Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపారదర్శక సేవలే లక్ష్యం

పారదర్శక సేవలే లక్ష్యం

- Advertisement -

భూముల రీసర్వే కోసం ఆధునిక రోవర్ల కొనుగోలు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఉప ముఖ్యమంత్రి భట్టితో బడ్జెట్‌ సన్నాహక సమావేశంలో ప్రతిపాదన


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు, రైతులకు అత్యుత్తమ సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన 2026-27 బడ్జెట్‌ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖలకు సంబంధించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి పలు కీలక అంశాలను మీడియాకు వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించడానికి రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామని వివరించారు.

ఇందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి అత్యాధునిక ‘రోవర్‌’ పరికరాలతో భూముల సర్వే నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున 460 రోవర్లను కొనుగోలు చేశామని వివరించారు. వచ్చే బడ్జెట్‌లో మరో 400 రోవర్ల కొనుగోలుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో నక్షా (మ్యాప్‌) లేని 373 గ్రామాల్లో త్వరలోనే రీ-సర్వే చేపట్టబోతున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి 2026-27 బడ్జెట్‌లో తగిన నిధులను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టిని కోరామన్నారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆర్డీవో, తహశీల్దార్‌ కార్యాలయాలకు శాశ్వత ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రజా పరిపాలన సౌలభ్యం కోసం వాటికి అవసరమైన బడ్జెట్‌ కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొని శాఖల వారీగా నిధుల కేటాయింపు, అవసరాలపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -