Wednesday, January 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం

- Advertisement -

– కామారెడ్డిలో హెల్మెట్‌ నమూనాను ఆవిష్కరించిన మంత్రి సీతక్క
– ఇందిరా గాంధీ విగ్రహావిష్కరణ
నవతెలంగాణ-కామారెడ్డి

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ‘అరైవ్‌, అలైవ్‌’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) అన్నారు. నూతన హెల్మెట్‌ నమూనాను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్రతో కలసి కామారెడ్డి కొత్త బస్టాండ్‌ సమీపంలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కొత్త హెల్మెట్‌ నమూనా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో పాటు సౌకర్యవంతంగా, తేలికగా రూపొందించబడిందని తెలిపారు. యువతతో పాటు అన్ని వయస్సుల వారు హెల్మెట్‌ను నిత్యం వినియోగించేలా అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే ‘అరైవ్‌, అలైవ్‌’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతా స్పృహను పెంచుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కార్‌, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌, కామారెడ్డి కాంగ్రెస్‌ నాయకులు, సంబంధిత అధికారులు, రవాణా శాఖ ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరా గాంధీ విగ్రహావిష్కరణ..
కామారెడ్డిలోని రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఇందిరా చౌక్‌ వద్ద మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ కుమార్‌ షెట్కార్‌ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ మహిళా సాధికారతకు ఆద్యురాలని అన్నారు. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సిద్ధాంతమే ఇందిరమ్మ మార్గమని తెలిపారు. మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీకి కామారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ‘గరీబీ హటావో- దేశ్‌కో బచావో’ నినాదంతో ఆమె దేశంలోని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారని, బ్యాంకుల జాతీయీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ధీశాలి నాయకు రాలిగా ఆమె నిలిచారని తెలిపారు. జహీరాబాద్‌ ఎంపీ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ఒక వ్యక్తి కాదని, ఒక గొప్ప శక్తి అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -