– హైడ్రా వచ్చాకే బఫర్‌జోన్, ఎఫ్టీఎల్‌పై అవగాహన
– ఏడాది నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం : కమిషనర్ ఏవి.రంగనాథ్
– రవీంద్రభారతిలో ఘనంగా హైడ్రా వార్షికోత్సవం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రకృతి పరిరక్షణను మహాయజ్ఞంలా చేపట్టామని, రాజధానిని ముంపు నుంచి కాపాడి మంచి భవిష్యత్‌ను అందించడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోందని కమిషనర్ ఏవి.రంగనాథ్ తెలిపారు. హైడ్రా రాకతోనే కబ్జాలకు గురైన చెరువులను రక్షించుకోగలిగామన్నారు. హైడ్రా ఏర్పడి జూన్ 19తో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్ రవీంద్రాభారతిలో ‘ఇండ్ ఫేమ్ విజువల్ ఆర్ట్స్’ ఆధ్వర్యంలో ‘సామాజిక, పర్యావరణ అంశాలపై’ వివిధ పాఠశాలల చెందిన విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తిలకించారు. అనంతరం వార్షికోత్సవ వేడుకలలో కమిషనర్ ప్రసంగించారు. కబ్జాదారుల చెర నుంచి కాపాడిన చెరువులను పునరుద్ధరణ, పచ్చదనం, సుందరీకరణతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారంతో ఎన్నో సవాళ్లను సైతం ఎదుర్కొని విజయం సాధిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. ఏడాదిలో 500 ఎకరాల భూములను ఆక్రమణల చెర నుంచి విడిపించామని, వాటి విలువ మార్కెట్‌లో రూ.30వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఆరు చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, 75 ఎకరాల్లో పూడికను తొలగిస్తే 30కోట్ల లీటర్ల వరద నీటిని నిల్వచేసే వీలుంటున్నారు. ఈ ప్రయాణంలో అనేక ఆటంకాలు ఎదురౌతున్నా వెరవకుండా భవిష్యత్ తరాలకు పర్యావరణ ఫలాలు అందించేందుకు హైడ్రా అకుంఠిత దీక్షతో పని చేస్తోందన్నారు.
ప్రకృతి సంపదను కాపాడాలనే..
ప్రకృతి సంపదను కాపాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని కమిషనర్ తెలిపారు. గొలుసుకట్టు చెరువులను పరిరక్షించి భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను నెలకొల్పడమే కాకుండా, పోలీసు, మున్సిపాలిటీ, ఇరిగేషన్, రెవెన్యూ ఇలా వివిధ శాఖలకు చెందిన అధికారాలను కూడా ప్రభుత్వం కట్టపెట్టిందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ఆక్రమణల తొలగింపు చాలా కష్టతరమైనదని, కొంతమంది స్వార్థపరుల అత్యాశకు బలి కాకూడదని అన్నారు. హైడ్రా చర్యల వల్ల చిన్న పిల్లల్లో కూడా చెరువు, ఎఫ్‌టీఎల్, బఫర్ ఇలా అన్ని అంశాలపై అవగాహన కలిగిందన్నారు. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో కూడా హైడ్రా గురించి అభ్యర్థులను ప్రశ్నించారని గుర్తు చేశారు. హైడ్రా వంటి సంస్థ దేశవ్యాప్తంగా ఉన్నప్పుడే ప్రకృతిని కాపాడుకోగలమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రత్యేకంగా ఒక కథనాన్ని ప్రచురించిందన్నారు. హైడ్రా వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు.
అందరినీ ఆలోచింపజేసిన ప్రదర్శన
ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. చెరువుల ఆవశ్యకతను కొందరు వివరిస్తే.. చెరువులను అనుసంధానం చేసే నాలాల పరిరక్షణ గురించి మరికొందరు ప్రదర్శించారు. ప్రకృతి తరతరాలుగా వస్తున్న ఆస్తి.. అది అందరిదీ అని.. భావితరాలకు అందివ్వాల్సిన బాధ్యత ఉందని చిన్నారులు వివరించిన తీరును చూసి అందరూ ముచ్చటపడ్డారు. హైడ్రా వార్షికోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, హైడ్రా కార్యక్రమాలపైన ‘ఇండ్ ఫేమ్ విజువల్ ఆర్ట్స్’ వ్యవస్థాపకులు దాస్యం గీతా భాస్కర్ నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించిన విద్యార్థులకు కూడా జ్ఞాపికలను హైడ్రా కమిషనర్ అందించారు.
పర్యావరణహిత నగరమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES