అమెరికా అప్పు రూ. 38 లక్షల కోట్ల డాలర్లు
ఆర్థిక సంక్షోభం వల్లే ఇరాన్ పై అమెరికా యుద్ధం
సీపీఐ(ఎం) అధ్యయన కమిటీ జిల్లా కన్వీనర్ బండారు రమేష్
నవతెలంగాణ – బోనకల్
పెట్టుబడి లక్ష్యం లాభం కానీ సోషలిజం లక్ష్యం ఆర్థిక సమానత్వం సాధించటమని సీపీఐ(ఎం) అధ్యయన కమిటీ జిల్లా కన్వీనర్ బండారు రమేష్ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల కేంద్రంలో గల వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో కారల్ మార్క్స్ 143 వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ‘సమకాలిన ప్రపంచం’అనే అంశంపై ఆదివారం సెమినార్ నిర్వహించారు.
ఈ సెమినార్ స్టడీ సర్కిల్ మండల కన్వీనర్ తెల్లాకుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సెమినార్ లో బండారు రమేష్ మాట్లాడుతూ పెట్టుబడి చివరకు యజమాని ప్రాణాలు కూడా తీస్తుంది అన్నారు. ఉత్పత్తి పెరిగినప్పుడు ఆ ఉత్పత్తి సమాజానికి పంపిణీ కానప్పుడు ఉత్పత్తిదారుడు దానిని ధ్వంసం చేస్తాడని ఆనాడే కారల్ మార్క్స్ స్పష్టం చేశారన్నారు. ఉత్పత్తి ద్వారా వచ్చిన లాభం పెట్టుబడిదారుడికే చెందుతుందని, కార్మికుడికి చెందదన్నారు. మనిషి యొక్క కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లున్నారు. ఉత్పత్తి పెరిగినప్పుడు, కొనుగోలు శక్తి కూడా పెరగాలన్నారు. ఇది పెట్టుబడిదారీ సమాజంలో సాధ్యం కాదని, కేవలం సోషలిస్టు వ్యవస్థలోనే సాధ్యమవుతుందన్నారు.
పెట్టుబడి లాభం కోసం చివరకు తన యజమానిని కూడా చంపుతుంది అన్నారు. పెట్టుబడి సహజంగా చౌకగా శ్రమ దొరికిన చోటకు, ముడి సరుకులు ఎక్కువగా ఉన్నచోటకు, టెక్నాలజీ ఉన్నచోటకు వెళ్తుందన్నారు. అమెరికాలో పారిశ్రామిక అభివృద్ధి లేదని, కేవలం సేవా వ్యవస్థ మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధికి పునాది వ్యవసాయ రంగం, పారిశ్రామికి రంగం, సేవ రంగం అన్నారు. ఈ మూడు రంగాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయన్నారు. పెట్టుబడికి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్పత్తిని అందరికీ సమానంగా పంచడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ అంగీకరించదన్నారు. ఉత్పత్తి పెరిగినప్పుడు అది ప్రజలకు చేరినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇరాన్, అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం చివరకు మన ఇంట్లో గ్యాస్ పొయ్యి వరకు వచ్చిందన్నారు. ఈ యుద్ధము వలన గ్యాస్ సమస్య ఏర్పడి దేశం ప్రస్తుతం అల్లకొల్లోలంగా ఉందన్నారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ పై యుద్ధం చేస్తుందని దీనికి కారణం అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందన్నారు.
ప్రపంచంలో అత్యంత అప్పు కలిగిన దేశం అమెరికా అన్నారు. ప్రస్తుతం అమెరికా అప్పు 38 లక్షల కోట్ల డాలర్లు అన్నారు. అమెరికాలో ఉత్పత్తి వ్యవస్థ కుప్ప కూలిపోయింది అన్నారు. అమెరికా ఆయుధాల సంపద మీదనే ఆధారపడి ఉందన్నారు. భూస్వామ్య వ్యవస్థలో దోపిడీదారుడు మనకు ఎదురుగా ఉంటాడని, కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీదారుడు మనకు కనిపించాడన్నారు. 200 సంవత్సరాల క్రితమే ఇటువంటి మార్పులు సంభవిస్తాయని కారల్ మార్క్స్ స్పష్టం చేశారన్నారు. ఆనాడు కారల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ గ్రంథం ఏమి చెప్పిందో ప్రస్తుతం అదే జరుగుతుందన్నారు.
ఈ సదస్సులో సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్, నాయకులు దొండపాటి సత్యనారాయణ, బంధం శ్రీనివాసరావు, గండు సైదులు, కోట కాటయ్య, బొప్పాల రమేష్, గుగులోతు నరేష్, పిల్లలమర్రి ఝాన్సీరాణి, జొన్నలగడ్డ సునీత, బిల్లా విశ్వనాథం, ఉప్పర శ్రీను, గద్దె రామారావు పిక్కల సీతారాములు, కొంగర భూషయ్య తదితరులు పాల్గొన్నారు.



