Thursday, December 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్రంలో కొత్త డిస్కంకు సర్కార్‌ ఆమోదం

రాష్ట్రంలో కొత్త డిస్కంకు సర్కార్‌ ఆమోదం

- Advertisement -

ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన శాఖ
ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌కు ఆదేశం
సబ్సిడీలు, రైతుల ఉచిత విద్యుత్‌కు కట్టుబడి ఉన్నాం
జీవోలో స్పష్టం చేసిన ప్రభుత్వం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మూడో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త డిస్కమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ బుధవారం జీవో నెంబర్‌ 44 విడుదల చేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ఇందన శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంల పరిధి ఎక్కువగా ఉండటం, విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు డిస్కంల ఆర్థిక కష్టాలను తీర్చేందుకు మూడో డిస్కం ఉపయోగ పడుతుందని సర్కార్‌ భావిస్తోంది. ఈ క్రమంలోనే మూడో డిస్కం ఏర్పాటుకు సంబందించి ప్రభుత్వం విధివిదానాలను ప్రకటించింది.

మూడో డిస్కం ఏర్పాటకు సూచించిన విధివిధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (ఎస్పీడీసీఎల్‌) నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (ఎన్పీడీసీఎల్‌) ప్రభుత్వం ఆదేశించింది. ఎల్‌టీ లైన్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, వినియోగదారులు, స్మార్టు మీటర్‌ హోల్డర్లు, మానవ వనరులను మూడో డిస్కంకు కేటాయించాలని పేర్కొంది. సరిహద్దుల నిర్దారణ, టీజీ జెన్కో, ఇంటర్‌-స్టేట్‌ సోలార్‌, సీజీఎస్‌, ఐపీపీలతో ఎస్పీడీసీఎల్‌కు 70.55, ఎన్పీడీసీఎల్‌కు 29.45 శాతం ఉన్న పవర్‌ పర్చెస్‌ అగ్రిమెంట్‌కు అనుగుణంగా మూడో డిస్కంకు విద్యుత్‌ కేటాయింపులు శాస్త్రీయంగా చేయాలని సూచించింది. మూడో డిస్కంకు 600 ఇంజినీర్లు, 1,000 ఆర్టిజన్లు, ఓఅండ్‌ఎం స్టాఫ్‌, 340 మంది ఆడ్మినిస్ట్రేషన్‌ సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. మూడో డిస్కం అమల్లోకి వచ్చేనాటికి వాటి ఆస్తులు, అప్పుల ఆధారంగా ప్రత్యేక బ్యాలెన్స్‌ షీట్‌ను సిద్దం చేయాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

సబ్సీడీలన్ని మూడో డిస్కం పరిధిలోకే
వ్యవసాయానికి, పేదల గృహాలకు 200 యూనిట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందించే పథకాలన్ని మూడో డిస్కం పరిధిలోకి తీసుకు రానున్నారు. ఇందుకు సంబంధించిన తాజాగా ప్రతిపాదించిన విధివిదానాలకు అనుగునంగా బదిలీ చేయనున్నారు. బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో రెండు డిస్కంలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ ముసాయిదా బిల్లుకనుగుణంగా రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని సంస్కరించే చర్యల్లో బాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -