ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు.. : రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్ బిన్ హందాన్
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశావాహుల జాబితా పరిశీలించి హైకమాండ్ ఆదేశానుసారం సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. లోకల్‌గా ఒక సర్వే, పార్లమెంట్ ఇన్‌చార్జి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి ద్వారా మరొకటి, ఇన్‌చార్జి మంత్రి జూపల్లి ఆదేశానుసారం మరో సర్వే.. ఇలా మూడు సర్వేలు జరుగుతున్నాయన్నారు. 26వ తేదీ వరకు పూర్తి సర్వేల రిపోర్టు వస్తుందని, వాటి ఆధారంగా గెలిచే సత్తా ఉన్న వారికే పార్టీ బీఫామ్ కేటాయిస్తుందని తెలిపారు. మున్సిపల్ పీఠం కైవసం చేసుకోవడమే పార్టీ లక్ష్యమన్నారు.
పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 49 వార్డుల్లో బలమైన గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధులనే బరిలో నిలుపుతామని అన్నారు. అన్ని సామాజిక తరగతులకు సమ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. బీజేపీతోనే తమకు పోటీ ఉందన్నారు. 250 మందికి పైగా పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. 40 వార్డులకు పైగా గెలవడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆత్మ చైర్మెన్ గిమ్మ సంతోష్, మాజీ డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, అర్చన రామ్ కుమార్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్‌ఖాన్, లోక ప్రవీణ్‌రెడ్డి, గుడిపల్లి నగేష్, మునిగెల నర్సింగ్, సుఖేందర్, ఎంఏ షకీల్, డేరా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



