నెస్‌ గడువు ముగిసిన వాహనాలు, ముఖ్యంగా భారీ వస్తువుల వాహనాలు, బస్సులు ఎల్లప్పుడూ సీజ్‌ చేయబడతాయి. ఓవర్‌ స్పీడ్‌ వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఓవర్‌లోడ్‌ గూడ్స్‌ వాహనాలను ఎల్లప్పుడూ సీజ్‌ చేయాలి. ముఖ్యంగా సీసీ బస్సులు, బహుళ ఈ-చలాన్లు/వీసీఆర్లు ఉన్న భారీ వస్తువుల వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా తిరిగే వాహనాలు, ముఖ్యంగా భారీ, మధ్య తరహా వస్తువుల వాహనాలు ప్రయాణీకుల వాహనాలు, విద్యాసంస్థల బస్సులు సీజ్‌ చేయబడతాయి. వస్తువుల వాహనాల్లో ఓవర్‌లోడింగ్‌ వాహనాలను స్వాధీనం చేసుకోవాలి.

సంబంధిత అధికారులు ప్రారంభ పాయింట్ల వద్దనే ఓవర్‌లోడింగ్‌ ముప్పును అరికట్టడానికి అమలు ప్రణాళిక వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. మైనింగ్‌ విభాగానికి ఓవర్‌లోడ్‌ వాహనాల వివరాలను కూడా తెలియజేస్తుంది. టిప్పర్లు, ఓపెన్‌ ట్రాలీ వాహనాలు వస్తువుల వాహనాలు దుమ్ము దులపకుండా టార్పాలిన్‌తో సరిగ్గా కప్పబడనీ వాహనాలపై చర్యలు, సీసీ బస్సుల్లో సీట్ల మార్పు, అత్యవసర నిష్క్రమణను నిరోధించడం వంటి అనధికార మార్పులు చేస్తే చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిట్‌నెస్‌ గడువు ముగిసిన ఈఐబీల జాబితాను సేకరించి, రోడ్లపై తిరుగుతున్నట్టు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. గత వారం చేవెళ్ల బస్సు ప్రమాదం అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తీసుకున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. వారం రోజుల వ్యవధిలో 2,576 వాహనాలపై కేసులు నమోదు చేశామని వివరించారు.

ఇందులో ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న 352 లారీలు, 43 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. రవాణా శాఖ సిబ్బందికి ప్రతి 30 మందికి ఒక బ్యాచ్‌ చొప్పున శిక్షణ ఇవ్వాలని సూచించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి మహిళా ఆటో అనుమతులు ఇచ్చేలా కార్యాచరణ తీసుకోవాలని చెప్పారు. వచ్చే రోడ్‌ సేఫ్టీ మంత్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఇన్నోవేటివ్‌ కార్యక్రమాలను రూపొందించాలని కోరారు. పిల్లల అవగాహన పార్క్‌లను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, కమిషనర్‌ ఇలంబర్తి, జేటీసీలు రమేష్‌, చంద్రశేఖర్‌, శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -